Monday, October 19, 2020

Ap Transfers News



Read also:

బదిలీల ప్రక్రియ  విడుదలైన సుదీర్ఘ షెడ్యూల్‌పై విమర్శలు ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు

విడుదలైన సుదీర్ఘ షెడ్యూల్‌పై విమర్శలు

ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు

మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించటంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. బదిలీలకు, హేతుబద్ధీకరణకు అవినాభావ సంబంధం ఉండటంతో రెండు నెలల పాటు అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. జీవో నెం. 53, 54లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఈనెల 12న హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను, పాఠశాల విద్యాకమిషనరు ఈనెల 14న బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బదిలీల ప్రక్రియకు అడుగు ముందుకు పడినా నేటికీ ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ బదిలీల వల్ల లాభం కంటే నష్టమే అధికమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇందుకోసం 48 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను విడుదల చేశారు-ప్రస్తుతానికి షెడ్యూల్‌ ఇలా

●అక్టోబరు 19, 20న : అడహక్‌ పద్ధతిలో ఉద్యోగోన్నతులు

●21నుంచి 26 వరకు : సర్దుబాటు ప్రక్రియ

●27నుంచి 28 వరకు : పోస్టుల ఖాళీల ప్రకటన

●29నుంచి నవంబరు 2వరకు: ఆన్‌లైన్‌లో బదిలీలకు దరఖాస్తు చేయుడం

●నవంబరు 5నుంచి 9 వరకు: తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన

●నవంబరు 16 నుంచి 19 వరకు : తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన

●నవంబరు 19 నుంచి 21 వరకు : వెబ్‌ ఆప్షన్లు

●నవంబరు 22 నుంచి 27 వరకు స్థానాలు కేటాయింపు

●నవంబరు 30 : బదిలీ ఉత్తర్వుల ప్రదర్శన

●డిసెంబరు 1న: నూతన పాఠశాలల్లో ప్రవేశించడం.

హేతుబద్ధీకరణకు పీటముడులెన్నో

హేతుబద్ధీకరణలో గతంలో మాదిరిగా నిబంధనలు అమలు చేయనున్నారు. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధనతో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 60 మంది వరకు కేటాయించనున్నారు. 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయులను నియమించాలని ఎంతో కాలంగా సంఘాలు కోరుతున్నా విద్యాశాఖనుంచి సమ్మతి రాలేదు. సక్సెస్‌ పాఠశాలల్లో రెండు మాధ్యమాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాట్రన్‌ను నియమించాలని కోరినా మార్గదర్శకాల్లో అందుకు అనుగుణంగా పోస్టులు కేటాయించలేదు.

400 ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులకు ఎసరు

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ కావడంతో వాటిలో గ్రేడ్‌ -3 హెచ్‌ఎంలను నియమించనున్నారు. ఆ పోస్టులను ప్రస్తుతం పనిచేసే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టుల సంఖ్యతో క్యాడర్‌ స్ట్రెంగ్త్‌గా చూస్తున్నారని సంఘాలు తెలుపుతున్నాయి. ఎస్జీటీలు కనీసం ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా అయినా ఉద్యోగోన్నతి పొందుదామన్న ఆశలకు కూడా గండిపడినట్లేనని తెలుపుతున్నారు. అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు ఉద్యోగ విరమణ పొందినా విద్యార్థుల నమోదు ఎక్కువగా లేని కారణంతో ఆయా పోస్టులను కూడా తగ్గించనున్నట్లు సమాచారం.

ఆదర్శ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి

2015లో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 80 మంది కంటే ఎక్కువగా ఉంటే నలుగురు ఎస్జీటీలతో పాటు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేశారు. ఆయా పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకారం 61 నుంచి 80 మధ్య విద్యార్థులుంటే మూడు పోస్టులు మాత్రమే ఉండే అవకాశముంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులుంటాయో... లేదో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పాఠశాలల్లో ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటం వల్ల విద్యాబోధన సక్రమంగా అందుతుందని, ఉపాధ్యాయులను తగ్గిస్తే ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల బోధన జరుగుతోంది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దే వద్ధు.

2015లో జరిగిన బదిలీల్లో ప్రవేశపెట్టిన వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానంపై సరైన అవగాహన లేకపోవటంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగటం, ఐచ్ఛికాల ఎంపికలో అవగాహన లేకపోవటంతో దూరప్రాంతాలకు వెళ్లిపోయారు. 2017లో వెబ్‌కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడితో నాటి ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం కొవిడ్‌-19 ప్రభావంతో తిరిగి ఆ విధానాన్ని విద్యాశాఖ తీసుకొని రానుండడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సంఘాలతో చర్చలు సఫలమయ్యేనా

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేశారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ కమిషనరు చర్చలు జరపడంతో దీక్షలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. ఈ సమావేశంలో ఫ్యాప్టో అనేక డిమాండ్లు పెట్టగా చర్చించి నిర్ణయం తెలియజేస్తామని కమిషనరు తెలిపారని సంఘాల నాయకులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియలో సమస్యలు తొలగించి సజావుగా పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :