Thursday, February 18, 2021

అమ్మఒడి పథకంపై పిల్‌ మూసివేత



Read also:

సాక్షి, అమరావతి: కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రాథమిక సమాచారం లేకుండా పిల్‌ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, సీజే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారంతో తిరిగి పిల్‌ దాఖలు చేసుకోవచ్చంది.

ఈ–వాచ్‌’పై తదుపరి విచారణ 25కి వాయిదా

పంచాయతీ ఎన్నికల నిర్వ హణకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) సొంతంగా ఈ–వాచ్‌ పేరుతో యాప్‌ను రూపొందించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ–వాచ్‌ యాప్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏపీటీఎస్‌ఎల్‌) లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వివరణ ఇచ్చిందని, దీన్ని పరిశీలించేందుకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–వాచ్‌ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వడంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్‌’, ‘నిఘా’లను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు న్యాయవాది కట్టా సుధాకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఇవే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలి, బుర్రిపాలెంలకు చెందిన ఎ.నాగేశ్వరరావు, ఎ.అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా పిల్స్‌ వేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :