Wednesday, January 8, 2020

YS Jagan letter on AmmaVodi scheme



Read also:


జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ.15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఈమేరకు ‘జగనన్న అమ్మ ఒడి’కి ఎంపికైన పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన, పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అమలు కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం లేఖలో తెలిపారు. లేఖలోని అంశాలు ఇవీ.

మాట నిలబెట్టుకుంటున్నా

జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా. పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ కలలు నెరవేరతాయని భావించా. అందుకని ‘అమ్మ– ఒడి’ అనే పథకం ప్రారంభిస్తానని, ప్రతి పేదింటి తల్లికీ పిల్లల చదువులకోసం ఆర్థిక సహాయం అందచేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చా. ఆ మాట నిలుపుకొంటూ ఇప్పడు రూ.15,000 మీ బ్యాంకు ఖాతాకు, పాతబకాయిలకు సర్దుబాటు చెయ్యకుండా నేరుగా బదిలీ చేస్తున్నాం. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని మరింత బాగా చదివించుకోవాలని కోరుకుంటున్నా.

దేశంలోనే తొలిసారి

పిల్లల చదువుకు తల్లుల పేదరికం అడ్డుకాకూడదని మన ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి. మీలాంటి తల్లులు దాదాపు 43 లక్షల మందికి సుమారు రూ.6,455 కోట్ల మేర ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

మరో మూడు విప్లవాత్మక చర్యలు

మీ పిల్లలను బడికి పంపించాక చక్కటి చదువు చెప్పటం కోసం మరో మూడు విప్లవాత్మక చర్యలు కూడా తీసుకుంటున్నాం. మొదటిది పిల్లలకు చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం మన పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. రెండోది.. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు మెరుగుపరుస్తూ ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖల్ని మూడేళ్లలో మార్చబోతున్నాం. ఇక మూడవది.. పిల్లలకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం మరింత నాణ్యమైనదిగా, పుష్టికరంగానూ ఉండేందుకు సంక్రాంతి సెలవుల తరువాత నుంచి కొత్త మెనూ అమలు చేయబోతున్నాం.మీ పిల్లలు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ.YS Jagan

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :