Friday, February 26, 2021

EPFO WhatsApp service



Read also:

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు ఒక శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్- EPFO తాజాగా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో ఈపీఎఫ్‌ఓ కస్టమర్లు సులభంగా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికీ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందే EPFO ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్ రిడ్రెస్సల్ ఫోరంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ హెల్ప్ లైన్ నంబర్‌ను తాగా ప్రకటించింది.

ఇప్పటికే EPFIGMS, CPGRAMS పోర్టళ్లను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేకంగా 24x7 కాల్ సెంటర్ కూడా ఉంది. వీటికి అదనంగా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అవసరమైన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు.

వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?

EPFOకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ వాట్సప్ హెల్ప్ లైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. పీఎఫ్‌ కాంట్రిబూటర్లు ఇప్పుడు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు కస్టమర్లు ముందు EPFO వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. వెబ్‌ పేజీలో ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్‌ నంబర్లు కనిపిస్తాయి. సంబంధిత రీజినల్ ఆఫీస్ వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. పీఎఫ్‌ కాంట్రిబూషన్, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని చాట్ లిస్ట్‌లో టైప్ చేసి సెండ్ చేయాలి. వివిధ రకాల సమస్యలను కూడా ఈ వాట్సాప్ నంబర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. గ్రీవెన్స్ రాసి పంపవచ్చు.

డిజిటల్ సేవలు పొందవచ్చు

కరోనా మహమ్మారి వెలుగు చూసిన తరువాత ప్రభుత్వ సంస్థలు డిజిటల్ బాట పట్టాయి. వైరస్ భయాల నేపథ్యంలో EPFO కార్యాలయాలకు వెళ్లేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించట్లేదు. దీంతో వివిధ మార్గాల్లో డైరెక్ట్ ఇంటరాక్షన్ కమ్యునికేషన్‌ను ఆ సంస్థ చందాదారులకు కల్పిస్తోంది. ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్‌ను మరింత బలోపేతం చేసేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ ఉపయోగపడనుంది. ఇప్పుడు కస్టమర్లు ఇంటి నుంచే పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. EPFO ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదులు చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :