Wednesday, January 13, 2021

Whatsapp given clarity on the new Privacy Policy



Read also:

Whatsapp given clarity on the new Privacy Policy
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీపై మరోసారి వివరణ ఇచ్చింది. యూజర్ల సందేశాలను ఎవరూ చదవలేరనీ.కాల్స్‌ కూడా ఎవరూ వినలేరని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ అమలు చేయనున్న కొత్త ప్రైవసీ పాలసీపై తీవ్ర గందరగోళం నెలకొనడంతో పాటు చాలా మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వైపు తరలుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. వాట్సాప్ నూతన ప్రైవసీ విధానంపై... ప్రత్యేకించి దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై యూజర్లలో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వాట్సాప్ స్పందిస్తూ.. కొత్త అప్‌డేట్ల వల్ల ప్రజల సందేశాల గోప్యతపై ఎలాంటి ప్రభావం పడబోదని స్పష్టం చేసింది. ‘‘బిజినెస్‌ మెసేజింగ్‌కి సంబంధించి కీలక మార్పులతో పాటు తాజా అప్‌డేట్‌లో డేటా సేకరణ, వినియోగంపై మరింత పారదర్శకత వస్తుంది.అని వాట్సాప్ పేర్కొంది. కాల్స్‌ని వినడంగానీ, మెసేజ్‌లు చదవడంగానీ తాము చేయబోమనీ.. కాల్స్ లాగ్‌ని కూడా తమ వద్ద ఉంచుకోబోమని తెలిపింది. తాముగానీ, ఫేస్‌బుక్‌గానీ యూజర్లు షేర్ చేసుకున్న లొకేషన్ చూడబోమని వెల్లడించింది.

కాంటాక్ట్‌లను కూడా ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమనీ.. సందేశాలను కనిపించకుండా సెట్ చేసుకోవచ్చని వాట్సాప్ వివరించింది. ‘‘వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల, సహోద్యోగులు మధ్య జరిగే సంభాషణలు వినబోవు.  సందేశాలను చదవడం  జరగదు. మీరు ఏది షేర్‌ చేసుకున్నా అది మీ మధ్యే ఉంటుంది. ఎందుకంటే మీ సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌తో భద్రంచేసి ఉంటాయి. ఈ భద్రతను మేము ఎప్పటికీ బలహీనం చేయబోం. ప్రతి చాట్‌కి మేము లేబుల్ వేయడాన్ని గమనించడం ద్వారా మా చిత్తశుద్ధిని మీరు తెలుసుకోవచ్చు..’’ అని వాట్సాప్ పేర్కొంది. గ్రూప్‌లు ఎప్పటికీ ప్రైవేట్‌గానే ఉంటాయనీ.. సందేశాలను బట్వాడా చేసేందుకు తాము గ్రూప్‌ మెంబర్షిప్‌ని వినియోగించుకుంటామని తెలిపింది. గ్రూపుల్లోని సమాచారాన్ని ప్రకటన కోసం ఫేస్‌బుక్‌తో షేర్‌చేసుకోవడం జరగదని స్పష్టం చేసింది. యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్  చేసుకోవచ్చునని కూడా వాట్సాప్ పేర్కొంది.

అయితే వాట్సాప్ ఏ సమాచారాన్ని సేకరిస్తుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఫేస్‌బుక్ ఖాతా తెరుస్తున్నప్పుడు ఎలాంటి సమాచారాన్ని మీరు ఇస్తారో.అలాగే యూజర్ల నుంచి వాట్సాప్ సేకరించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో ఆటోమేటిగ్గా షేర్ చేసుకుంటుంది. దీంతో పాటు మీ యూజర్ యాక్టివిటీని కూడా షేర్ చేసుకుంటుంది. అంటే.వాట్సాప్‌ని మీరు ఎన్నిసార్లు చూస్తున్నారు, ఏయే ఫీచర్లు వాడుతున్నారు, మీ ఫ్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లతో పాటు ‘ఎబౌట్’ ఇన్ఫర్మేషన్‌ని కూడా ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది. మీరు ఏ డివైజ్ వాడుతున్నారు, మీ మొబైల్ నెట్‌వర్క్, ఐపీ అడ్రస్‌ వంటి డివైజ్ స్థాయి సమాచారాన్ని కూడా వాట్సాప్ సేకరిస్తుంది. డివైస్‌లో లొకేషన్ ఆన్ చేయగానే మీ లొకేషన్ వివరాలను సేకరించడంతో పాటు, లొకేషన్‌ ఆఫ్ చేసినప్పుడు మీరున్న ప్రాంతాన్ని అంచనా వేసేందుకు ఏరియా కోడ్‌ను  సేకరిస్తుంది. అయితే వినియోగదారులు ఎవరితోనైనా లొకేషన్ షేర్ చేసుకుంటే మాత్రం దానికి ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ చెప్పుకొచ్చింది. తాము తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్ తమ సర్వీసులను, ఫేస్‌బుక్ ఆఫర్లను మరింత అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుందని తెలిపింది. మీ సమాచారం ఆధారంగా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలు మీకు ‘సలహాలు’ ఇవ్వడంతో పాటు, మీ అభిరుచికి తగిన ప్రకటనలు, ఫీచర్లు, కంటెంట్‌ను చూపిస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :