Thursday, November 5, 2020

పాఠశాలల్లో కరోనా ఘంటికలు



Read also:

  • విశాఖ జిల్లాలో 46 మంది ఉపాధ్యాయులకు
  • పశ్చిమలో 22 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు పాజిటివ్‌

పాఠశాలలు తెరిచిన తర్వాత పలు జిల్లాల్లో కరోనా ఘంటికలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు కేసులు బయటపడ్డాయి. విశాఖ జిల్లాలో బుధవారం 46 మంది ఉపాధ్యాయులకు, నలుగురు బోధనేతర సిబ్బందికి కొవిడ్‌ సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు పాఠశాలల్లో 22 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. కామవరపుకోట మండలం తూర్పుయడవల్లి ఉన్నత పాఠశాలలో పదిమంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు హుటాహుటిన శానిటైజేషన్‌, పరిశుభ్రత పనులను చేపట్టారు.

రాష్ట్రంలో కొత్తగా 2,477 మందికి వైరస్‌

రాష్ట్రంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య మొత్తం 75,465 మందికి పరీక్షలు చేయగా..వారిలో 2,477 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 8,33,208కి, మరణాలు 6,744కు చేరాయి.

దిల్లీలో మూడోసారి కరోనా ఉద్ధృతి-ఒకేరోజు 6725 కొత్త కేసులు

దేశ రాజధానిలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేరోజు 6725 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇప్పుడు కరోనా ‘మూడో విజృంభణ’ కనిపిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నందువల్ల భయపడాల్సిందేమీ లేదని, తగినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని విలేకరులకు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఐసీయూ పడకల సంఖ్యపై దిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాల్సిందిగా సుప్రీంకోర్టును బుధవారమే ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

కేరళ, దిల్లీల్లో 4 లక్షలకు పైగా కేసులు నమోదైనప్పటికీ మరణాల విషయంలో రెండింటి మధ్య భారీ అంతరం ఉంది. కేరళలో 1,559 మంది, దిల్లీలో 6,652 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలో రోజువారీ కేసులు 5వేల లోపునకు పరిమితమయ్యాయి. వరుసగా పదోరోజు దేశవ్యాప్తంగా 50వేలలోపు కేసులు నమోదయ్యాయి. మరణాలు గత మూడు రోజులకంటే పెరిగాయి. దేశం మొత్తంమీద కొత్తగా 46,253 కేసులు రావడంతో మొత్తం కేసులు 83,13,876కి చేరాయి. ఒకరోజు వ్యవధిలో 514 మంది చనిపోయారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :