Sunday, January 12, 2020

Ap Election infomation and new districts



Read also:


స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శర వేగంగా చేస్తున్న కసరత్తుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా బ్రేక్‌ వేయనుందా? ప్రభుత్వంలోని కీలకమైన నేతల నుండి ఈ దిశలోనే సంకేతాలు అందుతున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమని ఒకవైపు చెబుతూనే మరోవైపు కొత్త జిల్లాల ప్రకటనను తెరమీదకు తీసుకు రావడం ద్వారా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా వేగంగా జరుగుతున్నట్లు రాష్ట్ర మంత్రి ఒకరు విలేకరులకు చెప్పారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం ఈ నెల 26వ తేది (గణతంత్ర దినోత్సవం) నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ నెల 18వ తేదిన జరగనున్న మంత్రిమండలి సమావేశంలోనే ఈ దిశలో చర్చ జరిగి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 17వ తేది తర్వాత ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ చేపడతామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. ఒకసారి కోడ్‌ అమలులోకి వచ్చిన తరువాత కీలక ప్రకటనలు చేయాల్సిఉంటే ఇసి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియచేసి కొత్త జిల్లాల ప్రకటన చేసే అవకాశం ఉంది. షెడ్యూల్‌ విడుదలను కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకోవాలని కోరే అవకాశంకూడా ఉన్నప్పటికీ అటువంటి విజ్ఞప్తిని అధికారికంగా ప్రభుత్వం చేయడానికి అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు.
అయితే, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరువాత కొత్త జిల్లాల ప్రకటన వస్తే జడ్‌పిటిసి స్థానాల ఖరారు నుండి, రిజర్వేషన్ల వరకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితి వస్తే షెడ్యూల్‌ను రద్దు చేయడం, లేదా కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకోకుండా పాత షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత జిల్లా పరిషత్‌లను విభజించడానికి అవకాశం ఉందని అంటున్నారు. వీటిలో ఏటి వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిఉంది. మరో మార్గాన్ని కూడా పరిశీలకులు చెబుతున్నారు. దీని ప్రకారం జడ్‌పిటిసి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయకుండా, పంచాయతి ఎన్నికలకు విడుదల చేస్తే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవించడంతో పాటు, ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. అమరావతి పరిసర గ్రామాల్లో పంచాయతీ సంస్థల ఎన్నికలకే ప్రభుత్వం సిద్ధమౌతోందన్నట్టు వార్తలు వస్తుండటం కూడా ఈ సందర్భంగా గమనార్హం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :