Tuesday, March 16, 2021

AP ఎస్ఈసీ నిమ్మగడ్డకు మరో షాక్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలు రద్దు చేయడం కుదరదన్న హైకోర్టు



Read also:

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరో షాక్ తగిలింది. ఏపీలో పట్టుపట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవతంగా ముగించారు.  అయితే ఆ ఎన్నికలను వద్దని  వైసీపీ ప్రభుత్వం అడ్డుపడినా.. కోర్టు ద్వారా విజయం సాధించిన నిమ్మగడ్డ.. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు కూడా రెడీనే అన్నారు. అయితే కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని ఆయన గతంలో చెప్పారు.. ఇప్పుడు హైకోర్టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కీలక తీర్పు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేసు విచారించిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.  ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాటిపై‌ విచారణకు ఆదేశించారు.

అయితే ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తాజాగా తుది తీర్పు ప్రకటించింది.  గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదన్న పిటిషనర్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.  ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా  126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు ఫిర్యాదులు అందాయి. చాలాచోట్ల అధికార పార్టీకి చెందిన వర్గీయులు బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని విపక్షాలు ఆరోపించాయి.  ఈ ఆరోపణలపై స్పందించిన ఎస్ఈసీ  విచారణ చేయాలని కోర్టును కోరింది. తాజా కోర్టు తీర్పుతో ఇక ఏకగ్రీవాలు ఫైనల్ అయినట్టే.. దీంతో ఇంకా మిగిలిన 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.  ఇప్పుడు ఏకగ్రీవాలపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టే మరి ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తాజాగా కోర్టు తీర్పుపై అధికార పార్టీ  స్వాగతిస్తోంది. తమ వాదనే నెగ్గింది అంటోంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇదే వరుసలో నిర్వహిస్తే.. విజయాల ఉత్సాహాన్ని కొనసాగించవచ్చని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :