Thursday, November 19, 2020

మళ్లీ లాక్‌డౌన్ అంటున్న ప్రభుత్వం



Read also:

మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిందే అంటోంది ఢిల్లీ సర్కారు. కనీసం నగరంలో మార్కెట్లనైనా మూసి వేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాలుష్యంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు కేజ్రీ సర్కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్యను 200 నుంచి 50 తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్ మళ్లీ విధించాలన్న ప్రతిపాదనపై ఢిల్లీ వాసుల అభిప్రాయం ఎలా ఉందంటే

నిన్న మూడు వేల 7వందల కేసులు.. ఇవాళ 6వేల 4 వందల కేసులు. ఇదీ ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు. దీపావళి తర్వాత దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మంచు విపరీతంగా కురుస్తోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కరోనా వేగంగా వ్యాపిస్తుంది. పైగా ఇలాంటి వాతావరణంలో కరోనా సోకితే ప్రమాద తీవ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆంక్షలకు పదును పెడుతోంది కేజ్రీవాల్ సర్కారు.

ఆంక్షల అమల్లో భాగంగా ఇప్పటి వరకూ వివాహ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను 200 నుంచి 50కి తగ్గించారు. మాస్కుల్ని ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. వాహనాల్లో గుంపులు గుంపులుగా తిరిగే వారిపై కేసులు పెడుతున్నారు. ఆంక్షల అమలుతో పాటు పెరుగుతున్న కేసులకు తగ్గట్లు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లను పెంచేందుకు కేంద్ర రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయి. ఢిల్లీలో మార్కెట్ల ద్వారా కరోనా విస్తరిస్తోందని గుర్తించిన ప్రభుత్వం.. మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి అనుమతి కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది ఢిల్లీ సర్కారు.

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తే లేదని.. అదే సమయంలో కరోనాను నియంత్రించాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. పరిమిత స్థాయిలో ఆంక్షలు అమలు చేస్తామని చెబుతోంది. ఢిల్లీ ప్రజలు కూడా మార్కెట్లను మూసి వేస్తే మంచిదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోందని.మార్కెట్లను మూసి వేస్తే కేసులు తగ్గుతాయని అంటున్నారు.

వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తూ ఉండటంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లను సిద్ధం చేయడం, బాధితులకు వైద్యం అందించేందుకు శ్రమిస్తున్నారు. ఢిల్లీలో నిన్న మొన్నటి వరకూ రోజుకి 20వేల టెస్టులే చేస్తున్నారు. ఇకపై రోజుకు లక్షకు పైగా టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :