Saturday, November 21, 2020

ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐ కీలక నిర్ణయాలు



Read also:

ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంతర్గత కమిటీ శుక్రవారం ఓ నివేదికను విడుదల చేసింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 15 ఏళ్ల తర్వాత ప్రమోటర్ల చెల్లింపు ఈక్విటీ వాటా పరిమితిని 26 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాకింగ్‌ నిబంధనల ప్రకారం ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ యాజమాన్య వాటాను మూడేళ్లలో 40%, 15 ఏళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంది.

బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేశాకే భారీ కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు బ్యాకింగ్‌ లైసెన్సులు ఇవ్వాలని కమిటీ సూచించింది.

పర్యవేక్షణ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయాలని పేర్కొంది. భారతీయ ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యం, కార్పొరేట్‌ స్ట్రక్చర్‌ మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీకే మహంతీ నేతృత్వంలో జూన్‌లో ఈ కమిటీ వేశారు.

ఐదేళ్ల లాకిన్‌ కాలపరిమితి ముగిసిన వెంటనే ఎప్పుడైనా ప్రమోటర్ల యాజమాన్య వాటాను 26 శాతానికి తగ్గించాలని కమిటీ సిఫార్సు చేసింది. నాన్‌ ప్రమోటర్ల వాటా విషయానికి వస్తే, ఓటింగ్‌ హక్కుతో కూడిన బ్యాంకు ఈక్విటీ చెల్లింపు వాటా పరిమితి 15%గా ఉండాలని నిర్ణయించింది. రూ.50వేల కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులున్న భారీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామంది. అయితే ఆ సంస్థలు కనీసం పదేళ్లు సేవలందించి ఉండాలని తెలిపింది. ఇక మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న పేమెంటు బ్యాంకులు మూడేళ్ల తర్వాత చిన్నతరహా బ్యాంకులుగా రూపాంతరం చెందే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ స్ట్రక్చర్‌ కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సుకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఒక కొత్త యూనివర్సల్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు తొలి చెల్లింపు మూలధనం లేదా నెట్‌వర్త్‌ను రూ.1000 కోట్లకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. చిన్న బ్యాంకులకైతే రూ.300 కోట్లని తెలిపింది. పట్టణ సహకార బ్యాంకులు చిన్న బ్యాంకులుగా మారేందుకు ఐదేళ్లకు రూ.300 కోట్లు చెల్లింపు మూలధనం ఉండాలంది. బ్యాంకింగ్‌ నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఇస్తే ఆ ప్రయోజనాలను బ్యాంకులకు వెంటనే కలగజేయాలని తెలిపింది. ఒకవేళ నిబంధనలను కఠినతరం చేస్తే అందుకు నిర్దేశిత గడువు ఇవ్వాలని సూచించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :