Sunday, October 25, 2020

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ లీ కున్-హీ కన్నుమూత



Read also:

శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్‌ లీ కున్‌-హీ (78) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని శామ్‌సంగ్ కంపెనీ వెల్లడించింది. 2014లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక, ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. "శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్(Samsung Electronics) ఛైర్మన్ లీ కున్-హీ మరణించాడనే వార్త తెలపడం చాలా విచారంగా ఉంది. కుటుంబసభ్యుల పక్కన ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన నిజమైన విజనరీ. అతని లెగసీ శాశ్వతమైనది" అని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

దక్షి కొరియాకు చెందిన శామ్‌సంగ్ కంపెనీని లీ కున్‌-హీ ప్రపంచ దిగ్గజ సంస్థ మార్చారు. తన తండ్రి శామ్‌సంగ్‌ వ్యవస్థాపకుడు లీ బైంగ్‌-చుల్‌ మరణం తర్వాత 1987లో లీ కున్‌ శామ్‌సంగ్‌ బాధ్యతలు చేపట్టారు. స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్‌ చిప్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేసే అగ్రగామి సంస్థగా అభివృద్ధి చేశారు. శామ్‌సంగ్ మొత్తం టర్నోవర్ దక్షిణ కొరియా స్థూల జాతీయోత్పత్తిలో ఐదో వంతకు సమానం. ఇక, లీ ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ఆయన కుమారుడు, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ లీ జే-యోంగ్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నాడు.

ఇక, లీ జే-యాంగ్‌కు 2017లో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు దక్షిణ కొరియా కోర్టు ఈ శిక్ష విధించింది. ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి లీ జే-యాంగ్‌. అభిశంసనకు గురైన ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గెయిన్ హెయికు లంచం ఇచ్చారనే ఆరోపణలపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అప్పీలుతో ఆయనను ఏడాది తర్వాత జైలు నుంచి విడుదల చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :