Friday, September 25, 2020

Pending salaries



Read also:

Pending salaries


రాష్ట ఉద్యోగుల పెండింగు జీతాలు, కరవు భత్యం, పీ ఆర్ సీ తదితర అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలని రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా సమయంలో తొలి రెండు నెలల జీతాలు, పెన్షన్లు సగం మాత్రమే  చెల్లించింది. ఆ  పెండింగు జీతాలు 12శాతం వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.  రెండు నెలల్లో చెల్లించాలని పేర్కొనడంతో ఆ గడువు సమీపించింది. 12శాతం వడ్డీ చెల్లించే విషయంలో రాష్ట ప్రభుత్వం సముఖంగా లేదు. అక్టోబరు నెలలో కోర్టు ఆదేశాల ప్రకారం ఈ మొత్తాలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  ఏ మార్గంలో వెళ్లాలనే విషయంలో ఒక మార్గ సూచి సిద్ధం చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు రంగం సిద్ధం  చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరు ఇందుకు సంబంధించి ఒక సమావేశం  అంతర్గతంగా ఏర్పాటు చేసుకుని మార్గం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందినట్లు తెలిసింది. మరో వైపు మూడు కరవు భత్యాలు రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఎప్పుడూ ఇంత పెండింగు లేదనేది ఉద్యోగుల మాట. ఈ విషయంలోను ప్రతి మంత్రి మండలి సమావేశం ముందు ఉద్యోగులు ఇందుకోసం ఎదురుచూస్తుంటారు.   ఈ విషయంలో రేపో , మాపో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా సమయంలో  ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా  ఉంది.  ఆర్థికశాఖ అధికారులు కీలకంగా చర్చించి తుది రూపు ఇవ్వాల్సిన విషయాల్లో  ఇది కూడా ఉందని సమాచారం. మరో వైపు 11వ  వేతన సవరణ కమిషన్  ఇప్పటికే  నివేదికను  కొలిక్కి తీసుకువచ్చింది. రాష్ర్ట ప్రభుత్వ పెద్దల గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురుచూస్తున్నట్లు గతంలోనే ఉద్యోగులు న్యూస్ వెల్లడించింది. మరోసారి వేతన సవరణ కమిషన్ గడువు పెంచబోతున్నారని కూడా  పేర్కొంది. అదే విధంగా సెప్టెంబరు 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వేతన సవరణ కమిషన్ తన నివేదికను కొలిక్కి తీసుకువచ్చింది.  ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందితే   నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉంది.  ఈ నివేదిక సమర్పణ పూర్తయితే ఇక అమలు భారం , బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటాయి.  ఆ నివేదిక అమలు చేయాలంటే రూ. కోట్లు అవసరమవుతాయి.  ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో పీ ఆర్ సీ  అమలుకు నిధులు ప్రతిపాదించింది లేదు. వేతన సవరణ కమిషన్  తన నివేదికను అందించేందుకు వీలుగా ప్రభుత్వం పచ్చజెండా ఊపాలంటే మరికొంత కాలం వేచి చూడక  తప్పదు.

ఆర్థికశాఖ అధికారులు ఈ మూడు అంశాలపై రాష్ట ప్రభుత్వానికి ఎంత భారం పడబోతోంది,  ఎలా ముందుకు సాగాలనే అంశాలపై చర్చించి ఒక కొలిక్కి తీసుకురావడం కోసమే  చర్చలు జరపబోతున్నారు. ప్రధానంగా పెండింగు జీతాలపై తక్షణ నిర్ణయంపై వీరి కసరత్తు ఉండబోతోంది.

కాంట్రిబ్యూటరీ పెన్షన్  స్కీంనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కసరత్తు చేస్తున్నారు. కొందరు అధికారుల నుంచి కొంత సమాచారం ఆమె కోరినట్లు చెబుతున్నారు.  వీటిపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎస్  సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :