Tuesday, September 10, 2019

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యంలో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే



Read also:

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వృద్ధి రేటు తగ్గిపోగా, స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సైతం 5 శాతానికి పతనమైంది. పరిస్థితి ఇలాగే మరో క్వార్టర్ లోనూ కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం ముంచుకురావడం తప్పనిసరి అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మాంద్యం అనగానే గుర్తుకు వచ్చేది నిరుద్యోగం, విపణిలో డిమాండ్ తగ్గిపోవడంతో పెట్టుబడి ఖర్చులు రాక, వ్యాపార లాభాలు అందకపోవడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుంది. ఫలితంగా ఆ ప్రభావం ఉత్పత్తి రంగంపై పడి దానిపై ఆధారపడిన ఉద్యోగులపై పడుతుంది. అదే ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతుంది. చివరకు కంపెనీలు ఖర్చు తగ్గించుకునే చర్యలు తీసుకుంటాయి.

అలాంటప్పుడే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాంద్యం సమయంలో వేతనాల పెంపు, పాటు ఇతర సౌకర్యాలను కంపెనీలు తగ్గిస్తుంటాయి. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

ఆరోగ్య బీమాతో శ్రీరామ రక్ష

ఇటీవలి కాలంలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఖర్చుల కోతల్లో భాగంగా ఉద్యోగులు బీమా సౌకర్యం కట్ చేసే ప్రమాదం లేకపోలేదు. లేదా ఉద్యోగం ఒక్కసారిగా ఊడిపోయినా ప్రమాదం ముంచుకొచ్చినట్లే. ఇలాంటి సమయంలో ఆరోగ్యం క్షీణించిందంటే అంతకు మించిన ఆపద మరొకటి ఉండదు. అందుకు తప్పనిసరిగా బీమా పాలసీని తీసుకోవడం మంచిది. వీలైతే కుటుంబం మొత్తానికి కలిపి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ఇంకా మంచిది. లేదంటే ఆర్థిక మాంద్యంలో నగదు లభ్యత తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలకు ఖర్చు భారం తగ్గించుకునేందకు బీమా పాలసీ అవసరం అవుతుంది.

క్రెడిట్ కార్డులే దిక్కు

మాంద్యం సమయంలో ఆర్థిక అవసరాల కోసం నగదు చాలా అవసరం అలాంటప్పుడు క్రెడిట్ కార్డులే దిక్కు అవుతుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు చాలా అవసరం అవతుంటాయి. ముఖ్యంగా వేతనం లేనప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా కాలం గడిపి కనీస చార్జీలు కట్టి డబ్బు సమకూరినప్పుడు బిల్లు చెల్లించుకోవచ్చు. చిన్న చిన్న అవసరాలకు అధిక వడ్డీలతో అప్పులు చేయడం తగ్గించుకోవాలి. అలాగే షాపింగ్, సినిమాలు, రెస్టారెంట్ల ఖర్చు తగ్గించుకుంటే సంక్షోభ సమయంలో గట్టెక్కవచ్చు. వీలైనంత వరకూ విహార యాత్రలు తగ్గించుకోవాలి.

అనవసర ఖర్చులు తగ్గించేసుకుందాం

అలాగే అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. దీంతో పాటు వ్యక్తిగత వాహనాలైన కారు, టూవీలర్ వాడకాన్ని తగ్గించుకొని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను ఉపయోగించుకుంటే ఖర్చులు తగ్గే వీలుంటుంది. అలాగే ఆదాయంలో ఖర్చులను ప్రణాళిక వేసుకొని ఖర్చుపెట్టాలి. ఉద్యోగంతో పాటు మరో ఆదాయ మార్గం వైపు కూడా ఆలోచించుకోవాలి. ఖాళీ సమయాల్లో ఆదాయ వనరులు పెంచుకునే మార్గం చూసుకోవాల్సి ఉంటుంది.

ఆర్థిక క్రమశిక్షణతోనే గండం గట్టెక్కవచ్చు

పొదుపు చేసుకోవడం అనేది భారతీయుల సహజ గుణం. అందుకే మన ఆదాయంలో తప్పనిసరిగా కొంత మొత్తం పొదుపు చేసుకోవడం అత్యవసరం. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో మీ పొదుపు ఖాతాల్లో కనీసం 3 నుంచి 6 నెలల వేతనం పొదుపు చేసుకొవాలి. ముఖ్యంగా ఉద్యోగం ప్రమాదంలో పడితే మీ నెలవారీ ఈఎంఐలు, బీమా ప్రీమియం, స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులకు ఆ మొత్తం ఉపయోగపడుతుంది.

అంతేకాదు మీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ నిధి నుంచి డబ్బు తీయకుండా జాగ్రత్తపడాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులైన మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు సమీక్షించుకొని తక్కువ రాబడి నిచ్చే పథకాల నుంచి డబ్బును తీసుకొంటే ఆ డబ్బు మీకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :