Wednesday, March 17, 2021

మరో 6 వేల మంది టీచర్ల బదిలీ ఉత్తర్వుల విడుదలకు విద్యాశాఖ సిద్ధంRead also:

  • కోర్టు కేసులతో ఆగిన హెచ్‌.ఎం, ఎస్‌ఏలకు
  • బదిలీ ఉత్తర్వుల విడుదలకు విద్యాశాఖ సిద్ధం

కోర్టు కేసుల కారణంగా గత కొంతకాలంగా బదిలీకి నోచుకోని దాదాపు 5 వేల మంది ఉపాధ్యాయుల సమస్యకు తెరపడనుంది. కౌన్సెలింగ్‌లో వారు కోరుకున్న పాఠశాలకు బదిలీ అయ్యేందుకు మార్గం సుగమమైంది. బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్దమవుతోంది. వీరిలో ప్రధానోపాధ్యాయులు(గ్రేడ్‌-2), స్కూల్‌ అసిస్టెంట్లు(తెలుగు, హిందీ) మాత్రమే ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ప్రమోషన్‌ ఖాళీలను చూపించాలని కొందరు టీచర్లు కోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చింది. తర్వాత ఆ కేసు పరిష్కారమైంది. కానీ, వెంటనే స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో హెడ్మాస్టర్లు, స్కూల్‌ అసిస్టెంట్ల (లాంగ్వేజెస్‌) బదిలీ నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ తొలగిపోవడంతో బదిలీ ఉత్తర్వులకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. బదిలీ అయ్యే టీచర్ల జాబితా పరిశీలన ప్రక్రియ మంగళవారం పూర్తయింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు బోధనకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది. అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 నాటి డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టుల భర్తీ మినహా, గత 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటు మున్సిపల్‌ స్కూళ్లలోనూ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల సమస్య నెలకొంది. గత ఏడాది చేపట్టిన టీచర్‌ పోస్టుల రేషనలైజేషన్‌ ప్రక్రియ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దీంతో పాఠశాలల్లో పోస్టుల రేషనలైజేషన్‌ వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే వాదన ఉంది. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టిన విధానం వల్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు గరిష్ట సర్వీసు, రిక్వెస్ట్‌ బదిలీ కోసం కావచ్చు పెద్ద సంఖ్యలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వేలాది టీచర్‌ పోస్టులను బ్లాక్‌ చేయడం వల్ల కొంతమంది టీచర్లే కోరుకున్న చోటకు బదిలీ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో బదిలీ అనంతరం పట్టణాలు, శివారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో సింహభాగం టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ పాఠశాలలో చూసినా టీచర్ల కొరతే కనిపిస్తోంది.

3 నుంచి 4 పోస్టులు ఖాళీ

డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం, బదిలీల సందర్భంగా వేలాది పోస్టులను బ్లాక్‌ చేయడంతో ప్రతి స్కూల్లోనూ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయుల కొరత కనిపిస్తోంది. పోస్టుల బ్లాకింగ్‌ కారణంగా ఏర్పడిన టీచర్ల సమస్యను అధిగమించేందుకు విద్యా వలంటీర్లను నియమిస్తే ఇబ్బంది ఉండేది కాదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రభుత్వం ఆ పనీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరానికి వలంటీర్లను నియమించరాదని నిర్ణయం తీసుకుంది. ఒక వైపు 16 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా కొత్తగా నియామకాలు చేపట్టక పోవడం.. మరో వైపు టీచర్‌ ఖాళీలను బ్లాక్‌ చేయడం.. ఇంకో వైపు విద్యా వలంటీర్ల నియామకం లేకపోవడం.. వెరసి టీచర్ల కొరతను పెంచింది.

విద్యా హక్కు’ బుట్టదాఖలు

ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు. అంతమంది కొత్తగా చేరినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఆయా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని టీచర్లను అందుబాటులో ఉంచకపోవడంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం చూస్తే.. మరో 15 వేల వరకు పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌, ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలి. కానీ, రాష్ట్రంలో ఈ నిబంధనను ప్రభుత్వం పాటించడం లేదు. మరికొద్ది రోజుల్లో పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న తరుణంలో టీచర్ల కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :