Tuesday, February 23, 2021

Heart Disease



Read also:

Heart Disease: ఈ మూడు అలవాట్లు ఉంటే గుండె పోటు ముప్పు తొమ్మిది రెట్లు ఎక్కువట

ఈ మూడు అలవాట్లు ఉంటే గుండె పోటు ముప్పు తొమ్మిది రెట్లు ఎక్కువట

ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని చాలా సంవత్సరాల నుంచి వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ వయసు మీద పడుతుంటే ఈ సమస్యలకు దారి తీస్తాయని చాలామంది భావిస్తారు. కానీ చిన్న వయసులోనూ ధూమ పానం, మద్యపానం, డ్రగ్స్ కి అలవాటు పడిన వారిలో స్ట్రోక్, గుండె పోటు వంటి సమస్యలు కనిపిస్తున్నాయని తాజాగా పరిశోధనలు తేల్చి చెప్పాయి. ఈ మూడూ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఈ అలవాట్లేవీ లేని వారితో పోల్చితే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందట.

జర్నల్ హార్ట్ అనే పరిశోధక పుస్తకంలో ప్రచురితమైన ఈ అధ్యయనం అమెరికా వ్యాప్తంగా ఉన్న హెల్త్ కేర్ డేటాను తీసుకొని నిర్వహించారు. 1.2 మిలియన్ల పేషంట్ల వివరాలను పరిగణనలోకి తీసుకొని ఈ అధ్యయనాన్ని కొనసాగించారు. ముఖ్యంగా గుండె పోటు, స్ట్రోక్, యాంజైనా సమస్యల గురించి  పరీక్షించారు. ఇందులో భాగంగా 55 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగవారిని, 65 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఆడవారిని పరీక్షించారు. 1.35 లక్షల మంది కి చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చినట్లుగా తేలింది. 7700 మందికైతే నలభై సంవత్సరాలు కూడా నిండకముందే గుండె జబ్బు రావడం గమనార్హం.

డ్రగ్స్ ఉపయోగం, చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడం మధ్యనున్న సంబధాన్ని ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకారులు నిర్ధారించగలిగారు. పొగ తాగే వారు ఆ అలవాటు లేని వారితో పోల్చితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండు రెట్లు కలిగి ఉంటారట. ఆంఫెటమైన్ ఉపయోగించే వారిలో ఈ ముప్పు మూడు రెట్లు ఉంటుందట. ఆల్కహాల్, కొకైన్, గంజాయి వంటివి ఉపయోగించే వారికి కూడా చిన్న వయసులోనే గుండె పోటు వచ్చే ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఈ అధ్యయనంలో తేల్చి చెప్పారు.

ఒకటి కంటే ఎక్కువ చెడు అలవాట్లు ఉన్నవారికి గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతోందని వీరు గుర్తించారు. ధూమ పానం, మద్యపానంతో పాటు రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రగ్స్ వినియోగం లేదా ఇతరత్రా చెడు అలవాట్లు ఉన్న వారిలో చిన్న వయసులోనే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు తొమ్మిది రెట్లు పెరుగుతోందట. ఈ అలవాట్లు ఉన్న మహిళల్లో అయితే మగవారి కంటే ముందుగానే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటోందట.

ఈ సర్వేలో లింగ భేధం, జాతి, రంగు, డయాబెటిస్ , బీపీ సమస్యలు ఉన్నవారు,  లేని వారు అంటూ  వ్యక్తులను వేరుగా చూసి పూర్తి నివేదిక తయారుచేశారు. కానీ ఆయా వ్యక్తులు ధూమపానం, డ్రగ్స్, మద్యపానం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు.. దానికి వ్యాధి రావడానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటోంది అన్న విషయాలను ఈ అధ్యయనం పూర్తిగా వివరించలేదు.

ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ మన జీవితంలో యవ్వనం అనేది ఒకసారే వస్తుంది. వయసులో ఉండగానే ఆరోగ్య సమస్యలతో ముసలివారు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీలైనన్ని ఎక్కువ రోజులు యంగ్ గా ఫీలయ్యేలా మనల్ని మనం మార్చుకోవాలి అంటూ రాసుకొచ్చారు అధ్యయనకారులు. ఈ అలవాట్లు మన కణాల ప్రిమెచ్యూర్ ఏజింగ్ కి దారి తీస్తాయని ఫలితంగా మన ఆయుర్దాయం కూడా తగ్గుతుందని కూడా వారు వెల్లడించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :