Tuesday, February 16, 2021

Exercise



Read also:

Exercise: ఉన్నపళంగా వ్యాయామం మానేస్తే ఎన్ని సమస్యలో మీకు తెలుసా

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంత తేలికైన పని కాదు. దీనికి చాలా కృషి, పట్టుదల అవసరం. చాలా మంది వ్యాయామాన్ని ప్రారంభించేటప్పుడు ఉత్సాహంగానే ప్రారంభిస్తారు. కానీ ఓ నెల లేదా కొన్ని రోజుల తర్వాత పనుల బిజీలో పడిపోయి మానేస్తూ ఉంటారు. అయితే, ఇలా వ్యాయామం చేయడం సడన్ గా మానేస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కొన్ని రోజుల పాటు వ్యాయామం చేసిన తర్వాత సడన్ గా దాన్ని ఆపేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి, ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు అప్పటివరకూ తగ్గిన బరువు తిరిగి పెరిగిపోయే అవకాశం ఉంటుందట. దీంతో పాటు చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మరి, సడన్ గా వ్యాయామం మానేస్తే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో తెలుసుకుందాం రండి.

త్వరగా అలసిపోతారు

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన కండరాలు ఎక్కువగా శ్రమకు గురవుతాయి. కానీ దాన్ని ఒక్కసారిగా ఆపేయడం వలన కండరాలు పటుత్వం కోల్పోయి వాటి పోగులు కుచించుకుపోతాయి. తద్వారా శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు. దీనివల్ల బరువులో విపరీతమైన మార్పులు వస్తాయి. దీని వల్ల చిన్న చిన్న పనులకే కండరాలు నొప్పిగా అనిపిస్తాయి. దీంతో పాటు త్వరగా అలసిపోయి నీరసించి పోతారు. అందువల్ల, సడన్ గా వ్యాయామాన్ని మానేయకుండా ఉండాలి. ఒకవేళ మీరు వ్యాయామం మానేయాలనుకుంటే క్రమంగా మీ వ్యాయామ సమయాన్ని తగ్గించుకోండి.

ఫిట్‌నెస్ స్థాయి తగ్గుతుంది

ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తూ మంచి ఫిట్ నెస్ కలిగి ఉన్న వారు సడన్ గా వ్యాయామం చేయడం మానేస్తే.. సుమారు 12 వారాల తర్వాత, మీ ఫిట్‌నెస్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి. తద్వారా మీ శరీరాకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి.

పొట్ట పెరుగుతుంది

వ్యాయామం చేసే సమయంలో మీ శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆ సమయంలో పొట్ట కూడా తగ్గుతుంది. అయితే, ఎప్పుడైతే వ్యాయామం మానేస్తామో అప్పుడు పొట్ట మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మీకు కేవలం వారం రోజుల్లోనే కనిపిస్తుంది. మీ శరీరంలోని కొవ్వును కరిగించలేరు కాబట్టి మీరు నెమ్మదిగా మళ్లీ బొద్దుగా తయారవుతారు. తద్వారా మీ జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది, ఫలితంగా బరువు పెరుగుతారు.

రక్తపోటులో హెచ్చుతగ్గులు

వ్యాయామం మానేసిన వెంటనే మీ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీరు వ్యాయామం మానేసిన సమయంలో మీ రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అదే రెండు వారాల తరువాత, మీ రక్త నాళాలు నిశ్చల జీవనశైలికి అనుగుణంగా మారిపోతాయి.

శ్వాస సమస్యలు అధికమవుతాయి

సడన్ గా వ్యాయామం మానేస్తే శ్యాస సమస్యలు అధికమవుతాయి. మీరు కొద్ది దూరం నడిచినా, పరిగెత్తినా సరే వెంటనే అలసట చెందుతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మీ ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మీ కండరాలకు పనిచెప్పక పోవడమే.

మెదడు పనితీరుపై ప్రభావం

మీ రోజువారి వ్యాయామాన్ని సడన్ గా ఆపేయడం వలన మీ మెదడు త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాక, మీ మానసిక స్థితిని మెరుగుపర్చుకోవచ్చు.

కండరాలు పటుత్వం కోల్పోతాయి

సడన్ గా వ్యాయామం మానేస్తే మీ కండరాలు బలహీనపడతాయి. తద్వారా క్రమంగా మీ కండరాలు పటుత్వం కోల్పోతాయి. కొన్ని రోజుల్లో మీరు బరువులెత్తే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. రోజూ వ్యాయామం చేసే సమయంలో మీరు వంద కేజీల బరువును సులువుగా ఎత్తగలిగితే వ్యాయామం ఆపేసిన కొన్ని రోజుల తర్వాత అందులో సగం బరువును ఎత్తేందుకు కూడా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కండరాల పటుత్వం తగ్గడమే కారణం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :