Sunday, February 21, 2021

మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన



Read also:

  • మహమ్మారి మళ్లీ వస్తోంది
  • కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం
  • ఆస్పత్రులు, పరికరాలు సిద్ధంచేస్తున్న ఆరోగ్య శాఖ
  • ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు
  • కొవిడ్‌-19 నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం
  • ఎపిడిమాలజీ కమిటీతోనూ ఆరోగ్య శాఖ చర్చలు
  • సెకండ్‌ వేవ్‌ వచ్చే చాన్స్‌ ఉందని సభ్యుల సూచన
  • మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం
  • మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? సెకండ్‌ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్‌ కూడా కలిసొస్తే.పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌.కఠిన ఆంక్షలు.అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు.


కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్‌ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ

తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.

ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త స్ట్రెయిన్‌ వస్తే మరిన్ని కష్టాలు

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా.? లేదా.?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్‌ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :