Monday, January 4, 2021

Ration door delivery



Read also:

రేషన్ సరుకుల డోర్ డెలివరీపై సీఎం జగన్ క్లారిటీ ముహూర్తం ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రేషన్ సరుకుల డోర్ డెలివరీపై సీఎం వైఎస్ జగన్ (CM Jagan) స్పష్చతని ఇచ్చారు. ఈనెల మూడోవారానికి వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలోలో ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీని ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు. ఈనెల మూడో వారానికి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు సిద్ధమవ్వాలని.. అదే రోజు ప్యాకింగ్ బ్యాగులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 15 రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. సంక్రాంతి కల్లా రైతుల బకాయిలను పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు.

ఫిబ్రవరి 1న ముహూర్తం

వచ్చేనెల 1వ  తేదీన రేషన్ డోర్ డెలివరీ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.   డోర్ డెలివరీ కోసం వాహనాలను ఈనెల మూడో వారానికి  సిద్ధం చేయాలని  ఆదేశించారు.  వాహనాలు అందుబాటులోకి వచ్చిన రోజే 10 కిలోల రైస్ బ్యాగ్స్ ఆవిష్కరిస్తామన్నారు. రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9260 మొబైల్‌ యూనిట్లు సిద్ధం చేస్తోంది. అదే సంఖ్యలో అధునాతన వేయింగ్ మిషన్లు కూడా అందుబాటులోకి తెస్తోంది. అలాగే 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు సిద్ధం చేస్తోంది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందిస్తోంది.

గతంలో పలుసార్లు వాయిదా

అయితే అర్హుల జాబితా సిద్ధం కాకపోవడం, వాహనాలు కూడా అనుకున్న సమయానికి అందే అవకాశం లేకపోవడంతో నెలరోజుల పాటు పథకాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిరే రేషన్ సరుకుల పంపిణీని ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించినా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది.

లబ్దిదారుల ఇంటి దగ్గరకే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9260 వాహానాలను సిద్ధం చేస్తోంది. టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి.. ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే.. అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాలను సబ్సిడీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు సమాచారం. ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :