Monday, January 11, 2021

AP Teachers Transfers news



Read also:

  • ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌లో మరోసారి మార్పులు
  • AP : ఏ నిమిషానికి ఏమి జరుగునో !
  • మరోసారి బదిలీల షెడ్యూల్‌లో మార్పులు
  • ఎన్నికల ప్రవర్తన నియమావళితో సందిగ్ధం

ఉపాధ్యాయుల బదిలీలు ఇప్పట్లో తేలేలా లేవు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎన్నడూ లేనంతగా తొలి నుంచే షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులతో అసలు ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం బదిలీల ప్రక్రియ చివరిదశకు వచ్చి రేపోమాపో ఉత్తర్వులు వెలువడతాయన్న తరుణంలో హైకోర్టు తీర్పుతో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, పండితులు తిరిగి ఆన్‌లైన్‌లో ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఆర్‌.నంబరు -1029-61 పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది.

నూతన మార్గదర్శకాలు వీరికే

గతంలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లో అయిదేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారికే తప్పనిసరి బదిలీ ఉంటుందని, వారంతా తిరిగి ఆన్‌లైన్‌లో ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో పదోన్నతులు పొందిన తెలుగు, హిందీ పండితులు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, గతంలో వారికి కేటాయించిన స్థానాలు కేవలం అడహాక్‌ పద్ధతిలోనేనని ఆదేశాలు జారీ చేయడంతో బదిలీల ప్రక్రియ మొదటికొచ్చింది. గ్రేడ్‌-2 పండిత ఖాళీల ప్రదర్శన ఈ నెల 11వ తేదీ వరకు ఉంటుందని, 12 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేయాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్‌తో ఆందోళన

అంతా సజావుగా సాగితే ఈ నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యేది. ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడినట్లేనని సంఘాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇస్తే బదిలీలు జరుగుతాయంటున్నారు. లేకపోతే వీటి తరవాత వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేక చోట్ల కోడ్‌ అమల్లో ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు తప్పనిసరిగా బదిలీ అయిన ఉపాధ్యాయులు ఏదో ఒక చోట అయితే చాలనే భావనకు వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియ ప్రభావం రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

పీడీలకు తప్పని నిరాశ

బదిలీలు జరిగే ప్రతిసారీ అన్ని క్యాడర్ల సీనియర్లు మంచి ప్రదేశాలకు బదిలీ అవుతుంటారు. పండిట్ల అప్‌గ్రేడేషన్‌ సమయంలోనే పీఈటీలను పీడీలుగా స్థాయి పెంచుతారు. జూనియర్లు మంచి ప్రదేశాలు పొందితే సీనియర్లు దూరప్రాంతాల్లోనే ఉండిపోవలసి వస్తుంది. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం పండితుల వరకే నూతనంగా వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉండటంతో పీడీలకు అవకాశం లేకుండా పోయింది. సీనియర్‌ పీడీ ఉపాధ్యాయులకు ఈసారీ నిరాశ తప్పదు. ఈ బదిలీలు పూర్తయ్యేవరకు దినదినగండమేనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :