Thursday, December 31, 2020

RGUKT Admissions 2020: ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు



Read also:

ఆర్‌జి‌యూ‌కే‌టి పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో జనవరి 4 నుంచి 11 వరకు ప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్‌ల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని, అభ్యర్థులు తమ వెసులుబాటుకు అనుగుణంగా రెండు క్యాంపస్‌ల్లో ఎక్కడైనా హాజరు కావచ్చని ఆర్జీయకేటీ కులపతి ఆచార్య కె.సి.రెడ్డి బుధవారం తెలియజేశారు. వేరే విద్యాలయాల్లో ఇప్పటికే చేరి, ట్రిపుల్‌ఐటీల్లో చేరాలనుకునే అభ్యర్థులు(అర్హత ఉన్నవారు), తమ ధ్రువీకరణ పత్రాలను ఆయా విద్యాలయాల్లో సమర్పించినట్లు ఆధారాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని చెప్పారు. ఒకవేళ ట్రిపుల్‌ఐటీకి ఎంపికైతే టీసీ సమర్పించేందుకు సమయం ఇస్తామని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు బుధవారం 977 మందికి గాను 555 మంది హాజరైనట్లు ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు.

4 నుంచి ట్రిపుల్‌ఐటీ కౌన్సెలింగ్

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ 4 నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆర్జీయూకేటీ సెట్‌లో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు అధికారులు పిలుస్తున్నారు.

విద్యా విధానం

ఆరేళ్ల సమీకృత ట్రిపుల్‌ఐటీ విద్యా విధానంలో తొలి రెండేళ్లు పీయూసీ, మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించాలి. ఇంజినీరింగ్‌ విద్య పరంగా నూజివీడులో సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలుంటాయి.

ఫీజు వివరాలు

ట్రిపుల్‌ఐటీలో పీయూసీ విద్యకు సంవత్సరానికి రూ.45 వేలు. ఇంజినీరింగ్‌ విద్యకు సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హులైన వారికి ప్రభుత్వం చెల్లిస్తుంది.

సమర్పించాల్సిన పత్రాలు

అభ్యర్థులు కౌన్సెలింగ్‌ సమయంలో ఎస్‌ఎస్‌సీ హాల్‌ టికెట్‌, ఆర్జీయూకేటీ ర్యాంకు కార్డు, టీసీ, కాండక్టు సర్టిఫికెట్‌, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ప్రత్యేక విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత వెరిఫికేషన్‌ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు నివాస, సర్వీసు సర్టిఫికెట్లు అందజేయాలి.

బ్యాంకు రుణం పొందాలంటే

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హత లేని అభ్యర్థులు బ్యాంకు రుణం పొందాలంటే పైన సమర్పించిన ధ్రువీకరణ పత్రాలకు అదనంగా మరో నాలుగు కాపీలు చొప్పున సమర్పించాలి. ఉద్యోగి/తల్లి లేదా తండ్రి గుర్తింపు కార్డు, వేతన ధ్రువపత్రం, పాన్‌ కార్డు, రేషన్‌, ఓటరు గుర్తింపు, ఆధార్‌, విద్యార్థి ఫొటోలు 6 సమర్పించాలి. 4 చొప్పున తల్లి లేదా తండ్రి/ సంరక్షకుని ఫొటోలు ఇవ్వాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :