Tuesday, December 29, 2020

Ration Door Delivery postponed in ap



Read also:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రేషన్ సరుకుల డోర్ డెలివరీని వాయిదా వేసింది. దీనికి ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. తొలుత ప్రభుత్వం జనవరి 1 నుంచి డోర్ డెలివరీ చేయాలని భావించింది. అయితే అర్హుల జాబితా సిద్ధం కాకపోవడం, వాహనాలు కూడా అనుకున్న సమయానికి అందే అవకాశం లేకపోవడంతో నెలరోజుల పాటు పథకాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిరే రేషన్ సరుకుల పంపిణీని ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించినా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది.

లబ్దిదారుల ఇంటి దగ్గరకే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9260 వాహానాలను సిద్ధం చేస్తోంది. టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి.. ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే.. అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాలను సబ్సిడీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు సమాచారం. ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది. వాహనాల ఫిట్‌నెస్‌ పరిశీలించిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా ఎప్పటి నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ చేయాలనేది నిర్ణయిస్తారు.

ఇక నుంచి రేషన్ తీసుకోవాలంటే వారికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వలంటీర్లు సరుకులు అందజేసిన తర్వాత లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వలంటీర్లు సర్వర్ లో ఎంటర్ చేసిన తర్వాతే సంబంధిత కుటుంబానికి సరుకులు అందినట్లు లెక్క. మరోవైపు ఇటీవల ప్రభుత్వం రేషన్ కార్డుల సంఖ్య తగ్గించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 52లక్షల 70వేల రేషన్ కార్డులుండగా.. వాటిలో 8లక్షల 44వేల కార్డులను వివిధ కారణాల వల్ల ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం కార్డుల సంఖ్య ఒక కోటి 44లక్షల 26వేలకు తగ్గింది.

ఇదిలా ఉంటే ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకుల ధరలు పెరిగాయి. కరోనా కారణంగా నవంబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా సరకులు పంపిణీ చేసింది. అయితే ఈ నెల నుంచి వాటికి పొందేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రేషన్‌లో అందించే పలు సరుకుల ధరలు పెరిగాయి. వినియోగదారులు కిలో కందిపప్పు రూ.67, చక్కెర అరకిలో రూ.17, బియ్యానికి కిలో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, చక్కెర రేట్లు పెరిగాయి. అయితే నాలుగు నెలల క్రితమే వీటి ధరలు పెంచినప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే ఈ నెల నుంచి ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. అంతకుముందు కందిపప్పు కిలో రూ.40లు ఉండగా.. రూ.27 పెరిగి రూ.67 అయింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :