Sunday, December 27, 2020

వేసవిలో ఒంటిపూట బడులు



Read also:

వేసవిలో ఒంటిపూట బడులు 3 నెలల ప్రత్యక్ష పాఠాల తర్వాతే పరీక్షలు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకనే పాఠశాలలు ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన వేసవి సెలవుల్లో ఒంటిపూట బడులకు అనుమతించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏటా వేసవి సెలవులు ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయి. కానీ, ఈసారి మార్చిలో బడులు తెరిపించి అన్ని తరగతులకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇలా తరగతిలోని మొత్తం విద్యార్థుల్లో సగం మందికి వంతుల వారీగా రోజు విడిచి రోజు కనీసం 3 నెలలపాటు తరగతులు నిర్వహించిన తర్వాతే వార్షిక పరీక్షలు పెట్టాలని అనుకుంటోంది. విద్యాసంవత్సరాన్ని ఏప్రిల్‌తో ముగించకుండా జూలై వరకు కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. కరోనా వైరస్‌ కొత్త రూపం సంతరించుకొని మరింత ప్రమాదకరంగా మారిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.* *ఇప్పటి వరకూ పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ...తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ పక్కనబెట్టి విద్యార్థుల భద్రతపైనే ప్రధానంగా దృష్టి సారించింది. త్వరలో రాష్ట్రంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలుండటం, ఈదిశగా వైద్య ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండటంతో.. వ్యాక్సినేషన్‌ అయ్యాకనే బడులు ప్రారంభించాలని, ప్రత్యక్ష తరగతులను వేసవి సెలవుల్లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.* ఏపీలో బడులు తెరిచినా స్పందన కరవు.. *రాష్ట్రంలో సెప్టెంబరు-1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటికే కరోనా కాస్త తగ్గుముఖం పట్టినందున తొలుత 6 వారాల వరకు నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. తర్వాత దీనిని పొడిగిస్తూ పోతోంది. తల్లిదండ్రుల అనుమతితో 9 నుంచి 12 తరగతుల వరకు నిర్వహించవచ్చని అక్టోబరులో కేంద్రం విడుదలచేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేయగా.. అనంతరం వాటిని సవరించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. దాంతో డిసెంబరులో పాఠశాలలు ప్రారంభించాలని పలు రాష్ట్రాలు భావించి.. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వెనకడుగు వేశాయి. ఏపీలో మాత్రం నవంబరు-2 నుంచి 9, 10 తరగతులకు, తర్వాత 7, 8 తరగతులకు పాఠశాలలు ప్రారంభించారు. అయితే అక్కడ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా తగ్గేంత వరకూ ఆన్‌లైన్‌ తరగతులకే మొగ్గు చూపుతున్నారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో పరిణామాలను విద్యాశాఖ నిశితంగా గమనిస్తోంది. కొత్తరకం కరోనాతో ప్రస్తుతం ప్రజల్లో మరింత ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. జనవరిలో పాఠశాలలు ప్రారంభించినా తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవచ్చని భావిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్‌ అయ్యాకనే పాఠశాలలు ప్రారంభించాలని యోచిస్తోంది. రెండు నెలల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఫిబ్రవరి, మార్చిలోపు ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే బడులు తెరవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిపై ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక కూడా పంపినట్టు తెలిసింది. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :