More ...

Thursday, December 24, 2020

ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజుల ఖరారుRead also:

  • మెరైన్‌ ఇంజనీరింగ్‌కు రూ.1.25 లక్షలు 
  • బీటెక్, బీఆర్క్‌లకు గరిష్ట ఫీజు రూ.70 వేలు, కనిష్టం రూ.35 వేలు 
  • బీఫార్మసీలో గరిష్టం రూ. 65,900, కనిష్టం రూ. 35 వేలు 
  • ఫీజులను పూర్తిగా రీయింబర్స్‌ చేయనున్న ప్రభుత్వం 
  • గత ప్రభుత్వ హయాంలో ఫీజు ఎంతైనా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌.

రాష్ట్రంలోని ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్, మెరైన్‌ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి. రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ (ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ) సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఫీజుల ఉత్తర్వులను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ ఫీజు రూ.1.25 లక్షలుగా ఖరారు చేయగా బీటెక్, బీఆర్క్‌ కోర్సులకు కనిష్టం రూ.35 వేల నుంచి గరిష్ట ఫీజు రూ.70 వేలుగా నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థలైన 240 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 4 బీఆర్క్‌ కాలేజీలతోపాటు 1 మెరైన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి ఈ ఫీజులు వర్తించనున్నాయి. ఆదాయ, వ్యయ నివేదికలు, సదుపాయాలు, ఇతర అంశాలకు సంబంధించి ఆయా కాలేజీలు సమర్పించిన వివిధ పత్రాలను ఆడిట్‌ చేసిన అనంతరం యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆయా సంస్థలకు కోర్సుల వారీగా  ఫీజులను సిఫార్సు చేసింది. వాటిని అనుసరించి ఉన్నత విద్యా శాఖ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

ఆడిట్‌ ఫలితాల ఆధారంగా 
బీటెక్, బీఆర్క్‌ కోర్సులకు సంబంధించి  8 కాలేజీలకు రూ.70 వేల చొప్పున ఫీజులు ఖరారు కాగా..  రూ.35 వేలకు పైబడి రూ.70 వేల లోపు ఫీజులు ఖరారైన కాలేజీలు 94 ఉన్నాయి. 142 కాలేజీలకు కనిష్ట ఫీజు రూ.35 వేలను నిర్ణయించారు. బీ.ఫార్మసీకి సంబంధించి గరిష్ట ఫీజును రూ.65,900గా, కనిష్ట ఫీజును రూ.35 వేలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం రాష్ట్రంలోని 113 కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. గరిష్ట ఫీజు ఖరారైన కాలేజీ ఒకటి కాగా.. రూ.35 వేలకు పైబడి రూ.65 వేల వరకు ఫీజులు నిర్ణయమైన కాలేజీలు 55 ఉన్నాయి. 57 కాలేజీలకు రూ.35 వేల కనిష్ట ఫీజు ఖరారైంది. 

ఇతర ఫీజులు వసూలు చేయకూడదు 
అన్నిరకాల రుసుములతో కలుపుకుని ప్రభుత్వం ఈ ఫీజులను ఆయా సంస్థలకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్యూషన్‌ ఫీజు, అఫిలియేషన్‌ ఫీజు, గుర్తింపు కార్డు చార్జీ, మెడికల్‌ ఫీజు, స్పోర్ట్స్‌ ఫీజు, గేమ్స్, కల్చరల్‌ మీట్‌ ఫీజు, ఎగ్జామినేషన్‌ ఫీజు, శానిటరీ, మెయింటనెన్స్, ఇతర సదుపాయాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యక్రమాల ఫీజులు, డెవలప్‌మెంట్‌ ఫీజు, రికగ్నైజేషన్‌ ఫీజు, కామన్‌ సర్వీస్‌ ఫీజు ఇతర రుసుములన్నిటితో కలిపి ఈ ఫీజులను నిర్ణయించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుమించి విద్యార్థుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. క్యాపిటేషన్, డొనేషన్, మరే ఇతర ఫీజులను పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ వసూలు చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. యూనివర్సిటీలు గుర్తింపు ఇవ్వని కాలేజీలు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఈ ఫీజులను పూర్తిగా రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా కాలేజీలకు ఎంత ఫీజు ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేది. మిగతా మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించాల్సి వచ్చేది.   

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :