Wednesday, December 2, 2020

ap elections



Read also:

పంచాయతీ పెట్టలేం!

రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉంది

కట్టడిలో యంత్రాంగం నిమగ్నం

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేం

ఫిబ్రవరిలో పోలింగ్‌కు ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం

ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించండి

హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్‌

అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. రాష్ట్రంలో పోలీసులు సహా పరిపాలనా యంత్రాంగమంతా కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో నిమగ్నమై ఉందని...

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని తెలిపింది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ''ఎన్నికల నిర్వహణకు తగిన పరిస్థితులు నెలకొనగానే తెలియచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినా ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏకపక్షంగా నిర్ణయించింది.

కరోనా వ్యాప్తిని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో తగిన సంప్రదింపులు జరపకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయండి'' అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది. మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ... మార్చి 15న పంచాయతీ ఎన్నికల మొదటిదశ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ... కరోనా కారణంగా వాటిని వాయుదా వేసిందని ప్రభుత్వం గుర్తు చేసింది. ''రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాం. తదుపరి ఎన్నికల తేదీని ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం ఆదేశించింది. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొంది. నవంబరు 29వ తేదీ నాటికి మొత్తం 8,67,638 కేసులు నమోదు కాగా... 6,988మంది మృతి చెందారు. రోజూ కనీసం వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 8.66శాతంగా ఉంది. దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో వుంది. తొలుత పట్టణాలకు పరిమితమైన వైర్‌స...ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజేషన్‌ వంటి కొవిడ్‌ మార్గదర్శకాలను పర్యవేక్షించడం కష్టం'' అని గోపాలకృష్ణ ద్వివేది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం అడిగిందని.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎస్‌ఈసీ అఖిలపక్షం నిర్వహించి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు నవంబర్‌ 17న ప్రొసీడింగ్స్‌ జారీ చేసిందని తెలిపారు. ''ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎస్‌ఈసీ పట్టించుకోలేదు. ఇప్పటికే కరోనా వల్ల చాలామంది మరణించినందున, మరిన్ని ప్రాణాలుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరినా ఎస్‌ఈసీ స్పందించడం లేదు'' అని పేర్కొన్నారు. ప్రొసీడింగ్స్‌ నిలిపివేయాల్సిందిగా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :