Tuesday, November 10, 2020

ఏపీలో కాలేజీ ఫీజులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు, వారికి భారీ ఊరట



Read also:

రాష్ట్రంలో కాలేజీలు తెరిచిన నేపథ్యంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేయవద్దని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలేజీలు తెరిచిన నేపథ్యంలో ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేయవద్దని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. ముఖ్యంగా రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకానికి అర్హులైన విద్యార్థుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు ఫీజుల గురించి ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో సీఎం జగన్ అయిన తర్వాత జగనన్న విద్యాదీవెన అనే పథకాన్ని తీసుకొచ్చారు. కాలేజీ విద్యార్థుల ఫీజులను వారి తల్లి ఖాతాలో వేస్తామని ప్రకటించారు. జగనన్న విద్యాదీవెన పథకంలో డబ్బులు నాలుగు విడతల్లో విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతాయి. ఆ డబ్బులు జమ అయిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వారం రోజుల్లోగా కాలేజీలో ఫీజు చెల్లించాలి. దీని ద్వారా ప్రతి మూడు నెలలకు ఓసారి విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి తమ పిల్లల చదువు గురించి లెక్చరర్లను, యాజమాన్యాలను కచ్చితంగా నిలదీసే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం చెప్పింది. దీంతోపాటు కాలేజీలో వసతుల గురించి కూడా నిలదీసే హక్కు లభిస్తుంది. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు.

మరోవైపు జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులకు రూ.10000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ విద్యార్థులకు రూ.20,000 చొప్పున చెల్లించింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. అటు ప్రభుత్వం, ఇటు సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఏడాది విద్యాసంవత్సరంలో ఫీజులకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది.


మరోవైపు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే వారి కోసం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతో ఏపీలో వైద్య విద్య ఫీజులు ఈ విధంగా మారాయి. ఇప్పటివరకు రూ.12,155గా ఉన్న ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా ట్యూషన్‌ ఫీజును రూ.15 వేలకు పెరిగింది. ప్రస్తుతం రూ.13,37,057గా ఉన్న బీ కేటగిరీ ఫీజును ప్రభుత్వం రూ. 12లక్షలకు తగ్గించింది. ప్రస్తుతం సీ కేటగిరీ ఫీజు రూ.33,07, 500గా ఉంది. దీనిని రూ. 36 లక్షలకు తగ్గించారు. మరో వైపు సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15 లక్షలకు సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2020-21 విద్యాసంవత్సరం నుంచి 2022-23 వరకు ఈ నూతన ఫీజులు అమల్లో ఉంటాయని వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ నూతన ఫీజులు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీలకు వర్తిస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారు. ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 14 డెంటల్‌ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి. ఈ ఫీజులు కాకుండా ఇతర ఏ ఫీజులైనా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆయా యాజమాన్యాలను హెచ్చరించింది. మెడికల్, డెంటల్‌ అభ్యర్థులకు విధిగా ఉపకారవేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :