Friday, November 13, 2020

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి



Read also:

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు రంగం సిద్ధమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఇప్పటికే ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో అధ్యయన కమిటీ వేసింది.

ఆ కమిటీకి అనుబంధంగా మరో నాలుగు బృందాలను నియమించింది. ఆ క్రమంలోనే తాజాగా పోలీస్ సిబ్బంది బదిలీలపై ఆంక్షలు విధించారు.

కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఆ ప్రక్రియ పూర్తి చేసే వరకూ పోలీసు శాఖలో బదిలీలపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు.

ఇక జనవరి నుంచి కొత్త జిల్లాలు అంటూ డిప్యూటీ స్పీకర్ కోనా రఘపతి వంటి వారు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో 32 జిల్లాలకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వం మాత్రం తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెబుతోంది.

ఎన్నికల్లోనే జగన్ హామీ

తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజిస్తారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధులే వాటికి హద్దులుగా ఉంటాయని జగన్ గతంలోనే ప్రకటన చేయడంతో దానికి అనుగుణంగానే తుది నిర్ణయం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.

జులై 15 నాటి ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా దానికి అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. ఆనాటి మంత్రివర్గ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి ప్రతిపాదనతో అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా మార్చాలనే చర్చ జరిగింది.

జిల్లాల విభజన విషయంలో హద్దుల నిర్ధరణపై కొందరు మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేసినప్పటికీ వాటిన్నింటినీ అధికారుల కమిటీ పరిశీలిస్తుందని సీఎం చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు అనుగుణంగా అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో భూపరిపాలనా శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శితో పాటు సీఎం కార్యాలయం నుంచి ఒక అధికారి ఉన్నారు.

ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ సూచించింది.

జిల్లాల విభజనపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ ఇప్పటికే పలు ప్రతిపాదనలు పరిశీలించింది. తుది నివేదిక సిద్ధం చేస్తున్నట్టు కమిటీలోని ఓ అధికారి బీబీసీతో చెప్పారు. నివేదిక సమర్పించే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు అందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు డిమాండ్లు వచ్చాయని, జిల్లాల సరిహద్దుల విషయంలో మార్పులు, జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో కొందరు మంత్రుల స్థాయిలో కూడా బలమైన ఆకాంక్షలున్నట్లు చెప్పారు. అన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక వస్తుందన్నారు.

32 జిల్లాలని సోషల్ మీడియాలో ప్రచారం

పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే క్యాబినెట్ నిర్ణయానికి భిన్నంగా జరుగనున్నట్లు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 32 జిల్లాలుగా విభజిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల వివరాలతో ప్రసారమవుతున్న విషయాలకు, ప్రభుత్వ నిర్ణయానికి సంబంధం లేదని ఏపీ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ అంటున్నారు.

"అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అన్నింటినీ పరిశీలిస్తోంది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్ రావాలి. ప్రజలకు పాలన అందుబాటులో ఉండటం కోసమే మూడు రాజధానుల ఏర్పాటు, అందుకు అనుగుణంగానే జిల్లాల విభజన జరుగుతోంది. ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చిన దానికి కట్టుబడి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. ఇంకా చర్చల దశలో ఉంది. తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది. ఊహాగానాలకు సమాధానాలుండవు" అని ఆయన బీబీసీతో అన్నారు.

'జనవరి నాటికే కొత్త జిల్లాల ప్రకటన'

ఏపీలో రాబోయే జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అంటున్నారు.

"పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు విషయంలో నీతిఆయోగ్ కూడా సూచనలు చేసింది. ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎంపీ పరిధిలో ఉంటే నిధుల వినియోగానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం కూడా ఆలోచిస్తోంది. దానికి తగ్గట్టుగానే పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. అమలు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి. అది రాగానే జనవరి 26 నాటికి ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తుతానికి అంచనా. ఆ ప్రకటన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి అక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అంతా సిద్దం చేసుకుని కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

బదిలీలపై పోలీస్ బాస్ ఆంక్షలు... అంతర్గత మార్పులకు శ్రీకారం

కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయంటూ ఏపీ పోలీస్ విభాగం నుంచి వచ్చిన ప్రకటన తాజా చర్చను మరింత వేడెక్కించింది. RC No. 621/L&O-111/ 2020 పేరుతో ఏపీ డీజీపీ ఈనెల 10న ఉత్తర్వులు విడుదల చేశారు.

దాని ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ విభాగాలు, రేంజ్‌ల పరిధిలో పోలీస్ శాఖ అంతర్గత బదిలీలపై ఆంక్షలు పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ రైల్వే, సీఐడీ, ఇంటిలిజెన్స్, ఏపీఎస్పీతో పాటుగా అన్ని జిల్లాలు, రేంజ్‌ల పరిధిలో వివిధ స్థాయిల్లో పోలీసుల బదిలీలు నిలుపుదల చేశారు.

కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వరకూ పోలీస్ బదిలీలు లేవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు విడుదల చేయడంతో త్వరలోనే ఈ జిల్లాల విభజనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి.

జిల్లాల వారీగా పోలీస్ సిబ్బంది విభజనకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్లను మచిలీపట్నం ఎస్పీ పరిధిలోకి మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.

మచిలీపట్నం ఎస్పీ పరిధిలో ఉన్న స్టేషన్లను విజయవాడ సీపీకి పరిధిలోకి మార్చేందుకు ప్రకటన చేశారు. ఇలాంటి అంతర్గత మార్పులు పోలీస్ శాఖలో జరుగుతున్న తరుణంలో కొత్త జిల్లాలపై చర్చ జోరందుకుంది.

కొత్త జిల్లాల విభజన కొన్ని చోట్ల కొత్త సమస్యలను సృష్టిస్తోంది.

చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్న చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి నగరాన్ని ఆనుకుని ఉంటుంది. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రతిపాదన మూలంగా చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. కొత్త జిల్లా కాకపోయినా, తమకు అతి సమీపంలో తిరుపతి జిల్లా కేంద్రంగా ఉండగా, చంద్రగిరి వాసులు మాత్రం చిత్తూరు వెళ్లాల్సి ఉంటుంది.

బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మారిస్తే ప్రస్తుతం సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది. తద్వారా ప్రస్తుతం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ఇకపై బాపట్ల వెళ్లాలంటే 70 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం నగరాన్ని ఆనుకుని ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. తద్వారా తమకు కూతవేటు దూరంలో ఉండే జిల్లా కేంద్రం కోసం సుమారు 50 కిలోమీటర్ల దూరం పైగా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అనివార్యం అవుతాయన్నది పలువురి వాదన.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఇప్పటికే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు మందుకొచ్చాయి. ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. సీఎం దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు.

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కూడా కొందరు ఆందోళన బాట పట్టారు. అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రకటించిన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా విభజనను తాము వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

"శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ ప్రజలందరి ఐక్యత మా బలం. జిల్లాల విభజన పేరుతో శ్రీకాకుళం జిల్లాను విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చేసే ప్రయత్నం మా ప్రాంతానికి మంచి చేసేలా ఉండాలి. సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే నేను కూడా మద్ధతిస్తాను. కానీ ఒకటి రెండు చోట్ల కొత్త జిల్లాల కోసం డిమాండ్ ఉన్న దానిని, రాష్ట్రమంతా విభజించాలని చూడటం సరికాదు. జిల్లాలను ఎందుకు విభజించాల్సి వస్తుందన్నది సూటిగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణాలో జిల్లాల విభజన సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. కాబట్టి సమగ్రంగా ఆలోచించాలి. దూరదృష్టితో ఆలోచించి, విభజనతో కొత్త సమస్యలు తీసుకురాకుండా చూడాలి" అని ఇటీవల ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ నెలలోనే కమిటీ రిపోర్ట్ సమర్పిస్తే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. దానికి భిన్నంగా వచ్చే నెలకు నివేదిక వాయిదా పడితే జనవరిలో ప్రభుత్వ ప్రకటన, ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే చర్చ సాగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

అదే సమయంలో జనగణన నిమిత్తం గతంలో కేంద్రం విధించిన ఆంక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకూ రెవెన్యూ జిల్లాలు, డివిజన్ల సరిహద్దుల మార్పులు చేయకూడదని కేంద్రం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆదేశాలు వచ్చాయి.

జనగణనకు ఆటంకం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్, లాక్ డౌన్ కారణంగా జనగణన జరగలేదు. దాంతో ఆదేశాల అమలు సందేహంగా మారింది. అంతేగాకుండా మళ్లీ జనగణకు పూనుకుంటూ ఈ ఆదేశాలు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు. దాంతో ఏపీలో జిల్లాల విభజన సన్నాహాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా కీలకమే.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తే మంచిదనే వాదనలు కూడా ఉన్నాయి.

జిల్లాల ఏర్పాటుని ఆహ్వానిస్తూనే పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన విభజన అనడం పట్ల రిటైర్డ్ ఆర్డీవో పీవీ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

''చాలామందికి ఈ విషయంపై అసంతృప్తి ఉంది. 2026లో మళ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత మళ్లీ జిల్లాల విభజన చేయలేం కదా. ఈ కొద్ది కాలం కోసం జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా విడదీస్తామని అనడం అసంబద్ధంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. చాలా ప్రాంతాలకు రవాణా, ఇతర సమస్యలు ఏర్పడతాయి. సమగ్ర అధ్యయనం చేయడానికి సమయం తీసుకున్నా ఇబ్బంది ఉండదు. తుది నిర్ణయం మాత్రం ప్రజలకు అనుకూలంగా ఉంటే మంచిది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :