Friday, November 27, 2020

అందరికీ విద్య కోసమే సంస్కరణలు



Read also:

అందరికీ విద్య కోసమే సంస్కరణలు: మంత్రి సురేష్‌-లోగో ఆవిష్కరించిన మంత్రులు సురేష్‌, సుచరిత, విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తదితరులు

రాష్ట్రంలో ఎలాంటి తారతమ్యాలకు చోటులేకుండా అందరికీ చదువును చేరువ చేయడానికే విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం విద్యా శాఖ ఆధ్వర్యంలో 'చదవటం మాకిష్టం' కార్యక్రమం ప్రారంభోత్సవం, రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

logo we love reading

తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పిల్లల్లో పఠనా శక్తిని పెంచడానికే 'చదవటం మాకిష్టం' కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలను మరింత పటిష్ఠం చేస్తామని, పుస్తక పఠన కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నిరకాల పుస్తకాలను గ్రేడింగ్‌ చేసి పాఠశాలల్లో ఉంచుతామన్నారు.నాడు-నేడు ఫేజ్‌-1 పనులు జనవరిలో పూర్తవుతాయని, రెండో దశలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.

డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతులు ప్రారంభిస్తామని, పరిస్థితులు అనుకూలిస్తే సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి 5వ తరగతులు జరుగుతాయన్నారు. ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వడానికి డైట్‌లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయాన్ని 'టీచర్స్‌ ట్రైనింగ్‌ యూనివర్సిటీ'గా మార్చుతామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంలో రాజీపడబోమన్నారు.

కరోనాపై సెంట్రల్‌ కంట్రోల్‌ రూం ద్వారా రోజు వారీ సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం అందించే అన్ని పుస్తకాలు చదవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు. అంతకుముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళిలర్పించి, రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి హాజరైన వారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, పాఠశాల విద్య సంచాలకులు చినవీరభద్రుడు, సమగ్ర శిక్ష పథకం డైరెక్టర్‌ వెట్రి సెల్వి, జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి, విద్యాశాఖ ఉన్నతాధికారులున్నారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :