Monday, November 23, 2020

AP Ration



Read also:

  1. బియ్యం మినహా అన్నిటి ధరలూ పెంపు
  2. కందిపప్పుపై ఒకేసారి రూ.27 మోత. కరోనా కష్టకాలంలో కిలో 67కి పెంపు
  3. వచ్చే నెల నుంచే అమల్లోకి
  4. ఇప్పటికే పంచదారపై 14 పెంపు
  5. ఏటా పేదలపై 600 కోట్ల భారం
  6. త్వరలోనే మరింత మంట
  7. రేషన్‌ సరుకుపై సబ్సిడీ తగ్గింపు
  8. బహిరంగ మార్కెట్‌ ధరలో ఇక 25 శాతమే రాయితీ
  9. జగన్‌ ప్రభుత్వ నిర్ణయం
  10. అదే జరిగితే కందిపప్పు ధర 90!

రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల్లో సరుకుల ధరలు మండిపోనున్నాయి. పంచదార ధర ఇప్పటికే పెంచేసిన జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు కందిపప్పుపై ఒకేసారి రూ.27 బాదబోతోంది. డిసెంబరు రేషన్‌ తీసుకునేటప్పుడే పేదలకు ధరల సెగ తగలనుంది.

అంతేకాదు ఆయా సరుకులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలో 25 శాతం మాత్రమే ఇకపై సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించారు.దీంతో త్వరలో మరింత మోత మోగనుందన్న మాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల ధరలను జగన్‌ ప్రభుత్వం పెంచుతోంది. అసలే కరోనా కారణంగా ఉపాధి లేక అల్లాడిపోతున్న పేదలపై మరింత భారం మోపుతోంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్మే సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ప్రభుత్వాలు చౌకగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మన రాష్ట్రంలో అవి ప్రియం కానున్నాయి. నాలుగు నెలల కిందటే ధరల పెంపునకు రంగం సిద్ధం చేసుకోగా.ఉచిత రేషన్‌ పంపిణీ గడువును కేంద్రం పొడిగించడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. ఈ డిసెంబరు నుంచి ధరల మోత మోగించనుంది. ఇప్పటికే పంచదార కిలోపై రూ.14 పెంచగా.ఇప్పుడు కందిపప్పుపై రూ.27 మేర పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రేషన్‌ డీలర్ల నుంచి డీడీలు కూడా స్వీకరిస్తోంది. డీలర్లు కిలోకు రూ.66 చొప్పున నగదు చెల్లించి.. రూపాయి కమీషన్‌ కలిపి రూ.67 చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తారు.

గత కొన్నేళ్లుగా కందిపప్పు కిలో రూ.40కే ఇస్తుండగా.. జగన్‌ ప్రభుత్వం ఒకేసారి రూ.27 పెంచేసింది. గతంలో కందిపప్పు ధరలు ఎంత ఉన్నా రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే ధర రూ.40 దాటలేదు. కానీ కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో పెరిగిన వెంటనే పౌరసరఫరాల శాఖ హడావుడిగా ధర పెంచేసింది. ప్రస్తుతం కందిపప్పు కిలో ధర రూ.వంద దాటింది. కానీ రూ.80 ఉన్నప్పుడే ధర పెంచాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పంచదారను ఉచిత సరుకుల జాబితాలో పెట్టకుండా 4నెలల నుంచే పెంచిన ధరను వసూలు చేస్తోంది. గతంలో కార్డుకు అరకిలో పంచదారను రూ.10కి ఇవ్వగా.దానిని రూ.17 చేసింది. బహిరంగ మార్కెట్‌లో అరకిలో పంచదార రూ.20గా ఉంది. అంటే బహిరంగ మార్కెట్‌కు, రేషన్‌ ధరకు తేడా కేవలం రూ.3మాత్రమే. కాగా ఈ పెంపువల్ల నెలకు కందిపప్పుపై రూ.40 కోట్లు, పంచదారపై రూ.10 కోట్లు ప్రజలపై భారం పడుతోంది.


ఏడాదికి మొత్తం రూ.600కోట్లు అవుతోంది. అన్నిటికీమించి పేదలపై మరింత భారం మోపే మరో నిర్ణయం జగన్‌ సర్కారు తీసుకుంది. రేషన్‌ సరుకులపై రాయితీ 25శాతం మించకూడదని నిశ్చయించింది. టీడీపీ హయాంలో కిలో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో సగటున రూ.80 ఉంటే రేషన్‌ దుకాణాల్లో రూ.40కి ఇచ్చారు. అంటే రాయితీ 50 శాతం. పంచదార అరకిలో రూ.10కే ఇవ్వడం వల్ల అందులోనూ 50 శాతం రాయితీ వచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం రాయితీని 25 శాతంగా మార్చింది. ప్రతి 3నెలలకోసారి బహిరంగ మార్కెట్‌ ధరలను సమీక్షించి అప్పటి ధరల సగటుపై 25శాతం ధరలు తగ్గించాలని నిర్ణయించింది. అంటే ఇప్పటివరకూ బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే సగం ధరకే రేషన్‌ సరుకులు రాగా.ఇకపై కేవలం పావు వంతే రాయితీ లభిస్తుంది.


ప్రస్తుతం కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో భారీగా ఉన్నందున త్వరలో ఈ ధరలను సమీక్షించే అవకాశం ఉంది. అప్పుడు 25 శాతం రాయితీ ప్రకారం ధర నిర్ణయిస్తే కందిపప్పు ధర దాదాపు రూ.90గా నిర్ణయించే అవకాశం ఉంది. అప్పుడు కార్డుదారులపై ఎంతో భారం పడుతుంది. ఒకవేళ మార్కెట్లో ధర కొంతమేర తగ్గి రూ.వందకు చేరినా 25శాతం రాయితీ ప్రకారం రేషన్‌లో ఇచ్చే ధర రూ.75కు చేరుతుంది. ఎలా చూసినా ఈసారి ధరల సమీక్ష.పేదలకు చుక్కలు చూపించనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతినెలా సక్రమంగా రేషన్‌లో కందిపప్పు ఇస్తే దాని ప్రభావంతో బహిరంగ మార్కెట్లో ధరలు కొంత తగ్గుతాయి. కానీ లాక్‌డౌన్‌లో కార్డుదారులకు కందిపప్పు కంటే శనగలు ఎక్కువ సార్లు ఇచ్చారు. దీంతో డిమాండ్‌ పెరిగింది. అప్పటికే ఇతరత్రా కారణాలతో కొంతమేర పెరిగిన ధర.అది రేషన్‌ దుకాణాల్లో కూడా లేకపోవడంతో ఇంకా పెరిగిపోయింది. కొవిడ్‌ వల్ల మార్చి నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో కొంతకాలం రేషన్‌ ఉచితంగా ఇచ్చారు.

ఉచితం ముగిసిన వెంటనే భారీగా ధరలు పెంచాలని వైసీపీ ప్రభుత్వం భావించి జూలై నుంచే పెంచిన ధరలు అమల్లోకి తీసుకురావాలనుకుంది. కానీ ఉచిత రేషన్‌ను నవంబరు వరకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో పెంపు వాయిదా పడింది.అయినా పంచదారను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా ఇవ్వకుండా నగదు వసూలు చేసింది. ఇక ఈ నెలతో ఉచితం ముగుస్తుండడంతో డిసెంబరు నుంచి పెంపును అమల్లోకి తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం మేలు చేయాల్సిందిపోయి.కష్టకాలంలో రేట్లు పెంచాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :