Saturday, October 10, 2020

Fragments of Venus on the Moon



Read also:

శుక్ర గ్రహానికి చెందిన గ్రహశకలాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలు చంద్రుడి ఉపరితలాన్ని చేరే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలియన్స్ సంచారంపై ప్రయోగాలకు ఈ శకలాలు దోహదపడుతాయని వారు భావిస్తున్నారు.

శుక్ర గ్రహానికి చెందిన గ్రహశకలాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలు చంద్రుడి ఉపరితలాన్ని చేరే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చందమామ, శుక్రుడికి మధ్య 38 మిలియన్ కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఇదంతా శూన్యంగా(వ్యాక్యూమ్ స్పేస్) ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించి గ్రహశకలాలు చంద్రుడిని చేరుతాయని మనం నమ్మలేం. కానీ ఇందుకు అవకాశాలున్నాయని యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శామ్యూల్ కాబోట్, గ్రెగొరీ లాఫ్లిన్ చెబుతున్నారు. తోకచుక్కలు, గ్రహశకలాల ప్రభావం వల్ల శుక్రుడి ఉపరితలం నుంచి 10 బిలియర్ రాళ్లు విడిపోయి ఉండొచ్చని శామ్యూల్ కాబోట్, గ్రెగొరీ లాఫ్లిన్ తెలిపారు. అంతరిక్షంలో తేలియాడే ఈ రాళ్లు ఇతర గ్రహాల కక్ష్యల్లోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. గురుత్వాకర్షణ వల్ల ఈ స్పేస్‌ రాక్స్‌ చంద్రుడి మీదకు కూడా వెళ్లొచ్చని వారు ప్రకటించారు.

చంద్రుడిపైనా సేకరించవచ్చు.

ఈ రాళ్లలో కొన్ని శుక్ర గ్రహ ఉల్కలుగా చంద్రునిపైకి వస్తాయని కాబోట్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు వంద మిలియన్ సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగేందుకు ఆస్కారం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.  కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం తరచూ ఇలా జరిగేవని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి స్పేస్ రాక్స్ భూమిపైకి చేరుకుంటే, భూమి గ్రావిటీ, స్థిరమైన భౌగోళిక కారణాల వల్ల అవి ఉపరితలం నుంచి చాలా లోతుకు వెళ్తాయి. కానీ చంద్రుడిని చేరే స్పేస్ రాక్స్‌ సురక్షితంగా, చెక్కుచెదరకుండా అలానే ఉండొచ్చని వారు వివరించారు.

వీటితో ఉపయోగాలున్నాయా?

చంద్రునిపై లభించే ఇలాంటి రాళ్లను విశ్లేషించడం వల్ల, మనకు ఎంతో దూరంలో ఉండే శుక్రుడిని అధ్యయనం చేయవచ్చు. శుక్రుడిపై స్పేస్ సైంటిస్ట్‌లు ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నారు. గతంలో దాని ఉపరితలంపై ఫాస్ఫిన్ ఉంటుందని గుర్తించారు. ఫాస్ఫిన్ ఎక్కువగా జీవ సంబంధ వ్యర్థాలు, జియో కెమికల్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అప్పటి నుంచి ఆ గ్రహంపై ఏలియన్స్ ఉండే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి అధ్యయనాలకు శుక్రుడి శిలలు ఉపయోగపడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

అక్కడ జీవం ఉండదు. 

శుక్రుడిపై జీవావరణం ఉండేందుకు అవకాశాలు లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడ విషపూరితమైన వాయువులు ఉంటాయి. కానీ 700 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ గ్రహంపై మహాసముద్రాలు ఉండేవని CNET సంస్థ వెల్లడించింది. అంటే అప్పట్లో అక్కడ జీవజాతులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ విశ్లేషించింది. కాబోట్, లాఫ్లిన్ చేసిన ఈ తాజా అధ్యయనాన్ని ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో “లూనార్ ఎక్స్‌ప్లోజన్ యాజ్ ఎ ప్రోబ్ ఆఫ్‌ ఏన్షియంట్ వీనస్” పేరుతో ప్రచురించారు.

చంద్ర శిలలు కొంటామన్న నాసా.

ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీల నుంచి చంద్రుడి శిలలను కొనుగోలు చేస్తామని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ప్రకటించింది. వాటిని విశ్లేషిస్తే శుక్రుడి వాతావరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని తాజా అధ్యయనం ద్వారా అంచనా వేయవచ్చు. స్పేస్ ఎక్స్ (యుఎస్ఏ), ఆరిజిన్ స్పేస్ (చైనా) వంటి సంస్థలు ఇప్పటికే సొంతంగా స్పేస్‌ మిషన్ ప్రయోగాలు చేయనున్నట్లు ప్రకటించాయి. నాసా 2024లో ఆర్టెమిస్ మూన్ మిషన్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా నాసా చంద్రుడి మీదకు మొట్టమొదటిసారి మహిళను తీసుకెళ్లనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :