Friday, October 23, 2020

ఉపాధ్యాయుల డిమాండ్లకు విద్యాశాఖ కార్యదర్శి ససేమిరా



Read also:

  • కమిషనర్ చర్చలు జరిపినా నిర్ణయాలు లేవు
  • విద్యా మంత్రి ని కలిసేందుకు ఫ్యాప్టో సన్నాహాలు
  • బదిలీలు, రేషన్ లైజేషన్ పై వేడెక్కనున్న వాతావరణం

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆయా సంఘాలతో చర్చలు జరిపినా తదుపరి అడుగులు పడటం లేదని సమాచారం. బదిలీల విధివిధానాలు, రేషనలైజేషన్ ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రిలే దీక్షలు ప్రారంభించాయి. ఇంతలో విద్యాశాఖ డైరక్టర్ చర్చలకు పిలిచి సానుకూలంగా మాట్లాడటంతో దీక్షలు విరమించాయి. కొన్నింటికి డైరక్టర్ సానుకూలగా స్పందించారు. మరికొన్నింటికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆ తర్వాత డైరక్టర్  ఈ విషయాలను విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని విశ్వసనీయ సమాచారంగా తెలిసింది. ఒక్కసారి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకునేందుకు ఆయన అంగీకరించడం లేదని సమాచారం.  దీంతో  ఉపాధ్యాయ బదిలీల విషయంలో నిబంధనల మార్పులో ఆయా సంఘాల డిమాండ్లపై కదలిక లేనట్లే. దీంతో  ఈ విషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. తొలుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దసరా  తర్వాత ఫ్యాప్టోతో పాటు మరికొన్ని సంఘాల ప్రతినిధులు విద్యామంత్రికి విషయం నివేదించనున్నారు. ఆయనతో విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించి విషయం సానుకూలంగా పరిష్కారమయ్యేలా తొలి ప్రయత్నాలు సాగిస్తామని చెబుతున్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తదుపరి ఏం చేయాలో ఆలోచించాలనేది  ఉపాధ్యాయ సంఘాల వ్యూహంగా ఉంది. ప్రధానంగా ఆరు డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందని, అవి కూడా పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు  కావని చెబుతున్నారు. బదిలీల ఆప్షన్లు ఇచ్చేందుకు ఇంకా 29 వరకు గడువు కూడా ఉంది. రేషన్ లైజేషన్ ప్రక్రియ వల్ల  మరికొంత ఆలస్యమయ్యే అవకాశమూ ఉంది. ఈ లోపు తమ డిమాండ్లు కొలిక్కి తీసుకురావాల్సి ఉందని  సంఘాల నేతలు చెబుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :