♦డిప్లొమా కోర్సుల ప్రవేశాలకూ..
♦పదోతరగతి పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు
♦2 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు
వచ్చే నెల 28న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీని ద్వారా ట్రిపుల్ ఐటీలు, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(గుంటూరు), వేెంకటేశ్వర పశుసంవర్ధక వర్సిటీ(తిరుపతి), వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీ(వెంకట్రామన్నగూడెం)లో రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతామన్నారు. ప్రవేశ పరీక్షలో వంద మార్కులకు... వంద బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఓఎంఆర్ ఆధారిత జవాబు పత్రం ఉంటాయని వెల్లడించారు. విజయవాడలో గురువారం రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి హేమచంద్రారెడ్డి, ట్రిపుల్ ఐటీ నూజివీడు సంచాలకుడు గోపాలరాజు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పదో తరగతిలోని గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నమూనా ప్రశ్నపత్రాన్ని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎలాంటి మార్కులు, గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు కేటాయించలేదు. దీంతో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. వంద కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండే మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్థానికేతరులకు 15 శాతం సీట్లు ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సీట్లు ఇలా
ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సు(ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం): 4,000
రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సులు: 6,000
అన్ని విద్యాసంస్థలు 2 నుంచి
పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు నవంబరు 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ మొదటి ఏడాది తరగతుల్ని మాత్రం ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ 15 నిమిషాల పాటు కొవిడ్-19పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని మంత్రి సురేష్ తెలిపారు. పాఠ్యాంశాల తగ్గింపు, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ, సాంకేతికతలేని గ్రామాల్లో ఆఫ్‌లైన్ తరగతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
దరఖాస్తుల స్వీకరణ 28 నుంచి
ఓసీలు రూ.300, బీసీలు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.100 పరీక్ష రుసుం చెల్లించాలి.
పదోతరగతి గణితం నుంచి 50, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 25, జీవశాస్త్రం నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష సమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
వెబ్‌సైట్ www.rgukt.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.
రుసుం చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ: అక్టోబరు 28 నుంచి నవంబరు 10 వరకు
రూ.వెయ్యి అపరాధ రుసుంతో గడువు: నవంబరు 15
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: నవంబరు 22 నుంచి
ఉమ్మడి ప్రవేశపరీక్ష, ప్రాథమిక ‘కీ’ విడుదల: 28న
అభ్యంతరాల స్వీకరణ: 30 వరకు
తుది ‘కీ’ విడుదల: డిసెంబరు 1న
ప్రవేశ పరీక్ష ఫలితాలు: 5న