Tuesday, January 14, 2020

About jallikattu history



Read also:


జల్లికట్టు సందడి తమిళనాడులో మళ్లీ కనిపిస్తోంది. ఇది ఓ సంప్రదాయ క్రీడ. జల్లికట్టు... గ్రామీణ ప్రాంత వేడుక. సంక్రాంతి అనగానే మనకు కోడిపందేలు ఎలా గుర్తొస్తాయో... జల్లికట్టు కూడా అంతే. సంక్రాంతి పండుగకు ముందు నుంచే జల్లికట్టు ఏర్పాట్లు ఊపందుకుంటాయి. ఎన్నెన్ని నిషేధాలు ఉన్నా, కోర్టుల ఆదేశాలు ఉన్నా జల్లికట్టు జరిగితీరాల్సిందే. అసలేంటి ఈ జల్లికట్టు? ఎలా మొదలైంది సంప్రదాయం? జంతువులకే కాదు మనుషుల ప్రాణాలకూ ముప్పు అని తెలిసినా... ఇది సంక్రాంతి పండుగలో ఎందుకు భాగమైపోయింది? తెలుసుకుందాం.
1. చుట్టూ పదుల సంఖ్యలో యువకులు... కసిగా పరుగెత్తుతున్న ఎద్దు... ఆ ఎద్దును లొంగదీసేందుకు ఒక్కొక్కరుగా ముందుకెళ్లి ప్రయత్నిస్తుంటారు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తూ ఉంటుంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది. పదునైన కొమ్ములు కడుపులోకి దిగి రక్తం కారుతున్నా వెనక్కి తగ్గకుండా ఆ ఎద్దును లొంగదీసేందుకు ప్రయత్నిస్తుంటారు.
2. ఓవైపు భయం వెంటాడుతున్నా... ధైర్యంగా జల్లికట్టులో పాల్గొంటుంటారు. పొడవడానికి వచ్చే ఎద్దును తప్పించుకోవడం ఒక లక్ష్యమైతే, ఎద్దు మూపురాన్ని బలంగా పట్టుకొని లొంగదీసుకోవడం మరో లక్ష్యం. ఈ డేంజరస్ గేమ్ చూస్తూ అందరూ చప్పట్లతో ప్రోత్సహిస్తుంటారు. ఆట చూసేవారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చివరకు ఎద్దు ఏదో ఓ దశలో లొంగిపోతుంది. ఇదే జల్లికట్టు.
3. జల్లికట్టు ఆచారం ఇప్పటిది కాదు. తమిళనాడులో తరతరాలుగా ఉన్నదే. పొంగల్ పండుగ సీజన్‌లో కనుమ రోజున ఈ సాహస పోటీలు జరుగుతుంటాయి. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల సమయంలో జల్లికట్టు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సల్లి, కట్టు... ఈ రెండు పదాల కలయికే చివరకు జల్లికట్టు అని మారింది.
4. సల్లి కట్టు అంటే ఎద్దు కొమ్ములు లేదా మెడను బంగారంతో అలంకరిస్తారు. ఎద్దుతో పోరాడి ఎవరు ఆ బంగారాన్ని తీసుకొస్తారో వాళ్లే ఈ పోటీలో విజేత. పురుషులు తమ ధైర్యాన్ని, బలాన్ని చాటేందుకు జల్లికట్టును వేదికగా చేసుకునేవారని, జల్లికట్టులో గెలిచినవారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు పోటీ పడేవారని చెబుతుంటారు. ఇప్పుడు జల్లికట్టులో గెలిచినవారికి బహుమతులు ఇస్తున్నారు.
5. జల్లికట్టులో రంగంలోకి దించే ఎద్దుల్ని చాలా ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు. ఎద్దు బలంగా, ఆరోగ్యంగా, దూకుడుగా ఉండేలా దాణా తినిపిస్తారు. సంక్రాంతికి కోస్తాంధ్రలో కోళ్లపందేలకు కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో, తమిళనాట జల్లికట్టు కోసం ఎద్దులను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వాటిని పోటీలోకి దించుతారు.
6. ఈ పోటీలో యువకులు మరణించిన ఘటనలతో పాటు, జంతువులు గాయపడ్డ ఘటనలూ ఉన్నాయి. జల్లికట్టు సంప్రదాయం పేరుతో పశువులను హింసిస్తున్నారని జంతు ప్రేమికులు ఎప్పట్నుంచో వాదిస్తున్నారు. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదకర ఆటపై నిషేధం కూడా విధించింది.
7. సంప్రదాయ వేడుక అయిన జల్లికట్టును కొనసాగించాలంటే అనేక సంస్థలు పోరాటాలు మొదలుపెట్టాయి. తమిళ ప్రజలు సైతం జల్లికట్టు ఉండాల్సిందే అని కోరుకున్నాయి. ఏకంగా రోడ్ల మీదకొచ్చి ధర్నాలకు దిగాయి. చెన్నైలోని మెరీనా బీచ్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. స్వచ్ఛందంగా బంద్ పాటించారు ప్రజలు. దీంతో తమిళనాడు సర్కార్ దిగివచ్చింది.
8. 'జంతు హింస నిరోధక చట్టం-1960'లో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అలా వేల ఏళ్ల నాటి జల్లికట్టు సంప్రదాయానికి అడ్డంకులు తొలగిపోయాయి. పొంగల్ సమయంలో జల్లికట్టు యథావిథిగా సాగుతోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :