Friday, January 10, 2020

Daily health information



Read also:


మన శరీరాన్ని బాధపెట్టే రోగాలకు కారణాలు ఎన్నో ఉంటాయి. శుభ్రంగా ఉంటే వీటిల్లో చాలా రోగాలు దగ్గరికి కూడా రావని చెబుతుంటారు పెద్దలు.. అది ఇంటి శుభ్రతైనా.. వంటి శుభ్రతైనా! కానీ ఒంటి శుభ్రతను చాలామంది లైట్ తీసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకు బద్ధకిస్తుంటారు. అది మంచిది కాదు కదా! అందుకే ఏ అవయవాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుంటే బెటర్​.
పొద్దున్నే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం మాత్రమే శుభ్రత అనుకుంటారు చాలామంది. కానీ పర్సనల్‌‌‌‌ హైజీన్‌‌ (వ్యక్తిగత పరిశుభ్రత)పరిధి అంతకంటే చాలా ఎక్కువే. జుట్టు చివరి నుంచి కాలి గోళ్ల వరకు ప్రతి అవయవాన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే సూక్ష్మజీవులు, రోగకారక క్రిములు ఎక్స్‌‌పోజ్‌‌ అవుతూ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. రోగాలను వ్యాపింపజేస్తాయి.

గోళ్లు

గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్‌‌ చేసుకోవాలి. అంటే గోరుని చివరి వరకు కత్తిరించకుండా, కొద్దిపాటి గోరంచు ఉండేలా కట్‌‌ చేసుకోవాలి. గోరు మరీ ఎక్కువగా పెరగకుండా ఎప్పటికప్పుడు ఇలా కత్తిరించుకుంటూనే ఉండాలి. మట్టిచేరకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మనం భోజనం చేసే సమయంలో గోళ్ల ద్వారా చెత్తంతా కడుపులోకి వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల నీళ్లవిరేచనాలు, గ్యాస్ట్రోఎంటిరైటిస్‌‌ వంటి ఎన్నోరకాల వ్యాధులను నివారించుకున్నట్లు అవుతుంది. ఇదే సూచన కాలి గోళ్లకు కూడా వర్తిస్తుంది. కొందరు గోళ్లను చిగుర్ల లోపలికి కట్‌‌ చేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో గోటి చివర ఇన్ఫెక్షన్‌‌ వచ్చి, ఆ తర్వాత గోరు లోపలికి పెరుగుతూ చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే కాలిగోర్లు కట్‌‌ చేసుకునే సమయంలో మరీ అంచుల చిగుర్లలోకి కట్‌‌ చేసుకోకూడదు.

చెవులు

చాలామంది ఏమీ తోచనప్పుడల్లా చెవుల్లోకి పిన్నీసులు, అగ్గిపుల్లలు… ఇయర్‌‌బడ్స్‌‌ పెట్టి గుమిలి తీస్తుంటారు. కానీ అవి చెవిని శుభ్రం చేయకపోగా లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయ్. చెవిలోని గుమిలిని శుభ్రం చేయడం కోసం పిన్నులు, అగ్గిపుల్లలు, ఇయర్​బర్డ్స్​ వంటివి వాడటం వల్ల చెవిలోపలి భాగం గాయపడొచ్చు లేదా గుమిలి మరింత లోపలికి వేళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వాటివల్ల కర్ణభేరి కూడా దెబ్బతింటుంది. అందుకే చెవి లోపల గుమిలి మరీ ఎక్కువగా ఉంటే ‘డీ–వ్యాక్స్‌‌’ అనే చుక్కల మందును వేసుకుంటే చాలు. గుమిలి అంతా శుభ్రం అవుతుంది. అలాగే వేడి నీళ్లతో చెవిలో కాస్తంత లోపలి వరకు శుభ్రం చేసుకోవాలి. అయితే చెవుల్లోకి మరింత లోపలి వరకు నీళ్లు పోకుండా చూసుకోవాలి.

స్నానం ఇలా

ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు. కానీ ఆ స్నానం వల్ల మనం పూర్తిగా శుభ్రపడ్డామా లేదా అన్నది చూసుకోరు. ముఖ్యంగా పిల్లలు. చాలామంది పెద్దవాళ్లు కూడా తమ చెవుల వెనక భాగాలు, మెడ వెనక, శరీరంలో చర్మం ముడతపడే చోట్లశుభ్రం చేసుకోరు. ఇక పిల్లలకైతే ఆ అవయవాలు శుభ్రపరుచుకోవాలనే ఆలోచనే రాదు. కానీ వాటిని శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో చాలాచోట్ల చర్మం ముడతలు పడి ఉంటుంది. ఉదాహరణకు మెడ, భుజాలు, తొడలు, గజ్జల దగ్గర చర్మం ముడతలతో ఉంటుంది. ఇలాంటి చోట్ల శుభ్రంగా, పొడిగా ఉంచుకోకపోతే అక్కడ ఫంగల్‌‌ ఇన్ఫెక్షన్‌‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే స్నానం తర్వాత చర్మం ముడతలు ఉన్నచోట్ల పొడి టవల్​తో శుభ్రంగా తుడుచుకోవాలి.

తలస్నానం

వారానికి రెండు నుంచి మూడుసార్లు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కొందరు తలస్నానం చేసే ముందు తలకు నూనె రాసుకుంటారు. కానీ అందరి తలలకూ నూనె అవసరం లేదు. కేవలం పొడిబారినట్లు ఉండే చర్మం, వెంట్రుకలు ఉన్నవాళ్లే తలస్నానానికి ముందు నూనెతో మృదువుగా మర్దన (మసాజ్‌‌) చేసుకోవాలి. ఆ తర్వాత అదంతా శుభ్రమయ్యేలా మంచి షాంపూతో స్నానం చేయాలి.

చేతులు శుభ్రంగా

తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మూత్ర, మల విసర్జన తర్వాత వీలైతే సబ్బుతోనో, హ్యాండ్‌‌వాష్‌‌తోనో తప్పక శుభ్రం చేసుకోవాలి. ఇక హాస్పిటల్‌‌లో పనిచేసేవాళ్లు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం అవసరం. వీలైతే ఆల్కహాల్‌‌ బేస్డ్​ హ్యాండ్‌‌వాష్‌‌లు వాడటం కూడా మంచిదే.

పాదాల శుభ్రత

మన కాళ్లను, మోకాళ్లను, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మడమలు శుభ్రంగా ఉన్నాయా లేక ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్నది చెక్​చేసుకోవాలి. పాదాలపై పుండ్లుగానీ, ఇన్ఫెక్షన్లుగానీ, పగుళ్లుగానీ ఏర్పడకుండా సంరక్షించుకుంటూ ఉండాలి. పాదాలు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడి అయ్యేంతవరకూ తుడుచుకోవాలి. అలాగే కాళ్లకి సౌకర్యంగా ఉండే చెప్పులనే ఎంపిక చేసుకోవాలి. షూ ధరించేవాళ్లు సాక్స్​ల​ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హైహీల్స్‌‌ కాకుండా తక్కువ హీల్‌‌ ఉన్న చెప్పులే వేసుకోవాలి.

బ్రష్​ మరవొద్దు

లేచిన వెంటనే ఏం చేస్తారు? అని అడిగితే అందరూ టక్కన చెప్పే సమాధానం బ్రష్​ చేస్తామనే. కానీ వాస్తవానికి లేచిన వెంటనే కాదు ఆహారం తీసుకున్న ప్రతిసారీ పళ్లను శుభ్రపరచుకోవాలి. అది వీలుపడదు కనుక కనీసం ప్రతిరోజు ఉదయం, రాత్రి భోజనం తర్వాత పక్కాగా బ్రష్‌‌ చేసుకోవాల్సిందే. తిన్న ప్రతిసారీ బ్రష్‌‌ చేసుకోలేకపోయినా… నోట్లోకి నీళ్లు తీసుకుని కనీసం రెండుమూడు సార్లు పుక్కిలిస్తూ నోరంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన నోటిలో బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే తిన్న తర్వాత నోటిని శుభ్రపరుచు కోవాలి. అలాగే బ్రషింగ్‌‌ తర్వాత చిగుళ్లపైన వేలిచివరి భాగాన్ని గుండ్రంగా తిప్పుతున్నట్లు, మసాజ్‌‌ చేసుకుంటున్నట్లు రాయాలి. దీనివల్ల చిగుళ్లకు రక్తప్రసరణ పెరిగి చిగుళ్ల వ్యాధులు రాకుండా ఉంటాయి​.మార్కెట్‌‌లో దొరికే మౌత్‌‌వాష్‌‌లతో నోరు కడుక్కుంటూ ఉండటం కూడా మంచిదే. నోటి దుర్వాసన ఉంటే… కొందరిలో ఎంత శుభ్రం చేసుకున్నప్పటికీ ఫలితం ఉండదు. అలాంటివాళ్లు మౌత్‌‌వాష్‌‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. పొగతాగడం, పొగాకు నమలడం వంటి దురలవాట్లు నేరుగా నోటి దుర్వాసనకు కారణం కావడంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ, శరీర ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఉల్లి, వెల్లుల్లి తినగానే అందులోని సల్ఫర్‌‌ కారణంగా నోటి నుంచి కాసేపు దుర్వాసన వస్తుంటుంది కాబట్టి పగటి వేళల్లో ముఖ్యంగా పనిచేసే చోట్ల అవి ఉన్నవి తీసుకోక పోవడమే మేలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :