Sunday, December 15, 2019

plastic rice information



Read also:

ప్లాస్టిక్ బియ్యం.ఎంత వరకు నిజం

ప్లాస్టిక్ రైస్ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టిందన్న కలకలం ఇప్పుడు కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ. ఈ రైస్ తింటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరికొందరేమో ఇదంతా ఫేక్ (అసత్యం) అని కొట్టి పడేస్తున్నారు. మరి నిజానికి ప్లాస్టిక్ రైస్ ఉందా? ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలుసుకుందాం...
చైనా తయారీ ప్లాస్టిక్ రైస్ పై హైదరాబాద్ మీర్ పేటలో ఓ స్థానికుడు 2017 జూన్ నెల మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా... పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం దాడి చేసి ప్లాస్టిక్ బియ్యం నమూనాలను సేకరించింది. వీటిని పరీక్షల కోసమని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు పంపించింది. ఈ పరీక్షల్లో ప్లాస్టిక్ రైస్ కాదని తేలినట్టు సమాచారం. అటు ఆంధప్రదేశ్ లోనూ ప్లాస్టిక్ బియ్యంపై వదంతులు పెద్ద ఎత్తున వ్యాప్తిలో రాగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్లాస్టిక్ బియ్యం లేనట్టు వెల్లడైంది. ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే ప్లాస్టిక్ రైస్ పై ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలై ఉంది.

ఎప్పటి నుంచో

ప్లాస్టిక్ రైస్ పై వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు, గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. చైనా, వియత్నాంలో ప్లాస్టిక్ రైస్ తయారై భారత్, శ్రీలంక మరికొన్ని దేశాలకు ఎమతి అవుతున్నాయన్న ప్రచారం ఉంది. యంత్రాల సాయంతో పాలిథీన్ సంచుల నుంచి బియ్యం తయారు చేస్తున్న వీడియోలు సామాజిక మధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.2016 డిసెంబర్ లో నైజీరియాలోని లాగోస్ లో చైనా మేడ్ ప్లాస్టిక్ రైస్ అన్న సందేహంతో 2.5 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పరీక్షల్లో ఇవి పాడైపోయిన బియ్యమని తేలింది. ప్లాస్టిక్ లేదు కానీ అనుమతించిన మేర కంటే అధికంగా సూక్ష్మ జీవులున్నట్టు గుర్తించారు. ఇలా పాడైపోయిన బియ్యాన్ని పలు దేశాలకు ఎగమతి చేస్తున్నట్టు సందేహిస్తున్నారు.

వీడియోల్లో ఏముంది

పాలిథీన్ కవర్లను ఓ యంత్రంలో వేసిన తర్వాత అవి కరిగి పొడవైన సన్నటి దారాలుగా మారడరం.చల్లటి నీటిలోంచి కదులుతూ మరో మెషిన్ లోకి వెళ్లిన తర్వాత బియ్యంగా మారిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది.

ప్లాస్టిక్ బియ్యమేనా

ఈ వీడియోల్లో కనిపిస్తున్నట్టు అవి బియ్యం కాదని, పారిశ్రామిక అవసరాల కోసం అలా తయారవుతున్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి ప్లాస్టిక్ బియ్యం తయారు చేయడం అన్నది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, సాధారణ బియ్యం స్థానంలో ప్లాస్టిక్ బియ్యం అమ్మడం వల్ల మిగిలేదేమీ ఉండదంటున్నారు. ప్లాస్టిక్ ఖరీదు బియ్యం కంటే ఎక్కువేనన్న వాదన ఉంది. వీడియోల్లో పాలిథీన్ సంచులను యంత్రాల్లో వేయడం, దారాలుగా మారడం అంతా ఓకే గానీ, చివర్లో అది బియ్యం ఆకారంలోకి మారిపోవడం అన్నది నిజం కాదని, అది కల్పితమన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు.

ఆర్టిఫీషియల్ రైస్

కృత్రిమ బియ్యం అన్నది బియ్యం పలుకులతో (పొలాల్లో, ఆరబెట్టినప్పుడు, రవాణాలో, మిల్లింగ్ లో ముక్కలైన బియ్యం)ను, ఇతర ధాన్యాలతోనూ కలిపి చేస్తుంటారు.

ప్లాస్టిక్ రైస్ అయితే

ప్లాస్టిక్ రైస్ ఉడికి మెత్తగా అవడం జరగదు. తింటున్న సమయంలోనూ అది పంటి కింద నలగదు. పైగా దానికి ఎటువంటి రుచీ ఉండదు. తింటుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. అయినప్పటికీ ప్లాస్టిక్ బియ్యమా, నిజమైన బియ్యామా  అన్నది నిర్ధారించుకునేందుకు కొన్ని పరీక్షలు ఉన్నాయి.
చిన్న పాత్రలో నీరు పోసి అందులో చెంచాడు బియ్యం గింజల్ని వేసి కదిలించాలి. నకిలీ బియ్యం అయితే అవి నీటిపైకి తేలతాయి. నిజమైన బియ్యం అడుగుకు చేరుతుంది. పైగా ఇలా నీటిలో అసలైన బియ్యం వేసి కదిపితే నీటి రంగు మారిపోవడం గమనించవచ్చు. ప్లాస్టిక్ రైస్ అలా ఉండదు.
బియ్యాన్ని వండుతున్నప్పుడు పొంగు వచ్చి గంజి కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ బియ్యం అయితే ఇలా ఉండదు.
బియ్యాన్ని ఉడికించిన తర్వాత దాన్ని తీసుకువెళ్లి ఓ డబ్బాలో వేసి ఉంచండి. రెండు మూడు రోజులు ఆగి చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఉడికిన బియ్యం రెండో పూటకే పాడవడం మొదలవుతుంది. రెండు మూడు రోజులంటే ఫంగస్ వచ్చేస్తుంది. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే దానికి ఎటువంటి ఫంగస్ పట్టదు. అది ఎన్ని రోజులు అయినా అలానే ఉంటుంది.
కొన్ని బియ్యం గింజలను కాల్చి చూడండి. ప్లాస్టిక్ అయితే కరిగి ముద్దలా అవుతుంది. పైగా ప్లాస్టిక్ కరుగుతున్నప్పుడు గాఢమైన వాసన వస్తుందన్న విషయం తెలుసు కదా. అదే అసలైన బియ్యం అయితే మసి అయిపోతాయి. ప్లాస్టిక్ వాసన కూడా రాదు.
చెంచాడు బియ్యాన్ని గుండ్రాయి తీసుకుని నూరి చూడండి. మెత్తటి పొడిగా మారుతుంది. ప్లాస్టిక్ బియ్యం ఇలా అవదు.
ప్లాస్టిక్ బియ్యం, సాధారణ బియ్యం రెండూ కూడా ఒకటే ఉష్ణోగ్రత వద్ద ఉడకవు.నిజమైన బియ్యంపై అయోడిన్ టింక్చర్ చుక్కలు వేస్తే నీలి రంగులోకి మారతాయి. ప్లాస్టిక్ బియ్యం రంగు మారడం జరగదు.

ఉచాంగ్ రైస్

చైనాలో లభించే ఈ వెరైటీ రైస్ చాలా ఫేమస్. మంచి పరిమళంతో ఉంటాయి. సాధారణ రైస్ కంటే ఈ వెరైటీ ధర రెట్టింపు. ఇది చాలా తక్కువ స్థాయిలో పండే రకం. దీనికున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు నకిలీ ఉచాంగ్ రైస్ తయారు చేస్తున్నట్టు 2010లో వార్తలు వెలుగు చూశాయి. ఆలుగడ్డ, చిలకడదుంప, కొంత మేర ప్లాస్టిక్ ఈ మూడింటిని ఉపయోగించి నకిలీ ఉంచాంగ్ బియ్యాన్ని తయారు చేస్తున్నారని ఆయా కథనాల సారాంశం. అసలైన ఉచాంగ్ రైస్ లో ఈ రైస్ కొంత మేర కలిపి విక్రయిస్తున్నట్టు వార్తలున్నాయి. ఈ తరహా వార్తలు తరచూ వస్తూనే ఉన్నప్పటికీ ప్లాస్టిక్ రైస్ నిజమేనని ఇంత వరకు నిర్ధారణ కాలేదు. కనుక ఈ విషయంలో ఆందోళన చెందకుండా రైస్ బ్యాగ్ తీసుకునే ముందు విడిగా ఒక కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో పరీక్షించుకోవడం సురక్షితం. అలాగే, ప్రతీ సారి ఒక్కో షాపులో కొనుగోలు చేయకుండా నమ్మకం అనిపించిన చోటే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు బిల్లు తీసుకోవాలి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :