Friday, December 13, 2019

konow the side effects about your eyes



Read also:

సర్వేంద్రియానాం నయనం ప్రధానం.అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. అందుకే కళ్లు ఉంటేనే ఏదైనా జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని చిన్న సమస్యలైతే, కొన్ని కంటి చూపును దెబ్బతీసేవీ ఉంటాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు.

ఐ స్ట్రెయిన్ 

ఇప్పుడంతా కంప్యూటర్ల యుగం. కనుక నయనాలపై ఒత్తిడి (స్ట్రెయిన్) ఎక్కువైపోతోంది. ఎక్కువ దూరం పాటు లేదా ఎక్కువ సమయం పాటు డ్రైవింగ్ చేయడం కూడా కంటిపై ఒత్తిడి పెంచుతుంది. ఎందుకంటే, అన్నేసి గంటల పాటు విరామం లేకుండా చూస్తూ ఉండడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. దాంతో వాటికి విశ్రాంతి అవసరం. కానీ, ఎంత మంది ఇలా విశ్రాంతి ఇస్తున్నారు చాలా తక్కువ మందే. ఎక్కువ మంది కళ్లు అలసిపోయినా సరే అదే పనిగా చూస్తూ, పనిచేస్తూనే ఉంటుంటారు. కానీ, కళ్లు అలసిపోయినప్పుడు వాటికి విశ్రాంతినివ్వడం అవసరం. ఈ సమస్య ఎదురైతే వైద్యుడిని సంప్రదించాలి.

కళ్లు ఎర్రబారడం

కంటి ఉపరితలం అంతా కూడా రక్తనాళాలతో నిండి ఉంటుంది. కళ్లు చిరాకుకు గురైనా లేక ఇన్ఫెక్షన్ బారిన పడినా ఈ రక్త నాళాల పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబారినట్టు కనిపిస్తాయి. మరో ముఖ్య కారణం పైన చెప్పుకున్నట్టు కంటిపై ఒత్తిడి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో రక్త నాళాల పరిమాణం పెరిగిపోయి కళ్లు ఎర్రబారతాయి. తగినంత నిద్ర లేకపోవడం, అలెర్జీలు, గాయాలకు గురైనా ఇలా జరుగుతుంది. కంజెంక్టివైటిస్ అనే మరో సమస్య వల్ల కూడా కళ్లు ఎర్రగా మారిపోవచ్చు. సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా ఏళ్ల పాటు గురైన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే సమస్య ఏంటన్నది నిర్ధారించుకునేందుకు వైద్యుల సాయం తీసుకోవడం మంచిది.

రేచీకటి

రాత్రి వేళ తక్కువ వెలుగున్న ప్రాంతాల్లో కొందరు కంటి చూపు పరంగా ఇబ్బంది పడుతుంటారు. మరీ దగ్గరకు వచ్చే వరకూ ఏమీ కనిపించవు. థియేటర్ లో దారి కనిపించకపోవడం కూడా ఈ కోవలోనిదే. ఇది రేచీకటి కావచ్చు. వాస్తవానికి ఇది మయోపియా (దూరం చూపు సమస్య) కావచ్చు. లేదా క్యాటరాక్ట్, కెరోకోనస్, విటమిన్ ఏ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడి ఉండొచ్చు. వైద్యులే సమస్యను గుర్తించి చికిత్స ద్వారా సరిచేయగలరు. కొందరిలో పుట్టుకతోనే ఈ సమస్య ఉంటుంది. అలాగే, రెటీనాకు సంబంధించి మాక్యులర్ రీజెనరేటివ్ సమస్యకు చికిత్స లేదు. ఇటువంటి వారు తక్కువ వెలుగులో జాగ్రత్తగా మసలుకోవాల్సిందే.

మెల్లకన్ను

చూస్తున్న సమయంలో కళ్లు రెండూ ఒకే కోణంలో ఉండవు. ఈ సమస్యను మెల్లకన్నుగా  పేర్కొంటారు. ఈ సమస్య దానంతట అదే పోదు. పైగా ఈ సమస్య ఉన్న వారి కళ్లు వారి కంట్రోల్ లో ఉండకుండా కదులుతుంటాయి. కంటి వైద్య నిపుణుడు (ఆప్తాల్ మాలజిస్ట్) ఈ సమస్యను సరిచేయగలరు. దీనికి చాలా చికిత్సలు ఉన్నాయి. విజన్ థెరపీ ద్వారా కళ్లను బలోపేతం చేస్తారు. సర్జరీ కూడా అవసరం పడొచ్చు.

కలర్ బ్లైండ్ నెస్

కొందరిలో కొన్ని రంగులు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. రంగుల మధ్య భేదాన్ని చెప్పలేరు. ఎరుపు, ఆకుపచ్చ మధ్య తేడాలను గుర్తించలేని పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కంట్లోని కలర్ సెల్స్ అచేతనంగా, పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్న వారికి ఆయా రంగులు కేవలం బూడిద రంగులోనే కనపడతాయి. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు. లేదా కొన్ని రకాల ఔషధాలు, వ్యాధుల కారణంగానూ దీని బారిన పడొచ్చు. మహిళల్లో కంటే మగవారిలో ఈ సమస్య ఎక్కువ. పుట్టుకతో సమస్య ఉంటే దాన్ని సరిచేయలేరు. ఆ తర్వాత ఏర్పడిన వారికి కొన్ని రకాల గ్లాసెస్ ను సూచిస్తారు.

యువెటిస్

కొన్ని రకాల వ్యాధుల కారణంగా కంటిలోపలి నల్లగుడ్డు వాపునకు దారితీస్తుంది. కంటి మధ్యలోని ఈ భాగం ఎన్నో రక్త నాణాల సమూహం. ఈ వ్యాధులు కంటి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దాంతో కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఎదురుకావచ్చు. ఏ వయసు వారికైనా ఇది రావచ్చు. వెంటనే తగ్గిపోవచ్చు లేదా దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. ఎయిడ్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అల్సరేటివ్ కొలైటిస్ ఎక్కువగా యువెటిస్ కు కారణం అవుతాయి. ఈ సమస్యలో కంటి చూపు మసకగా మారిపోవడం, కళ్లు నొప్పిగా ఉండడం, ఎర్రబారడం వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఓ సారి వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఈ సమస్య వెంటనే తగ్గడం అన్నది ఏ తరహా యువెటిస్ అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ప్రెస్బియోపియా (హ్రస్వదృష్టి)

దూరం చూపు మంచిగానే ఉన్నా కంటికి దగ్గరగా ఉన్న వాటిని చూడడంలో ఇబ్బంది ఈ సమస్యలో కనిపిస్తుంది. సాధారణంగా 40 సంవత్సరాల వయసులో ఇది రావడం సహజమే. చదివే సమయంలో పుస్తకాన్ని కంటికి కొంచెం దూరంగా ఉంచి చదవడం చేస్తుంటారు. హ్రస్వదృష్టి ఉందనడానికి సంకేతం ఇదే. రీడింగ్ గ్లాసెస్ వాడడం ద్వారా ఇబ్బందిని తొలగించుకోవచ్చు. కాంటాక్టు లెన్స్ లు, లాసిక్ తరహా సర్జరీలతోనూ పరిష్కారం పొందొచ్చు.

ఫ్లోటర్స్

చిన్న సైజులో చుక్కలు, మచ్చలు కంటి చుట్టూ కదులుతూ ఉంటాయి. బాగా వెలుగున్న చోట, మండే ఎండలో దీన్ని గుర్తించొచ్చు. ఇవి సహజమే. అయితే, ఒక్కోసారి తీవ్రమైన సమస్యలకు సంకేతాలుగా భావిస్తుంటారు. రెటీనల్ డీటాచ్ మెంట్ లో కంటి వెనుకనున్న రెటీనా పక్కకు జరగడం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు లైట్ ఫ్లాషెస్ కూడా కనిపిస్తుంటాయి. నీడలు కూడా వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా తరచుగా చుక్కలు కనిపిస్తూ వాటి సంఖ్య కూడా పెరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డ్రై ఐస్

కళ్లు పొడిబారిపోవడం. తగినంత నీరు కళ్లలో ఉత్పత్తి కానప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అరుదుగా ఇలా పొడిబారిపోవడం వల్ల కంటి చూపు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రత్యేక ఐ డ్రాప్స్ ను వాడడం ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. న్యూట్రిషనల్ సప్లిమెంట్లను కూడా సూచిస్తారు.

కళ్ల వెంట నీరు

కంట్లో నీటి పరిమాణం తగ్గిపోవడం ఒక సమస్య అయితే, పెరిగిపోవడం కూడా సమస్యే. కాంతి, గాలి లేదా ఉష్ణోగ్రత విషయంలో సెన్సిటివ్ గా ఉండే వారిలో అధికంగా నీరు కారడం కనిపిస్తుంది. అందుకే బయటి అంశాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

క్యాటరాక్ట్

కంట్లో ఉండే లెన్స్ ఆరోగ్యంగా ఉంటే అవి కెమెరా కళ్లలా ఉంటాయి. బయటి దృశ్యాల తాలూకు వెలుగు నేరుగా రెటీనాకు వెళ్లిపోవాలి. క్యాటరాక్ట్ సమస్యలో వెలుగు అంత సాఫీగా రెటీనాను చేరదు. దీంతో చూపులో స్పష్టత తగ్గుతుంది. రాత్రి సమయాల్లో బల్బ్ లను చూస్తున్నప్పుడు చుట్టూ వృత్తం మాదిరిగా కనిపిస్తుంది. క్యాటరాక్ట్ సమస్య ఒక్కసారిగా ఏర్పడదు. కొద్దికొద్దిగా డెవలప్ అవుతుంది. నొప్పి, ఎర్రబారడం, నీరు కారడం తరహా లక్షణాలేవీ ఉండవు. సర్జరీ ద్వారా పూర్తిగా తొలగిపోయే సమస్య ఇది.

గ్లకోమా

కంటి చూపును పూర్తిగా దెబ్బతీసే సమస్య ఇది. కంట్లో కొంత ఒత్తిడి అన్నది సహజంగా ఉంటుంది. రక్తపోటు మాదిరిగా అన్నమాట. అయితే ఈ కంట్లో ఒత్తిడి పెరిగిపోతే ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని కల్పించే కొన్ని వ్యాధుల సమూహమే గ్లకోమా. ఈ సమస్య బారిన పడిన వారిలో తొలి నాళ్లలో ఎటువంటి లక్షణాలు బయటపడవు.అందుకే క్రమం తప్పకుండా ఆరు నెలలు లేదా ఏడాదికోసారి కంటి వైద్యుణ్ణి సంప్రదించడం అవసరం. కంటికి గాయం అయినా, కంట్లో రక్తనాళాలు బ్లాక్ అయినా, వాపుకు సంబంధించి సమస్యలున్నా గ్లకోమాకు దారితీయవచ్చు. కంట్లో ఒత్తిడిని నియంత్రణలో ఉంచేందుకు వైద్యులు ఐ డ్రాప్స్ ను సిఫారసు చేస్తారు. అయినా ఒత్తిడి కంట్రోల్ అవకపోతే సర్జరీ ద్వారా సరిచేస్తారు.

రెటీనా సమస్యలు

కంటి వెనుక భాగంలో అతి పల్చని పొరే రెటీనా. ఇది కణాల కలయికతో ఉంటుంది. కంటి ముందున్న దృశ్యాలను గ్రహించి వాటిని మెదడుకు పంపిస్తుంది. రెటీనాలో సమస్య ఏదైనా ఈ వ్యవస్థకు విఘాతం కలుగుతుంది. వయసు కారణంగా ఏర్పడే మాక్యులర్ డీజనరేషన్ తో రెటీనా కొంత భాగం క్షీణిస్తుంది. డయాబెటిక్ రెటినోపతితో రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను దెబ్బతీయడం మరో కారణం. రెటీనా డీటాచ్ మెంట్ మరొకటి. తొలినాళ్లలో అయితే సమస్యను గుర్తిస్తే దాన్ని నియంత్రించి చూపును కాపాడొచ్చు. చేయి దాటిపోతే చూపును తిరిగి తెప్పించడం అసాధ్యం.

కంజెంక్టివైటిస్

కంటి రెప్పల వెనుకనున్న కణజాలం వాచిపోతుంది. దీంతో ఎర్రబారడం, దురద, మంట, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వయసుల వారిలో ఇది రావచ్చు. ఇన్ఫెక్షన్, కెమికల్స్ కు ఇరిటేషన్ కు దారితీసేవాటికి గురైనప్పుడు, అలెర్జీల కారణంగా ఈ సమస్య ఎదురవుతుంది. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

కార్నియా సమస్యలు

కంటి ముందు భాగంలో డ్రోమ్ మాదిరిగా కనిపించే భాగమే కార్నియా. ఇన్ఫెక్షన్, వ్యాధులు, గాయాలు, హానికారకాలకు ఎక్స్ పోజ్ అయినా కార్నియా సమస్యలు ఎదురవుతాయి. కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం, నొప్పి, చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపించొచ్చు.

ఐలిడ్ సమస్యలు

కంటిని రక్షించేవి రెప్పలు. కంటిలోపల అంతటా నీటిని వ్యాపింపజేయడం, కంట్లోకి వెళ్లే వెలుగును పరిమితం చేయడం చేస్తుంది. నొప్పి, దురద, నీరు కారడం, కాంతిని చూడలేకపోవడం అన్నవి కంటిరెప్పల సమస్యల్లా అనుమానించొచ్చు. వైద్యులను సంప్రదిస్తే మందులు, కంటి రెప్పుల లోపలి భాగాలు శుభ్రం చేయడం చేస్తారు.

వృద్ధాప్యంలో సమస్యలు

వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగిస్తుంటుంది. ఇది సహజం. ఈ సమయంలో కళ్లద్దాలు ధరిస్తే సరిపోతుంది. లాసిక్ తరహా సర్జరీని కూడా ఎంచుకోవచ్చు. ఈ సర్జరీలో చూపును చక్కదిద్దుతారు. మాక్యులర్ డీజనరేషన్, గ్లకోమా, క్యాటరాక్ట్ కారణంగా చూపులో సమస్యలు ఏర్పడతాయి. ఈ వయసులో చూపు మందగించడం సహజమే కదా అని ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఉన్న కొద్ది చూపును కూడా కోల్పోవాల్సి రావచ్చు.

కంటి అలెర్జీలు

అలెర్జీ కారణంగా తరచూ తుమ్ములు, జలుబు, ముక్కు కారటం వంటి సమస్యలనే అనుకునేరు?. అలెర్జీలు కంటిపైనా ప్రభావం చూపిస్తాయి. అలెర్జీ కారణంగా కళ్లు ఎర్రబారడం, దురదగా ఉండడం, మంట, నీరు కారడం కనురెప్పలు వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటికి వచ్చే అలెర్జీలను ఆక్యులర్ అలెర్జీ లేదా అలెర్జిక్ కంజెంక్టివైటిస్ గా పేర్కొంటారు. వీటి వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకినా ఈ తరహా లక్షణాలే కనిపిస్తాయి. అందుకే సమస్య ఏంటన్నది గుర్తించి, తగిన చికిత్స పొందేందుకు గాను కంటి వైద్య నిపుణుడిని సంప్రదించడం అవసరం.
మన శరీరం కొన్ని రకాల వాతావరణం, వస్తువులకు అతిగా స్పందించడం వల్ల అలెర్జీలు ఏర్పడతాయి. ఈ సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కళ్లలో హిస్టామిన్, ఇతర పదార్థాలను విడుదల చేస్తుంది. దీని వల్ల కళ్లు దురదగా ఉండడం, ఎర్రబడడం, నీరు కారడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. కంటికి ఏర్పడే అలెర్జీలను రెండు రకాలుగా చెబుతారు. సీజన్ వారీగా వచ్చేవి సాధారణ అలెర్జీలు. పెరెన్నియల్ అలెర్జీలు మరో రకం. సీజన్ వారీగా వచ్చే వాటి కారకాలు గాలి, గడ్డి, చెట్ల పుప్పొడి. పెరెన్నియల్ అలెర్జీలు ఎప్పుడైనా వచ్చేవి. దుమ్ము పురుగులు, పక్షి రెక్కలు, జంతువుల బొచ్చు, పెర్ ఫ్యూమ్, పొగ, క్లోరిన్, కాస్మెటిక్స్, కొన్ని రకాల మందులు, వాయు కాలుష్యకాలను కారకాలుగా చెప్పొచ్చు. వీటి వల్ల ఏడాది వ్యాప్తంగానూ కంటి అలెర్జీలతో బాధపడాల్సి రావచ్చు. వైద్యుల సూచనలతో కంటి అలెర్జీ కారకాలకు దూరంగా ఉండడం, సమస్యతో బాధపడుతుంటే కంటి డ్రాప్స్ వాడడం పరిష్కార మార్గాలు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :