Saturday, December 28, 2019

Home made veggies



Read also:

ఏం కూరలున్నాయి? ఏం కూర వండాలి అనే విషయంలో ప్రతి మహిళకూ ప్రతి రోజూ పజిలే. పూర్వం పెరటి తోటలుండేవి. ఎవరింట్లో వారే కూరగాయలను పండించుకునేవారు. మన నానమ్మ, అమ్మమ్మల కాలంలో ఏ సమయంలో అతిథులొచ్చినా గబగబా పెరట్లోని కూరలతో వంట చేసేవారు. ఇప్పుడా అవకాశం లేదని చింతపడే వారికి రుచికరమైన, పోషకాహారాన్ని మన ముంగిలిలోనే తయారు చేసుకునే ఒక చిన్న మార్గం.

పెంచుకోవడం ఎలా

2 అంగుళాల లోతు కలిగిన కార్డ్‌బోర్డుతో చేసిన ట్రే లేదా ప్లాస్టిక్‌ కంటెయినర్‌లో మట్టి, కొంత కొబ్బరి పీచు పొట్టు, చిన్న చిప్స్‌ కలిపి తీసుకోవాలి. కంటైనర్స్‌ మట్టివైతే ఇంకా మంచిది. విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 నుంచి 36 గంటల పాటు వస్త్రంలో కట్టి అలానే ఉంచితే మొలకలొస్తాయి. కంటైనర్‌లో ఒక పొర మట్టి చల్లి మొలక విత్తనాలను చల్లి పైన మరొక పొర మట్టిని చల్లి ప్రతి రోజూ నీరు చిలకరిస్తుంటే మొక్కలు 10-15 రోజుల్లో వినియోగానికి సిద్ధమౌతాయి. నేరుగా మండుటెండ తగిలేలా కాకుండా వెలుతురు, సూర్యకిరణాల స్పర్శ తగిలే ప్రదేశంలో వీటిని పెంచాలి. మొలకలో 2-4 ఆకులు రాగానే ఉపయోగించుకోవాలి.
ఈ చిన్న ఆకు కూరలనే మైక్రోగ్రీన్స్‌ అంటారు. మెంతి, కాలే, ముల్లంగి, పుదీనా, కొత్తిమీర, బ్రోకోలీ లాంటివి పెరగడానికి 10 నుంచి 15 రోజుల కంటె ఎక్కువ కాలం పట్టదు. వాటిని చిన్నగా ఉన్నప్పుడే అంటే లేతగా ఉన్నప్పుడే వాడుకుంటే ఎక్కువ పోషకాలుంటాయి. పరిపక్వత చెందిన ఆకుల కంటేె మైక్రోగ్రీన్స్‌లోనే ఎక్కువ పోషకాలుంటాయి.
ఆకు కూరలు, మైక్రోగ్రీన్స్‌ను పండించడానికి వేరు వేరు విత్తనాలు వాడతారనే భావన కొంతమందిలో ఉంది. కానీ రెండింటికి ఒకేరకమైన విత్తనాలనుపయోగిస్తారు. కాకపోతే లేతగా ఉన్నప్పుడు ఆహారంలో వాడే వాటిని మైక్రోగ్రీన్స్‌ అంటారు. పెద్దగా అయిన తరువాత వాడేవి మనం రోజూ చూసే ఆకుకూరలు. మెంతికూర, కొత్తిమీర, ఆవాలు ... ఇలా మనకు ఇష్టమొచ్చిన వాటిని వంటగదికి అందుబాటులో ఉండేలా పండించుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు

మైక్రోగ్రీన్స్‌ చిన్నగానే కన్పిస్తాయిగానీ వాటిలో శక్తిమంతమైన పోషకాలుంటాయి. పండ్లు, ధాన్యాలను మించిన పోషకాలుంటాయి. పరిపక్వత చెందిన ఆకుకూరలకంటె ఇవి 40 నుంచి 50 శాతం ఎక్కువ పోషక విలువలను అందిస్తాయి. ఎవరికి వారే సొంతంగా పండించుకొని సలాడ్లు, శాండ్‌విచ్‌లలో అలంకరించుకొని హాయిగా ఆరగించవచ్చు. మైక్రోగ్రీన్స్‌ను నిత్యం ఏదొక రూపంలో ఆహారంలో భాగంగా మార్చుకుంటే మంచిది. మైక్రోగ్రీన్స్‌గా పైన ఉదహరించినవే కాక గోధుమ, వరి, సజ్జ, బీన్స్‌, బఠాణీ, పొద్దు తిరుగుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌...ఇలా వేటినైనా మైక్రో గ్రీన్స్‌గా పెంచుకోవచ్చు. ఆహారంగా తీసుకోవచ్చు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :