Monday, December 9, 2019

assembly meetings



Read also:

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ  (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు.
 ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం కసరత్తు చేస్తుండగా.మరో వైపు వైకాపా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు  తెదేపా సన్నద్ధమవుతోంది. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు  50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసే యోచనలో సర్కారు ఉంది. సుమారు 20 అంశాలపై చర్చించడానికి  ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాఠశాల విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి.. 20 అంశాలపై  చర్చించాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల తొలిరోజు దిశ ఘటనపై చర్చించి... మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశముంది.

మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆరునెలల వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు 21 అంశాలను ఎంచుకున్న ఆపార్టీ.. వీటిపై సమగ్ర చర్చ జరగాలంటే కనీసం రెండు వారాలైనా సమావేశాలు నిర్వహించాలని రేపు జరిగే బీఏసీలో పట్టుబట్టనుంది. ప్రజల్లో వివిధ అంశాలపై వ్యక్తమవుతున్న నిరసనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ.. ప్రతి రోజు ఏదో ఒక సమస్యపై నిరసన కార్యక్రమాలు సభ ప్రారంభానికిముందు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

తెదేపా ఎంచుకున్న 21 అంశాలివే.

ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక ధర విపరీతంగా పెరిగిపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు నిలిపివేయడం, సంక్షేమ పథకాల్లో కోత, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక పథకాలు.. పనులు నిలిపివేత, బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల విక్రయాలు, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం... దుబారా ఖర్చులు, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు.. వారి ఆత్మహత్యాయత్నాలు, ఉపాధి హామీ పథకం, హౌసింగ్‌ బిల్లుల పెండింగ్‌,  ఇళ్ల నిర్మాణం నిలిపివేత, మీడియాపై ఆంక్షల జీవో, వలంటీర్ల నియామకంలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీక్‌, నదుల అనుసంధానం, విభజన హామీల అమలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు, తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, రైతుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ నాలుగైదు విడతల ఎగవేత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా సన్నద్ధమై సమావేశాలకు రావాలని, అన్ని రకాల చర్చల్లో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున గళం వినిపించాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు.
 వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు పూర్తయినందున పాలనా వైఫల్యాలపై ఇప్పటికే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. భాజపా నేతలు కూడా వివిధ సందర్భాల్లో  వైకాపా ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా ప్రతిపక్షాలకు అవకాశంగా మారింది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, రాజధాని అభివృద్ధి, నిత్యావసరాల ధరల పెరుగుదలపైనే   ప్రధానంగా విపక్షాలు ఆందోళనలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చలికాలంలో నిర్వహిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించనున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :