Saturday, November 2, 2019

Isro chief talks about softlanding



Read also:

చంద్రయాన్‌-2తో కథ ముగియలేదని.. త్వరలో 'సాఫ్ట్‌ ల్యాండింగ్‌'ని నిజం చేసి చూపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ శివన్‌ ధీమా వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో అనేక అత్యాధునిక శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. చంద్రయాన్‌-2 ప్రయోగం నుంచి సాంకేతికతపరంగా ఇస్రో ఎంతో అనుభవం గడించిందని తెలిపారు. దీంతో సమీప భవిష్యత్తులో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కలని నిజం చేసి తీరతామన్నారు. ఐఐటీ దిల్లీలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 'ఆదిత్య ఎల్‌1' ఉపగ్రహం, మానవసహిత అంతరిక్ష యాత్రపై ప్రస్తుతం దృష్టి సారించామన్నారు. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
చిన్న ఉపగ్రహ వాహక నౌకల (ఎస్‌ఎస్‌ఎల్వీ) ప్రయోగానికి సర్వం సిద్ధమైందని శివన్‌ తెలిపారు. ఇది డిసెంబర్‌ లేదా జనవరిలో తొలిసారి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుందన్నారు. త్వరలో 'నావిక్‌' సిగ్నల్స్‌ మొబైల్‌ ఫోన్లకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. భారత్‌ అభివృద్ధి చేస్తున్న సొంత ఉపగ్రహాధారిత నావిగేషన్‌ వ్యవస్థే నావిక్‌. దీని ఆధారంగా సమాజానికి ఉపయోగపడే అనేక అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమం అవుతుందన్నారు.
ప్రస్తుతం ప్రపంచం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని శివన్‌ అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని అత్యంత జాగ్రత్తగా, తెలివితో నిర్ణయించుకోవాలని సూచించారు. డబ్బు కోసం కాకుండా అభిరుచులకనుగుణంగా లక్ష్యాల్ని ఎంచుకోవాలన్నారు. అలాగే ఐఐటీ దిల్లీలో 'స్పేస్‌ టెక్నాలజీ సెల్(ఎస్‌టీసీ)' నెలకొల్పడంపై ఇరు సంస్థల మధ్య ఈ కార్యక్రమంలో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే లాంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ఎస్‌టీసీని ఉన్న విషయం తెలిసిందే. ఇవి ఇస్రో చేస్తున్న పరిశోధనలు, ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :