Sunday, November 17, 2019

arogya sri



Read also:

పథకాల అర్హతల్లో మార్పులు
సొంత కారు ఉన్నా ఆరోగ్యశ్రీ
తెల్లరేషన్‌కార్డు లింకు తీసివేత
ట్యాక్సీ, ఆటోవాలాలకీ బియ్యం
జగన్‌ విద్యాపథకాలకు ఆదాయ
పరిమితి 2.50 లక్షలకు పెంపు
పథకానికొక కార్డు కొత్తగా జారీ
సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం వివిధ పథకాల అర్హతలను సడలించనుంది.బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లబ్ధిదారులకు వేర్వేరుగా కార్డులు జారీచేయనుంది. డిసెంబర్‌ 20 లోగా లబ్ధిదారుల జాబితాలను విడుదల చేయనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలను సిద్ధమయ్యాయి. ఇందులో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ కాగా, మిగతా సంక్షేమ పథకాల అర్హతల్లో చేసిన మార్పులతోనూ త్వరలోనే ఆదేశాలు జారీ కానున్నాయి. కొత్తగా జారీ చేయనున్న కార్డుల ప్రక్రియను ఈ నెల 20 నుంచి చేపడతారు. పేదలెవరికీ అన్యాయం జరగకుండా అర్హతలను సడలించి గతంలో ఉన్న ఆదాయ, భూపరిమితులను పెంచి జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రేషన్‌కార్డు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు, పట్టణాల్లో రూ.6250 ఆదాయం ఉండాలి. తాజాగా దీనిని రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉన్నవారికి వర్తించేలా సవరించారు.

గతంలో రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు కాగా.. దీనిని మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట, లేదా రెండూ కలిపి 10ఎకరాల్లోపు ఉన్న వారికి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. గతంలో నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉంటేనే అర్హులు. దీన్ని 300 యూనిట్లకు పెంచారు. పారిశుధ్య కార్మికులకు నిబంధనల నుంచి మినహాయింపు నిచ్చారు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకుంటున్న వారికీ అర్హత కల్పించారు. అలాగే.. వైఎ్‌సఆర్‌ పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను సడలించారు. గతంలో మాగాణి రెండున్నర ఎకరాలు, మెట్ట ఐదెకరాలు లేదా రెండు కలిపితే 5 ఎకరాల లోపు ఉన్న వారే అర్హులుకాగా, తాజా నిబంధనల్లో ఐదెకరాల మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికి వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ నిబంధనలూ సడలింపు

వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం తాజాగా ఉన్న నియమ నిబంధనల్లో భారీగా సడలింపులు చేసింది. తెల్లరేషన్‌కార్డు ఉన్నవాళ్లకే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతంలో నిబంధనలున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారినీ ఈ పథకంలో చేర్చింది. 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాల మెట్ట లేక రెండు కలిపి 35 ఎకరాలు ఉన్న వారు కూడా ఆరోగ్యశ్రీకి అర్హులేనని ఉత్తర్వులు జారీచేసింది. కుటుంబంలో స్థిరాస్థి లేకుండా ఒక కారు ఉన్నవారికి లేదా పట్టణ ప్రాంతాల్లో 3 వేల చదరపు అడుగుల స్థిరాస్తి ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తూ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయనుంది.
దీంతో పాటు హాస్టల్‌ వసతి ఖర్చుల కింద ఏటా రూ.20 వేలను జగనన్న విద్యావసతి కింద ఇవ్వనుంది. దీనికోసం గతంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాదాయం పరిమితి రూ.2 లక్షలు, బీసీలకు రూ.ఒక లక్ష లోపు ఉన్న వారికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. మైనారిటీలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉన్న వారికి వర్తిస్తుందని, కాపులకు రూ.ఒక లక్ష, ఈబీసీలకు రూ.ఒక లక్ష, దివ్యాంగులకు రూ.2 లక్షల లోపు ఉన్న వారికి వర్తిస్తుందని గతంలో నిబంధనలున్నాయి. తాజాగా ప్రభుత్వం రూ.2.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యావసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఆదాయపు పన్ను చెల్లించే వారిని అనర్హులుగా చేశారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :