More ...

Wednesday, October 23, 2019

Idea born out of suffering. Red Bus!Read also:

బాధలో నుంచి పుట్టిన ఐడియానే. రెడ్ బస్

ఎర్ర బస్సు.చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారిని ఆట పట్టించేందుకు పట్టణ వాసులు వినియోగించే ఊత పదం. అయితే, ఊత పదానికి కాస్తంత ఆంగ్లం రంగుపూస్తే ‘రెడ్ బస్’ అయినట్టే కదా. విద్య, ఉపాధి కోసం సొంత ఊళ్లకు దూరంగా ఉంటున్న వారికి ‘రెడ్ బస్’ పరిచయం అవసరం లేదు. తరచుగా ఇతర రాష్ట్రాలకు పర్యటనలు జరిపే వారికి కూడా రెడ్ బస్ చిరపరిచితమే. మనం బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు సదరు బస్సు సర్వీసుల వేళలతో పాటు వాటిలో ప్రయాణించేందుకు అవసమయ్యే టికెట్లను అందించే సంస్థ ఇది. దీని వ్యవస్థాపకులు ఎవరో తెలుసా. మన తెలుగు కుర్రాళ్లు. స్వల్ప పెట్టుబడితో ప్రారంభించిన రెడ్ బస్ ను జెట్ స్పీడ్ తో నడిపించి, ఆ తర్వాత భారీ లాభాలకు విక్రయించిన మన తెలుగు కుర్రాళ్లు నిజంగా ఘటికులే. లేకపోతే ఆ కుర్రాళ్లలో ఓ చాకులాంటి యువకుడు, ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఏండీవర్ బృందంలో స్థానం సంపాదించిన రెండో భారతీయుడిగా ఎలా నిలుస్తారు చెప్పండి

పండుగకు ఇంటికెళ్లలేకపోయానన్న బాధతోనే

అది 2005, జనవరి నెల, సంక్రాంతి పండుగ ముందు రోజు. సామా ఫణీంద్రా రెడ్డి బెంగళూరులో ఉన్నాడు, ఉపాధి నిమిత్తం ఆ మహా నగరంలో ఉంటున్నాడు. నిజామాబాద్ లో ఉన్న ఇంటికి వెళ్లి తీరాల్సిందే. సంక్రాంతి పండుగను కుటుంబంతో కలిసి వేడుకగా జరుపుకోవాల్సిందే. తీరా ఏ బస్సు చూసినా అడుగు పెట్టేందుకు కూడా ఖాళీ లేదు. ఎలాగోలా ఓ ట్రావెల్ ఏజెంటును పట్టకుని బతిమాలి, ఓ టికెట్ సంపాదించాడు. తీరా చూస్తే, ఆ టికెట్ కూడా  రద్దయింది. కానీ ఆ ఒక్క  టికెట్ కోసం ఆ ఏజెంట్ చాలామంది ఆపరేటర్లకు ఫోన్ లు చేసి ఖాళీ లేమైనా ఉన్నాయేమోనని అడగడం గమనించాడు. ఆ అనుభవం  నుంచే ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఆ ఐడియాకు స్నేహితుల ప్రోత్సాహం లభించడంతో ‘రెడ్ బస్’ ఆవిర్భవించింది. నాటకీయ పరిణామాల మధ్య రూపుదాల్చిన రెడ్ బస్ మన తెలుగు కుర్రాళ్లకు బంగారు భవిష్యత్తుతో పాటు కీర్తి ప్రతిష్ఠలను కూడా సంపాదించి పెట్టింది. వారిలో ఫణీంద్ర బాధపడ్డ వ్యక్తి అయితే, అతడి స్నేహితులు పసుపునూరి సుధాకర్, చరణ్ పద్మరాజు.

విద్య, ఆ తర్వాత ఉద్యోగం.

తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన 33 ఏళ్ల ఫణీంద్ర, ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నిజామాబాద్ లోనే పూర్తి చేశారు. అనంతరం బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్య, ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న మరుక్షణమే బెంగళూరులోనే ఉద్యోగాన్ని వెతుక్కున్నారు. బెంగళూరులోని ఎస్టీ ఎలక్ట్రానిక్స్ లో కొంత కాలం పనిచేసి, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ లో చేరారు. అందులో ఉండగానే 2005లో ఇంటికెళ్లలేకపోయి బాధపడటం, ఐడియా తట్టడం, ముందడుగు వేయడం జరిగిపోయాయి.

780 కోట్లకు విక్రయం

చిన్నపాటి మొత్తంతో ప్రారంభమై, ఏటా 250 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తున్న రెడ్ బస్... సాధారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా దీనిపై దృష్టి సారించిన వారిలో ఐబిబో గ్రూప్ యాజమాన్యం కూడా ఒకటి. దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ యాజమాన్యం కింద నడుస్తున్న ఐబిబో గ్రూపు... రెడ్ బస్ ను 780 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ప్రముఖ పెట్టుబడుల సంస్థగా పేరుగాంచిన నాస్పర్స్... రెడ్ బస్ లో అంత విషయం లేనిదే, అంత భారీ రేటు ఎలా కడుతుంది.

రెడ్ బస్ లోనే కాక దాని రూపకర్త ఫణీంద్రలోని విషయాన్ని గ్రహించిన నాస్పర్స్... తన చేతిలోకి వచ్చినా, రెడ్ బస్ కు సీఈఓగా కొనసాగమని కోరింది. నాస్పర్స్ ఆధ్వర్యంలోకి వెళ్లిన రెడ్ బస్ కు ఏడాది పాటు పనిచేసిన ఫణీంద్ర, స్నేహితులతో కలిసి బయటకు వచ్చేశారు. మరో కొత్త ఐడియా కోసం అన్వేషిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు సాఫ్ట్ ల్యాబ్ సీఈఓగా వ్యవహరించిన ఫణీంద్ర, అంతకుముందు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ లో పనిచేశారు.

జెట్ స్పీడుతో రెడ్ బస్ ప్రయాణం

ప్రస్తుతం రెడ్ బస్, టర్నోవర్ రూ. 1,000 కోట్లు. దేశ వ్యాప్తంగా 4,500 రూట్లలో నడిచే బస్సు సర్వీసులకు సంబంధించి టికెట్లను జారీ చేస్తోంది. 700కి పైగా ట్రావెల్ ఏజెన్సీలు రెడ్ బస్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని, ఆ సంస్థ జారీ చేస్తున్న టికెట్ల ఆధారంగా బస్సు సర్వీసులను నడుపుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాల్లో నడిచే 10,000లకు పైగా బస్సు సర్వీసులకు సంబంధించి రోజూ 5 వేల టికెట్లను జారీ చేస్తోంది. తొలుత ట్రావెల్ ఏజెంట్ల వద్దకు రెడ్ బస్ వెళితే, ప్రస్తుతం రెడ్ బస్ కోసం ట్రావెల్ ఏజెంట్లు బారులు తీరుతున్నారు.

టికెట్ల జారీతో పాటు ఏ రూట్లో ఎన్ని బస్సు సర్వీసులు, ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటున్నాయన్న సమగ్ర సమాచారం రెడ్ బస్ వెబ్ సైట్లో లభ్యమవుతోంది. రెడ్ బస్ ఆదాయంలో 85 శాతం వరకు కేవలం మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారానే సమకూరుతోంది. అంటే టెక్నాలజీని వినియోగించుకుని రవాణా రంగంలో ఏ మేరకు వృద్ధి సాధించవచ్చో ఫణీంద్ర కళ్ల ముందు సాక్షాత్కరించారు.

అన్నీ చకచకా జరిగిపోయాట

2005లో తనకు ఎదురైన అనుభవం నేపథ్యంలో తట్టిన ఆలోచనకు అన్ని వనరులు చకచకా దొరికిపోయాయంటారు ఫణీంద్ర. మదిలో ఆలోచన మొదలు కాగానే, స్నేహితుల వద్ద ప్రస్తావించగా, వారు కూడా ముందువెనుకా చూడకుండా తన యత్నానికి తోడుంటామని చెప్పి, తనలో ధైర్యాన్ని నింపారని ఫణీంద్ర నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. స్నేహితుల అండైతే దొరికింది కాని మరి పెట్టుబడి మాటేంటన్న సందిగ్ధంలో మునిగిపోయాడట. పెట్టుబడితో పాటు నిర్వహణలోనూ తోడ్పాటునందించే టీఐఈ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం ను సంప్రదించగా, ఫణీంద్ర ఐడియాకు సదరు సంస్థ ముచ్చటపడటమే కాక కొంతమేర మూలధనాన్ని, నిర్వహణ సహకారాన్ని అందింంచేందుకు ముందకు వచ్చింది. ఈ సంస్థనే మెప్పించిన మన కుర్రాళ్ల వద్ద పెట్టుబడి పెట్టేందుకు ఆ తర్వాత చాలా మందే ముందుకు వచ్చారట.

ఖండాంతరాలు దాటిన ఖ్యాతి

ఆరేళ్ల పాటు రెడ్ బస్ ను దిగ్విజయంగా నడిపిన ఫణీంద్ర, ఆ ప్రయాణంలో చూపిన ప్రతిభ దేశాలను దాటి ఖండాంతర వ్యాప్తి చెందింది. భారత్ లో అత్యంత నమ్మదగ్గ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల జాబితాలో...ఫణీంద్రకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ వరల్డ్‘ మూడో స్థానాన్ని కట్టబెట్టింది. విశ్వవ్యాప్తంగా అత్యంత చురుకైన వ్యక్తిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2011లో అతడికి పట్టం కట్టింది. అంతేకాదు, ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక వర్సిటీగా పేరుగాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫణీంద్రకు, తన ఎండీవర్ టీంలో సభ్యత్వం ఇచ్చింది.

ఇలా ఇప్పటిదాకా ఎండీవర్ టీంలో సభ్యత్వం పొందిన రెండో భారతీయుడిగా ఫణీంద్ర చరిత్రకెక్కాడు. రెడ్ బస్ సాహసంతో ఆర్థికంగానూ బాగానే బలపడ్డ ఫణీంద్ర, భవిష్యత్తులో ఏ సంచనాలకు తెరతీస్తారోనన్న ఆసక్తి పారిశ్రామిక వర్గాల్లో ఉంది. ప్రస్తుతం తన బుర్రకు పదును పెట్టే క్రమంలో బిజీగా ఉన్న ఫణీంద్ర నుంచి త్వరలోనే మరో కొత్త కంపెనీ తెరపైకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :