Friday, October 25, 2019

Diwali full story



Read also:

హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి.
Diwali

ధన త్రయోదశి

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, వాడని పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్త వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుంది.

ధన్వంతరి జయంతి

ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు . ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశని, ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా కలిగిస్తుంది.

చతుర్దశి- నరక చతుర్దశి

దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తెల్లవారుజామునే లేచి, నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. వంటికి నువ్వుల నూనె పట్టించి, తలంటుకుని, నీటిలో ఆముదపు చెట్టు కొమ్మతో కలయ తిప్పి స్నానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి, నూనెతో తలంటి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటారు.

దీపావళి అమావాస్య

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. స్య! భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.

తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.

బలి పాడ్యమి

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

భగిని హస్త భోజనం

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. పురుషులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ని ఎంతగానో అభిమానించేది. నిత్యమూ తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరికి ఇంటికి వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి అభ్యంగనస్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది.

దీపావళి బాణసంచాను కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


  • దుకాణం నుండి తెచ్చిన బాణాసంచాను ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌ వంటి దాన్లో పెట్టాలి. ఈ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.
  • బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
  • టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్‌ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.
  • మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.
  • చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.
  • బాణాసంచాను కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.  
  • వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
  • బాణాసంచాను ఒక సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
  • కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
  • ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు.గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి.
  • నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.  
  • గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.
  • గాయాన్ని కడగడానికి ఐస్‌ వాటర్‌ ఉపయోగించడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. 
  • మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సల్ఫర్, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
  • బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
  • డైరెక్ట్‌ గా మంట కంటికి తగిలితే కార్నియా దెబ్బతింటే కంటికి శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :