Thursday, October 31, 2019

becareful with these android apps



Read also:

ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే! 

ఏదో ఒక కొత్త తరహా యాప్ వస్తుంటుంది. మనం ఇన్ స్టాల్ చేస్తూ వెళుతుంటాం. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఫోన్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ ప్రమాదంలో పడతాయి. మన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వంటివీ పరుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల యాప్ లకు దూరంగా ఉండడమే ఉత్తమం. గూగుల్ ప్లేస్టోర్ లో రోజూ కొన్ని వేల సంఖ్యలో కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. అందువల్ల అన్నింటినీ గూగుల్ సంస్థ ట్రాక్ చేయలేదు. ఒక వేళ వినియోగించాల్సి వచ్చినా.. కాస్త పేరున్న, రక్షణపరంగా ఉత్తమమైనవిగా రేటింగ్ ఉన్న వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్. మరి ఎలాంటి యాప్ లతో ప్రమాదం, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం.

వాతావరణ (వెదర్) వివరాల యాప్స్ తో ప్రమాదం

ఉష్ణోగ్రతలు, వర్షం పడే అవకాశాలు, గాలిలో తేమ వంటి వివరాలు కచ్చితంగా అందిస్తామంటూ చాలా రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రఖ్యాత యాప్ లు మినహా మిగతావన్నీ ఫోన్ పనితీరును దెబ్బతీసేవేనని, వాటితో భద్రతకూ ముప్పు ఉంటుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల యాప్స్ లో అంతర్గతంగా ట్రోజాన్లు అనే వైరస్ లు ఉంటున్నాయి. మనం యాప్ ను ఇన్ స్టాల్ చేసేటప్పుడే లొకేషన్, మెస్సెజెస్, కాల్ లాగ్ డేటా వంటి చాలా రకాల పర్మిషన్లు అడుగుతుంటాయి. మనం పర్మిషన్ ఇచ్చేయడంతో.. అవి డేటాను సేకరిస్తూ, హ్యాకర్లకు
 చేరవేస్తుంటాయి. అందువల్ల మనకు అంతగా వాతావరణ వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేరుగా ఫోన్ లోని ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ లో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. 

 సోషల్ మీడియా యాప్స్ తో ఫోన్ స్లో

ఇప్పుడంతా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్వీటర్ వంటి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫోన్లో వాటన్నింటి యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ తో భద్రతా పరమైన ప్రమాదం పెద్దగా లేకపోయినా.. వాటి వల్ల ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి యాప్స్ చాలా ఎక్కువ మెమరీని వినియోగించుకుంటూ, ఎక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ.. ఇంటర్నెట్ కు కనెక్ట్ అవుతూ.. డేటా సింక్రనైజేషన్ కు ప్రయత్నిస్తాయి. దీనివల్ల ఫోన్ బాగా స్లో అవుతుంది. తక్కువ ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యమున్న ఫోన్లు అయితే వీటి వల్ల తరచూ ల్యాగ్ అవుతూ ఉంటాయి కూడా.
మన వినియోగించేవి మినహా అవసరం లేని సోషల్ మీడియా యాప్స్ ను వెంటనే ఫోన్ లోంచి తొలగించడం చాలా బెటర్.
ముఖ్యంగా ఫేస్ బుక్ యాప్ చాలా ఎక్కువగా డేటాను కూడా వినియోగించుకుంటుంది. దాని బదులుగా నేరుగా క్రోమ్ వంటి ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఇన్ స్టాల్ చేసుకుని దానిలో ఫేస్ బుక్ ను వినియోగించడం బెటర్. దీనివల్ల డేటా తక్కువగా వినియోగం అవడంతోపాటు ఫోన్ కూడా చాలా వేగంగా పనిచేస్తుంది.

ఫోన్ ఆప్టిమైజర్ యాప్ లు దండగ

స్మార్ట్ ఫోన్ లో జంక్ ఫైల్స్ ను, అనవసరపు డేటాను, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను తొలగించి.. ఫోన్ లో మెమరీని ఫ్రీ చేస్తామని, వేగంగా పనిచేసేలా చేస్తామని పేర్కొంటూ ఎన్నో రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అలాంటి యాప్ ల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. పైగా ఫోన్ స్లో అవడంతో పాటు మన వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేగాకుండా వాటి వల్ల అనవసరపు యాడ్స్ ను భరించాల్సి ఉంటుంది. 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం వస్తోంది. అంటే ఫోన్ తయారీదారులే ఫోన్ కు తగినట్లుగా ఆ ఫోన్ మెరుగ్గా పని చేసేలా ఆండ్రాయిడ్ లో మార్పులు చేసి అందజేస్తున్నారు. అలాంటివాటిలోనే ఇన్ బిల్ట్ గా డేటా క్లీనింగ్, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను క్లోజ్ చేయడం వంటి ఆప్షన్లు ఉంటున్నాయి.
గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధిక రేటింగ్ ఉన్న క్లీన్ మాస్టర్, డీయూ బ్యాటరీ డాక్టర్ సహా అన్ని రకాల ఆప్టిమైజర్ యాప్ లు కూడా ఫోన్ పనితీరు మందగించేలా చేస్తాయని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు నిర్ధారించారు.ఆప్టిమైజర్ యాప్ లు వినియోగించడానికి బదులుగా.. కొద్ది రోజులకోసారి ఫోన్ లోని డేటాను బ్యాకప్ తీసుకుని, ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మేలు. దానివల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.

స్మార్ట్ ఫోన్ లో ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్లతో సమస్యలు

మనం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు ఇన్ బిల్ట్ గా ఇంటర్నెట్ బ్రౌజర్లు వస్తుంటాయి. అవి చాలా వరకు పాపులర్ కాకపోవడంతోపాటు చాలా స్లోగా పనిచేస్తుంటాయి. ఫోన్ లో ఏదైనా ఇంటర్నెట్ లింక్ ను క్లిక్ చేయగానే దాదాపుగా ఇన్ బిల్ట్ గా వచ్చిన బ్రౌజర్ లో ఓపెన్ అయ్యేలా సెట్టింగ్ ఉంటుంది. అయితే ఏ బ్రౌజర్ తో ఓపెన్ చేయాలనే ఆప్షన్ కూడా వస్తుంటుంది. అందువల్ల సెట్టింగ్స్ లో డీఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్ ను మార్చుకుంటే బెటర్.

ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్లు పాత వెర్షన్లకు సంబంధించినవి అయి ఉంటాయి. వాటిల్లో సెక్యూరిటీ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మన డేటా హ్యాకర్లు, మాల్ వేర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

పేరులేని సంస్థల యాంటీ వైరస్ లతో ప్రమాదం

మన స్మార్ట్ ఫోన్ ను వైరస్ లు, ట్రోజాన్లు, మాల్ వేర్ల నుంచి రక్షించుకునేందుకు యాంటీ వైరస్ యాప్ లను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటాం. గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని వందల రకాల యాంటీ వైరస్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఊరూ పేరులేని సంస్థలకు చెందిన యాప్ లే. ఆకర్షణీయమైన లోగోలు, పేర్లతో ఉండే ఈ యాంటీ వైరస్ యాప్ లతో ప్రమాదం చాలా ఎక్కువ. అలాంటి వాటిల్లో ట్రోజాన్లు ఉంటాయి. అవి మన ఫోన్ లోని సమాచారాన్ని, వ్యక్తిగత డేటాను తస్కరిస్తాయి. కొందరు హ్యాకర్లు ఆకర్షణీయమైన పేర్లతో, లోగోలతో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను తయారు చేసి.. గూగుల్ ప్లేస్టోర్ లో పెడుతున్నారు. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారో అంతే సంగతి.
కాస్పర్ స్కీ, అవైరా, ఏవీజీ, అవాస్ట్, మెకఫీ వంటి ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన యాంటీ వైరస్ ను మాత్రమే వినియోగించడం బెటర్.
ఇటీవల గూగుల్ సంస్థ ప్లేప్రొటెక్ట్ పేరుతో యాంటీ వైరస్, ట్రోజాన్ స్కానర్ ను తీసుకువచ్చింది. ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే ముందు ప్లే ప్రొటెక్ట్ అప్రూవ్ ఉందా లేదా చూడాలి.

అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో జాగ్రత్త

కేవలం ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేయడంతోపాటు వీడియోలు, ఆడియోను నేరుగా స్ట్రీమ్ చేయడం వంటి అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి యాప్ లకు మన ఫోన్ కు సంబంధించిన చాలా పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఈ యాప్ ల ద్వారా కీలకమైన వ్యక్తిగత డేటా, కాల్ డేటా, ఎస్సెమ్మెస్ లు వంటి సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువ. దీనితోపాటు ఇలాంటి యాప్ లలో విపరీతంగా యాడ్స్ వస్తుంటాయి. దాని వల్ల మన డేటా వేస్ట్ కావడమే కాకుండా.. ఫోన్ చాలా స్లో అవుతూ ఉంటుంది.
అటు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇటు స్ట్రీమింగ్ కు ఉపయోగపడే యాప్ లను వినియోగించకపోవడం చాలా బెటర్. దానికి బదులుగా విడిగా స్ట్రీమింగ్ కు వినియోగించే.. మంచి సంస్థల యాప్ లను ఉపయోగించాలి.

ర్యామ్ ఇంప్రూవ్ మెంట్ యాప్స్ తో లాభం సున్నా.

మీ ఫోన్ లో ర్యామ్ ను పెంచుతామంటూ కొన్ని రకాల యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వేరే ఇతర యాప్ లను ఉపయోగించినప్పుడు, వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి యాప్ లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తూ.. ఇన్ స్టాల్ చేసుకునేలా ఊరిస్తుంటాయి. వాస్తవానికి ఇలాంటి యాప్ లు కేవలం ఆప్టిమైజర్లు మాత్రమే. అవి ఫోన్ లో క్యాచీని, ఇతర తాత్కాలిక ఫైళ్లను క్లీన్ చేస్తాయంతే. అంతేతప్ప వాటితో ఫోన్ లో ర్యామ్ పెరగడం వంటివేవీ ఉండవు. అసలు ఫోన్ లో ఇచ్చిన ర్యామ్ కు మించి సామర్థ్యాన్ని పొందడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఇలాంటి యాప్స్ కేవలం యాడ్స్ (ప్రకటనల) ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి, మన ఫోన్ లోని డేటాను తస్కరించడానికి మాత్రమే తయారు చేస్తుంటారు.

లై డిటెక్టర్లు పనిచేయవు.. అవి జస్ట్ ఫర్ ఫన్

మన వాయిస్ ను బట్టి మనం నిజం చెబుతున్నామో, అబద్ధం చెబుతున్నామో చెప్పగలమంటూ గూగుల్ ప్లేస్టోర్ లో కొన్ని రకాల యాప్స్ ఉన్నాయి. అవేవీ వాస్తవానికి లై డిటెక్టర్ గా పని చేయలేవు. కేవలం సరదా కోసం రూపొందించేవి మాత్రమే. ఇది తెలిసి కూడా కొందరు సరదాగా అలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేస్తుంటారు. వీటివల్ల సరదా ఏమోగానీ మన ఫోన్ పనితీరు దెబ్బతింటుంది.
సాధారణంగా ఇలాంటి ఫన్నీ యాప్స్ కు మన ఫోన్ లోని కాంటాక్టులు, ఎస్సెమ్మెస్ లు, లొకేషన్ వంటి వ్యక్తిగత వివరాల పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
అయినా ఇలాంటి ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు అలాంటి పర్మిషన్లు అడిగితే.. దానిని ఇన్ స్టాల్ చేయకుండా ఉండటమే బెటర్. లేకుంటే మన వ్యక్తిగత సమాచారం ఇతరుల పాలవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :