Tuesday, October 29, 2019

This is the highlight of Kartika Month



Read also:

ఆస్తిక లోకంలో కార్తిక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తిక పురాణంతో పాటు మరికొన్ని వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. ఈ కార్తికమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజులపాటు కార్తిక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ పురాణ క్రమాన్ని పరిశీలిస్తే తొలిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తికమాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. నైమిశారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్టుడు జనకుడికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విశిదమవుతుంది.

పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే!

కార్తికమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమినాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తిక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. ఈ మాసంలో చెరువులు, బావులు, దిగుడు బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. కార్తికంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తిక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణం అని చెబుతారు. 

అభిషేకంతో పాటు

ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరిచెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తికంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశెపూలు, మల్లె, గరిక తదితరాలతోపాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయట పడవచ్చంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధాన్య, ఫల, ధన, గృహ దానాలు మామూలు సమయాలకన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తికమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తిక పురాణం వివరిస్తోంది. ఈ పురాణంలో ఉన్న అనేకానేక కథలు పురాణ మహాత్మ్యాన్ని వివరిస్తున్నాయి. 
కార్తికమాసం ఉపవాసం విధానం ఇది
మిత్రవర్మ, తత్వనిష్ఠుడు, సత్రాజిత్తు, దేవశర్మ కుమారుడు (మూషికం), ద్రావిడ దేశపు స్త్రీ, అజామిళుడు, మందరుడు, ధర్మవీరుడు, సువీరుడు, పురంజయుడు, అంబరీషుడు లాంటి అనేకానేకుల ద్వారా ధర్మ మార్గ వర్తనం వివరించటం కనిపిస్తుంది. కార్తిక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తిక పురాణం పేర్కొంటోంది. ఒకటో రోజున అర్చన, అగ్ని పూజ నిర్వహించాలి. సాయంత్రంపూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తికమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి. కార్తిక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తిక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలుగా చేసుకోవచ్చని వివరించాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తిక సోమవారంనాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చేయటం సాధ్యం కానివాళ్లు ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయటాన్ని నక్తం అని అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాల్గింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తిక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది. 

సోమవారం వ్రత ఫలితం

సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్లు నమక, చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ట మహర్షి నిస్టురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి చెప్పాడు. నిష్టురి గారాబంగా పెరిగి తప్పుదోవ లెన్నెన్నో తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది. మరుసటి జన్మలో ఓ శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తికమాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మృతి పొందింది. ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేదపండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. తాను కార్తిక సోమవార వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు. వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తిక సోమవార వ్రతాలలో ఒక సోమవారంనాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది. వశిష్టుడు ఇలా కార్తిక సోమవార వ్రత మహాత్మ్యాన్ని జనకుడికి వివరించాడు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :