More ...
More ...
More ...

Saturday, September 7, 2019

నిష్ఠ’తో ఉపాధ్యాయ శిక్షణ గురువిద్యకు మెరుగులుRead also:

నిష్ఠ’తో ఉపాధ్యాయ శిక్షణ గురువిద్యకు మెరుగులు

దేశవ్యాప్తంగా 42 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘నిష్ఠ’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచి, పిల్లలకు ఉన్నతస్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశారు.

సృజనాత్మక బోధన, అభ్యసన పద్ధతులు, జాతి రత్నాలను ప్రాథమిక స్థాయిలోనే సానపట్టే విద్యావ్యవస్థ ఉండాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. కొఠారి, ఛటోపాధ్యాయ, యశ్‌పాల్‌ కమిటీలు ఎన్ని సూచనలు చేసినా నేటి విద్యావ్యవస్థ నేలబారుచూపులే చూస్తోందని కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం గ్రహించింది. పాఠశాల స్థాయి దాటుతున్నా చాలామంది విద్యార్థులు మాతృభాషలో మూడు ముక్కలు తప్పులు లేకుండా చదవడం, రాయడం చేయలేకపోతున్నారన్న చేదు నిజాలను గత ఏడాది జాతీయ సాధన సర్వే నివేదిక వెల్లడించింది. ప్రకాశించాల్సిన వజ్రాలు మట్టి పట్టి మూలన పడిఉంటే అది దేశ పురోగతికి ఎంతమాత్రం దోహదపడదని, ప్రాథమిక స్థాయిలోనే ఈ రత్నాలకు సానపట్టే గురువులకే ప్రత్యేక శిక్షణనిచ్చి విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలుసుకోవడం మంచి పరిణామం.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌, టీచర్స్‌ హోలిస్టిక్‌ ఎడ్వాన్స్‌మెంట్‌’ (నిష్ఠ) కార్యక్రమం ద్వారా దేశంలో ఎంపిక చేసిన 120 ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయ విద్యా పరిశోధనా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ), జాతీయ విద్యా ప్రణాళిక సంస్థ (ఎన్‌ఐఈపీఏ), కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి తదితర ఎంపిక చేసిన సంస్థలు భాగస్వాములు కానున్నాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్యం కానున్న ‘నిష్ఠ’ ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ కార్యక్రమంగా పరిగణిస్తున్నారు. విద్యార్థులను బట్టిపట్టే విధానం నుంచి బయటకు తెచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో, సృజనాత్మకంగా సులభతర అభ్యసన, పరిశుభ్రత అలవరుచుకొని ఆరోగ్యంగా జీవించడం వంటి మార్గాలను ఎలా బోధించాలో ఇందులో గురువులకు నిపుణులు బోధిస్తారు. బడులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా బడి ఆవరణలో మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, పెరటితోటల పెంపకంపై అవగాహన, జట్టు సహకారం, నాయకత్వం సహజంగా ఆచరణాత్మకంగా పిల్లలు అలవరచుకోవాలన్నది ఒక లక్ష్యం.

ప్రాథమిక స్థాయిలోనే పిల్లలు వేధింపులకు గురికాకుండా ఎలా ఉండాలి, వేధింపులకు గురైతే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎలా తెలియజేయాలన్న విషయాలపై అవగాహన కలిగిస్తారు. పిల్లల లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేసి, వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే పిల్లలకే సరైన అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు పిల్లల పరిరక్షణ చట్టం (పోక్సో)పై మొదట ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కలిగించనున్నారు. దివ్యాంగుల హక్కులతోపాటు వారిపట్ల సమాజం వ్యవహరించే తీరుపై విద్యార్థులకు వివరించనున్నారు.

సమగ్ర తరగతి గది వాతావరణం కల్పించడం, విద్యార్థుల సాంఘిక, భావోద్వేగ, మానసిక అవసరాలవైపు ఉపాధ్యాయులను సమాయత్తపరచడం దీని లక్ష్యాల్లో ముఖ్యమైనది. ఆవిష్కరణలు మెరుగుపరచడానికి కళాత్మక బోధన, ఆరోగ్యకరమైన పరిసరాలను సృష్టించి సురక్షితమైన పాఠశాలలను ఏర్పరచడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధన-అభ్యసనలో సమర్థంగా ఉపయోగించుకోవడం ఇతర లక్ష్యాలు. ఉత్తమ మానవ సంబంధాలు నేర్పించేదే నిజమైన విద్య. సంస్కృతి నుంచి విద్యను విడదీయలేం. అది వాంఛనీయమూ కాదు. సంస్కృతిని శాసనాలు, పాఠాలుగా అమలుపరచలేం. దాన్ని సాహిత్యం, లలిత కళలు, సృజనాత్మకతగల ఆటపాటలతో విద్యార్థులకు అందించాలి. భిన్న సంస్కృతులుగల దేశంలో ప్రాంతాలవారీగా, వారి సంస్కృతి ఆధారంగా పాఠ్యాంశాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది.

‘నిష్ఠ్ఠ’ తొలిదశలో శిక్షణ అందజేసే ప్రాంతాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపికచేస్తాయి. 33,120 కీ రీసోర్స్‌ పర్సన్లు, స్టేట్‌ రీసోర్స్‌ పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వారు ఎంపికచేసిన 42 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో దేశంలో ఉపాధ్యాయ విద్య శిక్షణ సమూలంగా మార్చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. నాలుగేళ్ల ఉపాధ్యాయ విద్యను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి ఇప్పుడున్న విధానానికి స్వస్తి పలకాలన్నది ఆలోచన. దేశంలో లక్ష వరకు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అన్ని తరగతులకు అన్ని పాఠ్యాంశాలను సమర్థంగా బోధించగల ఉపాధ్యాయులను తయారుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. భారత్‌లో పాఠశాల చదువుల ప్రమాణాలు తిరోగమన దిశలో ఉన్నాయని యునెస్కో పదేపదే హెచ్చరిస్తోంది. మహారాష్ట్ర, బిహార్‌, అసోం రాష్ట్రాల్లో మెజారిటీ ఉపాధ్యాయులకు ప్రాథమిక అర్హతలు లేవన్న విషయం విస్మయం కలిగించకమానదు. విద్యా సంస్థల నిర్వహణపై ప్రభుత్వాల అలసత్వం, తల్లిదండ్రుల అవగాహనారాహిత్యం, మేధావుల మౌనం నష్టాన్ని కలగజేస్తున్నాయి. ప్రపంచీకరణకు దీటుగా ఎదుగుతూ వృత్తినైపుణ్యాల్లో జపాన్‌, చైనా విద్యావ్యవస్థలు దూసుకుపోతుంటే- పట్టెడు అన్నం సంపాదించలేని పట్టాలిచ్చి చేతులు దులుపుకొంటున్న విద్యాసంస్థలు మన దేశంలో కోకొల్లలు. పూర్తిస్థాయి హాజరు లేకుండా స్నాతకోత్తర (పోస్టుగ్రాడ్యుయేట్‌) పట్టాలు అందజేస్తున్న దుస్థితి నెలకొంది. ఉపాధ్యాయ శిక్షణ విద్య ఇందుకు భిన్నంగా లేదు. 2030 నాటికి నాలుగేళ్ళ బీఈడీ కోర్సుకు పటిష్ఠ పునాదులు వేసి, సరైన పట్టాలపై నడిపించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
Download the Nishtha application here

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :