Thursday, September 5, 2019

ఇస్రో హిస్టరీలోనే అత్యంత కీలక దశ



Read also:

ఒక్క సెకెన్ తేడా వచ్చినా.ఇస్రో హిస్టరీలోనే అత్యంత కీలక దశ: మాజీ ఛైర్మన్

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) కఠిన సవాల్ ను ఎదుర్కొంటోంది. 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామకు చెందిన చివరి కక్ష్యలో ప్రస్తుతం పరిభ్రమిస్తోన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్.. మరో నాలుగు రోజుల్లో జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. చంద్రుడి దక్షిణధృవం వైపు దూసుకెళ్తోన్న ల్యాండర్ విక్రమ్ ను సజావుగా దిగేలా చేయడం ఇస్రో శాస్త్రవేత్తలను పరీక్ష పెడుతోంది. సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగాడుతోన్న ల్యాండర్ విక్రమ్ ను చందమామ దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగేలా చేయడం అత్యంత సంక్లిష్ట దశగా ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ వ్యాఖ్యానించారు. చంద్రుడి ఉపరితలంపై ఎగుడు దిగుడు లేని ప్రదేశాన్ని ఎంచుకుని.. విక్రమ్ ను ల్యాండ్ చేయించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న ఈ ల్యాండర్ వేగాన్ని సకాలంలో నియంత్రించాలని, ఒక్క సెకెను తేడా వచ్చినా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరక పోవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రయాన్-2 నుంచి విక్రమ్ ల్యాండర్ ను వేరు చేసిన విధానం అద్భుతమైన ప్రక్రియగా మాధవన్ నాయర్ అభివర్ణించారు. ఊహించిన దాని కంటే సజావుగా ఈ ప్రక్రియ కొనసాగిందని అన్నారు. చందమామను అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో తాము ఉన్నామని, ఇప్పటిదాకా కొనసాగిన చంద్రయాన్-2 ప్రయాణం ఒక ఎత్తు కాగా.. సాఫ్ట్ ల్యాండింగ్ ఇంకో ఎత్తు అని చెప్పారు.
chandrayaan2
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే ఫొటోలను బేరీజు వేసుకుని, ఎక్కడ ల్యాండ్ చేయించాలనే నిర్ణయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉన్న కొండ ప్రాంతాలు, అగాథాలు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఉపరితలాన్ని మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడు ల్యాండింగ్ సజావుగా సాగుతుందని అంచనా వేశారు. నిర్దేశించిన సూచనలు, సంకేతాల మేరకు చంద్రయాన్-2 ప్రాజెక్టు ఇప్పటిదాకా ప్రయాణం సాగించడం, ఎలాంటి సాంకేతిక పరమైన లోపాలు తలెత్తకపోవడం వల్ల ల్యాండింగ్ కూడా విజయవంతమౌతుందనడంలో సందేహాలు అక్కర్లేదని మాధవన్ నాయర్ చెప్పారు.

విక్రమ్ ల్యాండర్ ఈ నెల 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవం వైపు అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:15 నిమిషాల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇదివరకే వెల్లడించారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చివరి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అండాకారంలో ఉన్న చంద్రుడి కక్ష్యలో ఉపరితలానికి దగ్గరిగా 114 కిలోమీటర్లు, దూరానికి 125 కిలోమీటర్ల దూరంలో తిరుగాడుతోంది. ఈ ల్యాండర్ ను సాఫ్ట్ గా దిగేలా చేయగలిగితే అంతర్జాతీయ దేశాల్లో భారత్ పేరు మారుమోగిపోతుందని మాధవన్ నాయర్ అన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత క్లిష్టమైన దశగా, దీన్ని అధిగమించితే అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాల సరసన నిలుస్తుందని చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :