Sunday, September 22, 2019

బెర్ముడా ట్రయాంగిల్



Read also:

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి.ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.

బెర్ముడా త్రికోణం పరిధి, హద్దులు

"బెర్ముడా త్రికోణం" అని ప్రసిద్ధమైనా గాని ఇది కచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయితా ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరిబియన్ దీవి మరియు అజోరెస్‌కు తూర్ప భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం - వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణం శీర్షాలు సుమారుగా - ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్, పోర్టోరికో మరియు అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి. 

ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్‌, కరిబియన్ దీవులకు చెందిన ఓడలు, మరియు విమానాలు ఇక్కడ తరచు కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని (ocean current) ప్రవహిస్తుంటుంది. దీని 5 లేదా 6 నాట్‌ల (knots) ప్రవాహ వేగం కొన్ని ఓడలు అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చును. అంతే కాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి, మళ్ళీ సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచిక్కకుండా మాయమై ఉండవచ్చును. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందకముందు.

బెర్ముడా త్రికోణం కథ మొదలు

ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని తన అక్టోబర్ 11, 1492 లాగ్ బుక్‌లో వ్రాసాడు. అయితే ఈ దృశ్యాన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూచిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకొనే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు.

1950 సెప్టెంబరు 16న ఇ.వి.డబ్ల్యు జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమయన ఊహాగానాలకు, లెక్క లేననన్ని పరిశోధనలకు ఆద్యం. తరువాత రెండేళ్ళకు ఫేట్ అనే పత్రికలో " సీ మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్" , అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత వ్రాసాడు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన ఐదు అవెంజర్ బాంబర్ విమానాలు - అన్నింటినీ కలిపి ఫ్లైట్19 అంటారు - అదృశ్యమవ్వడాన్ని వర్ణించాడు. తరువాత ఫ్లైట్19 ఘటన ఒక్కటే వివరంగా అమెరికన్ లీజియన్అనే పత్రిక ఏప్రిల్ 1962 సంచికలో వచ్చింది.  ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్నమాటలు - "మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. మేము ఎక్కడున్నామో తెలవడంలేదు". తరువాత ఇదే ఘటన గురించి విన్సెంట్ గడ్డిస్అనే రచయిత ఫిబ్రవరి 1964లో అర్గొసీ పత్రికలో వ్రాసిన వ్యాసం ఈ ఘటనకు మిస్టరీ రూపాన్ని ప్రసిద్ధం చేసింది. ఈ రచనలోనే "ది డెడ్లీ బెర్మూడా ట్రయాంగిల్" అనే ఆకర్షణీయమైన పేరు వాడాడు. ఇదే రచయిత మరుసటి యేడాది ఇన్విజిబల్ హొరైజన్స్ అనే పుస్తకంలో ఇక్కడి ఘటనల గురించి మరింత వివరంగా వ్రాశాడు.తరువాత ఈ మిస్టరీ గురించి అనేక రచనలు వెలువడ్డాయి. జాన్ వాలేస్ స్పెన్సర్ లింబోఆఫ్ ది లాస్ట్, 1969) ; ఛార్లెస్ బెర్లిట్జ్ (ది బెర్మూడా ట్రయాంగిల్, 1974); రిచర్డ్ వైనర్ (ది డెవిల్స్ ట్రయాంగిల్, 1974) లాంటివి. ఈ రచనలన్నింటిలోనూ ఎకర్ట్ ప్రతిపాదించి అసహజ, అలౌకికమైన మిస్టరీ బాణీని కొనసాగించారు.

కుశ్చే వివరణ

అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుశ్చే అనే పరిశోధకుడు అప్పటివరకూ ఉన్న వివిధ రచనలను పరిశీలించి, 1975లో ది బెర్మూడా ట్రయాంగిల్ మిస్టరీ: సాల్వడ్ అనే పుస్తకం ప్రచురించాడు.ఇందులో అప్పటివరకూ ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాలు చేశాడు. అతని పరిశీలనల ప్రకారం ఈ బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగినవని చెబుతున్న అదృశ్యఘటనలు చాలా వరకు అతిశయోక్తులతోను లేదా అసంపూర్ణ పరిశోధనతోను లేదా అస్పష్ట సమాచారంతోను తెలుపబడ్డాయి.
కొన్ని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పబడ్డాయి.
తుఫానులు తరచు వచ్చే ఇలాంటి ఇతర రద్దీ రవాణా సముద్ర ప్రాంతాలలో జరిగే ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి ఎక్కువేమీ కాదు.
మొత్తానికి కుశ్చే ఇలా తేల్చాడు - బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన. అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాఛితంగా గాని లేదా ఉద్దేశ్య పూర్వకంగా గాని ఇది ఒక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారు. చివరిమాట.

మరి కొన్ని అభిప్రాయాలు

నౌకా యానంతోనూ, సముద్ర ప్రయాణాలతోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, అ.సం.రా. తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏమీకాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాలవంటివే ఇక్కడా జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించిన సంచలనాత్మకమైన కథనాలు చాలా వరకు నిరాధారమైనవి అని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది.ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమాదంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదేహం మాత్రం కాఫీ కప్పును పట్టుకొన్న భంగిమలో ఓడలో మిగిలి ఉందని ఒక "త్రికోణం రచయిత" వ్రాసాడు. కాని నిజానికి దాదాపు అందరు మరణించినవారి శరీరాలను తీరభద్రతా సంస్థ వెలికి తీసింది.

పత్రికలు, పుస్తకాలు అధికంగా "సంచలనం కలిగించే" విషయాలపై మొగ్గు చూపుతారని, అందువల్లనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనలకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం. (NOVA / Horizon - కార్యక్రమం ది కేస్ ఆఫ్ ది బెర్మూడా ట్రాయంగిల్ 1976-06-27) - ఇతర సముద్ర ప్రాంతాలలోనూ, తుఫానులలోనూ ఓడలు మరియు విమానాలు ఎలా పనిచేస్తాయో, ఎలా విఫలమౌతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతున్నది. ఎర్నస్ట్ ట్రావెస్ బ్యారీ సింగర్  వంటి హేతువాద పరిశోధకులు కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఈ త్రికోణం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద నగరాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు కలిపి ఏటా లక్షలలో వాహనాల రాకపోకలకు కేంద్రంగా ఉన్నాయి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :