Saturday, September 14, 2019

గ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం



Read also:

ఉద్యోగుల ఎంపిక..శిక్షణ :  డిసెంబర్ లోనే ఇక..!!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ సచివాలయాల సేవలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్ 2 నుండి గ్రామ సచివాయాలు పని చేస్తాయని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే పరీక్షలు సైతం నిర్వహించారు. అయితే..సమయం మరో 20 రోజులు మాత్రమే ఉండటం..ఇంకా ఫలితాలు విడుదల కాకపోవటంతో అధికారులు ముఖ్యమంత్రి వద్ద ఇదే అంశం పైన చర్చించారు. అనేక గ్రామాల్లో ఇంకా భవనాలు..మౌళిక వసతులు కల్పించాల్సి ఉండటంతో మరి కొంత సమయం పడుతుందని వివరించారు. అదే విధంగా పరీక్షల్లో ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని..మొత్తంగా రెండు నెలల సమయం అవసరమని నివేదించారు. దీంతో పాటుగా ఆర్దికంగానూ నిధులు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు.
దీంతో..సాధ్యమైనంత త్వరగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి దీని కోసం వెంటనే 200 కోట్లు విaడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం.

ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన సమయానికి గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపించటం లేదు. అక్టోబర్ రెండున గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సచివాలయాలు ప్రారంభించి..సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ప్రకటంచారు. అధికారంలోకి వచ్చిన తరువాత దీని పైప పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక, ఈ ఉద్యోగాల కోసం ప్రభుత్వం పరీక్షలు సైతం నిర్వహించింది. దీనికి దాదాపె 21 లక్షల మంది పోటీ పడ్డారు. ఇప్పటికే వాలంటీర్లు వ్యవస్థ ప్రారంభం కావటంతో..ఇక గ్రామ సచివాలయాలను సైతం అందుబాటులోకి తీసుకురావటం ద్వారా సేవలు ప్రజలకు దగ్గరవుతాయని ముఖ్యమంత్రి భావించారు. అయితే దీని పైన ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో అధికారులు అసలు విషయం బయట పెట్టారు. పలు గ్రామాల్లో సచివాలయాలకు అవసరమైన మేర భవనాలు లేకపోవడం, కొన్నిచోట్ల భవనాలున్నా మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో అలాంటి వాటిలో ఆఫీసు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష ఫలితాలను ప్రకటించి వారికి శిక్షణ అందించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. కొంత సమయం అవసరం అవుతుందని.. అక్టోబర్ రెండు నుండి ప్రారంభించటానికి ఇప్పుడున్న సమయంలోగా అన్ని ఏర్పాట్లు చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ లోనే సచివాలయాల ఆరంభం..

గ్రామ సచివాలయాల భవనాలకు రంగులేసి ఫర్నిచర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకు శిక్షణ పూర్తి చేయాలి. వారికి జాబ్ చార్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంత పాటుగా వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించా లని అధికారులు కోరారు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ నిధులకు ఇబ్బంది లేదని..సాధ్యమైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారుల ప్రతిపాదన మేరకు వెంటనే రూ 200 కోట్లు విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక..ఈ నెలాఖరు లోగా అభ్యర్ధుల ఎంపిక కార్యక్రమం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అంటే..దాదాపుగా డిసెంబర్ లో గ్రామ సచివాలయాల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 15న వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించటంతో..అదే రోజున గ్రామ సచివాలయాలను ప్రారంభించి డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో సేవలు అందించేలా అధికారులు ప్రయత్నించాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. రైతు భరోసారి ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించటంతో..ఆయన వస్తే అదే సమయంలో గ్రామ సచివాలయాలను సైతం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆలోచన. మరో రెండు రోజుల్లో దీని పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :