Sunday, August 25, 2019

అంతరిక్షం ఎప్పుడూ మిస్టరీనే



Read also:

అంతరిక్షం ఎప్పుడూ మిస్టరీనే. అంతుచిక్కని బ్రహ్మపదార్థమే. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా, ఎన్ని ప్రయోగాలు చేస్తోన్న ఆ మిస్టరీ వీడేది కాదు. ఈ అనంత విశ్వంలో మన స్థానం కేవలం సూది మొన మోపినంతే. మన భూగోళం ఉంటోన్న పాలపుంతకు అవతల అర్థం కాని, మన విజ్ఝానానికి అందని ఓ సరికొత్త ప్రపంచం ఉందనేది సుస్పష్టం. దాన్ని ఛేదించడానికి దశాబ్దాలుగా చేస్తోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావట్లేదు. మరో జీవం కోసం కొనసాగిస్తోనన అన్వేషణకు పుల్ స్టాప్ పడట్లేదు. భూమి అనేది ఒకటి ఉందని, అక్కడ మనుషులు జీవిస్తున్నారని తెలియజేస్తూ.. మన ఉనికిని చాటుకోవడానికి తలపండిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు దశాబ్దాలుగా అంతరిక్షంలోకి పంపిస్తోన్న సంకేతాలు అంతు లేకుండా పోతోందే తప్ప.
space center
తాజాగా- ఈ నిరీక్షణకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. మన పాలపుంతకు సంబంధం లేని గెలాక్సీ నుంచి భూమిపైకి కొన్ని అర్థం కాని సంకేతాలు అందుతున్నాయని అంతరిక్ష పరిశోధకులు తాజాగా స్పష్టం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఎనిమిది రకాల అర్థం కాని సంకేతాలు భూమికి అందుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు `ఫాస్ట్ రేడియో బర్స్ట్ (ఎఫ్ఆర్బీ)`. టెలిస్కోపుల ద్వారా దీన్ని పసిగట్టారు. ఈ సంకేతాలను విశ్లేషించే పనిలో పడ్డారు. వాటిని డీకోడ్ చేస్తున్నామని వెల్లడించారు. ఈ విశాల ఆకాశంలో ఎక్కడో ఓ చోట జీవులు ఉండే అవకాశం ఉంటుందనే తమ అనుమానాలకు ఈ సంకేతాలు మరింత బలాన్ని ఇస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కెనడాలోని హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ టెలిస్కోప్ ఈ సంకేతాలను గ్రహించాయట.

2007లోనే తొలి సంకేతం.

నిజానికి అంతరిక్షం నుంచి 2007లోనే తొలి సంకేతం (ఫాస్ట్ రేడియో బర్స్ట్-ఎఫ్ఆర్బీ) అందిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సుదూర ఆకాశం నుంచి జీవుల ఉనికిని పసిగట్టడానికి ఏర్పాటు చేసిన సిగ్నల్ రిసీవర్ల ద్వారా డజన్ల కొద్దీ సంకేతాలు అందాయని, వాటిల్లో రెండు మాత్రమే అంతరిక్షం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ రెండు కూడా రిపీటెడ్ గా వచ్చాయని, వేర్వేరుగా ఉన్న రెండు సంకేతాలు పదేపదే రికార్డు అయ్యాయని తెలిపారు. అంతరిక్షం నుంచి అందిన సంకేతాల్లో ఏవైనా కొన్ని రిపీట్ అయితే.. వాటికి శాస్త్రవేత్తలు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలాంటివి రెండే కాదు.. ఎనిమిది రకాల వేర్వేరు సంకేతాలు పదే పదే సిగ్నల్ రిసీవర్లలో నమోదు అయ్యాయని చెబుతున్నారు. ఈ ఎనిమిది రకాల ఎఫ్ఆర్బీలు కూడా మన పాలపుంత నుంచి వచ్చినవి కాదని తేల్చారు. మన గెలాక్సీకి అవతలి వైపున ఉన్న అనంత అంతరాల నుంచి వచ్చినట్లు తమ విశ్లేషణలో వెల్లడైనట్లు తెలిపారు.

మిస్టరీ సంకేతాలను పంపిస్తున్నదెవరు?

ఆ సంకేతాలను పంపిస్తున్నది ఎవరు? ఆ సంకేతాల అర్థమేంటీ? వారి ఉద్దేశమేంటీ? అనేది ప్రస్తుతం శాస్త్రవేత్తల బుర్రలకు అర్థం కాని ప్రశ్నలు. వాటిని డీకోడ్ చేస్తున్నామని, త్వరలోనే ఆ సంకేతాలకు గల అర్థాన్ని తెలుసుకుంటామని చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే వాటిని ఎందుకు పంపించారనే విషయం సైతం కొరుకుడు పడట్లేదని అంటున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి కృష్ణ బిలంలో పడ్డ నక్షత్రంలో తయారైందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎనిమిది రకాల ఎఫ్ఆర్బీల వంటివే కృత్రిమంగా తయారు చేయడం వల్ల వాటిని ఛేదించడానికి ఓ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా తాము ప్రయత్నాలు సాగిస్తున్నామని తెలిపారు. ఎనిమిది రకాల వేర్వేరు సంకేతాలు.. రిపీటెడ్ గా రావడం వెనుక ఆంతర్యమేమిటనేది తెలుసుకోవడం కష్టమైందని అంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :